EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

23/02/2012

అందంతే అలా జరిగిపోతుంటుంది..


వేకువ జాముననే లేచి నడిచినంత మాత్రాన
చీకటి పోయి సూర్యోదయం వచ్చినట్టుకాదు..
సాయం సంధ్య లో బతుకు మసకబారిందని జడిసి
నింగి చుక్కల చీర కట్టుకున్నట్టు కాదు..
ఎందుకని ప్రశ్నించకు
అందంతే అలా జరిగిపోతుంటుంది
కాలం కర్పూరమై కరిగిపోతుంటుంది

పేద, గొప్పతేడా ఎక్కడుంది
కనుల రెప్పలు మూసినప్పుడు
కలల రెక్కలు విచ్చుకుంటాయి
కనులు తెరిచి చూసినప్పుడు
అలజడి అలలు క్రమ్ముకుంటాయి
పుట్టుక, చావు మాత్రమే సమానమై
బతుకంతా తారతమ్యం ఉన్నప్పుడు
పగటి కలలు కూడా పగబట్టి
ఒక నిర్దిష్ట వలయంలోనే ఉండిపోతాయి

ఎంతగా నటించినా మోముపై పులుముకున్న
నవ్వుల ఇంద్రధనస్సు వట్టిదని తేలిపోతుంది.
ఎంతగా దట్టించినా మాటలలో నింపుకున్న
డాబుసరి గాలి తీసిన ట్యూబులా వాలిపోతుంది.

నిస్సహాయంగా చూసే కళ్ళను తప్పు పడితే ఏమోస్తుంది.
జలపాతమై నేల రాలే కన్నీటి చుక్కలు తప్ప
నిర్దయగా మారిన మనసు పొరలను తిడితే ఏమోస్తుంది
వికలమైన నోట రాలే సారీ అనే రెండు పదాలు తప్ప

15/02/2012

ఆశ

నల్లబడ్డ ఈ ఆకాశంలో
ఉరుమునై ఉరిమి
మెరుపునై మెరిసి
వాన చుక్కనై నేల రాలాలని ఉంది..
నేలరాల్చుకున్న కలలను
దోసిలిపట్టి పైకి లేపి
వాటికి స్వేచ్చారెక్కలు తొడిగి
ఎగురవేయాలని ఉంది..
నేలవాలిన కొమ్మల శిరస్సులను
నిటారుగా పైకి నిలిపి
చిగురుల మొలకలు వేయించాలని ఉంది..