EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

15/12/2011

అక్షరం మరణించదు


ఒక్క పదం చాలదా
వేల ఆలోచనలు పుట్టడానికి .
ఒక్క చురక చాలదా
నిద్రిస్తున్న మెదళ్ళు మేల్కొనడానికి
అహంకారంతో కళ్ళను మూసుకొంటే
అక్షరాలు  తిరుగుబాటు ప్రకటిస్తాయి
ఇమిడివున్న భావాలకు ఏదో ఒక రంగు పూస్తే
అవి రగిలే గుండెల శ్వాసగా మారుతాయి ..
కలాన్ని ఇజాలనే చట్రంలో బంధించేస్తే
అరచేతుల్లో సముద్రాన్ని పట్టిపెట్టినట్టే !
శవాన్ని పాతిపెట్టినట్టు అక్షరాలను
నేలలో పాతాళానికి పాతలంటే
అవి నిర్జీవమైన శవాలు కావు శరాలు
మొలకలై మొలకెత్తి .. చిగురులై శిరస్సు ఎత్తి
కొమ్మలు రెమ్మల్లుగా అల్లుకుపోయే
జీవితాల పరిమళాల్ని  పెనవేస్తుకున్న బీజాక్షరాలు !
అక్షరం మరణించదు
ఆలోచనా మరణించదు
మరణిస్తే
అది అక్షరమెందుకు అవుతుంది ..
ఆలోచన ఇవ్వకపోతే
అది చైతన్యమెందుకు అవుతుంది ..!!

09/12/2011

కావ్యనాయిక

 
 
 
 
ఆదమరచి నిదురించిన రేయిలో
కమ్మని కలగా నీ తలపు
తీరని ఉహాలు నిజమైనట్టు భ్రాంతి
ఇంతలో కళ్ళ రెప్పల తలుపులపై
వాస్తవాలు తట్టిలేపుతున్న సూర్యోదయం !
చీకటి తలుపులు తీసి చూసానా
నవ్వుతూ నీవు కనిపించిన దృశ్యం
నా మనిష్కంలో అలా ఉండిపోయింది
కల నిజమైయే కాలం కోసం
కల కాలం ఎదురుచూస్తూ వున్నా ..
చిరు గాలి తరంగాలు తగిలిన నీవు పిలిచినట్టు
సెలయేరు నీటి గల గలలు విన్న అది నీ అందెల సవ్వడి అన్నట్టు
కోటి ఆశల అఖిలాండమై వెలుగూతూనే వున్నా ..
అక్షరాల నిధిని పోగుచేసుకున్నా
నీ భావాలు కరువైతే పదమైన కదుపలేకున్నా
ఓ కావ్య నాయికా ...
నా కలం బలం నీవే .. నా కావ్య సౌందర్యం నీవే

08/12/2011

మృగంతో జీవనం






ఏమి జరగనట్టు
నవ్వులు అలా పులుముకొని
అలా బయటికి వెళ్లిపోతావ్
ఇంట్లో పగిలిన వస్తువుల మధ్య
నిట్టూర్తున్న హృదయపు విలాపం
నీకు వినపడవు !
అయినా నీవు ముసుగేసుకొని
నడుస్తూనే వుంటావ్ ..
కరచాలనంగానో , కబుర్ల టీ కొట్టులోనో
నిన్ను పోగొట్టుకొని
లాగి పారేసిన సిగరెట్టు కంపై కుమిలిపోతావ్ ...
నిన్ను ఎదిరించిన ప్రశ్నకు
కసిగా నీవు ఏదో చేయాలని
బెదిరించాలని, బెదరగోట్టాలని
రెండు పెగ్గుల మతై
గుమ్మం ముందు వాలిపోతావ్
అమ్మలా నిన్ను చేరదీసి
నీవు కక్కిన బూతుల వాంతులను
సహనంతో శుబ్రం చేస్తుంది
తాను పస్తులుండి
నీకు కడుపారా అన్నం పెట్టి
రెప్ప వేయని రాత్రవుతుంది ..
నీవు గోర్లతో రక్కిన గాట్ల నుండి
ఉదయం రక్తమై స్రవిస్తుంది
నీలో మృగం మళ్ళే లేస్తుంది .!!
తర తరాలుగా ఆమె బతుకు
పులి నోట చిక్కిన లేడి అవుతుంది ..

27/11/2011

ఎడారిలో వసంతం

గుప్పెడు కూడా లేని గుండె
నీకు ఓ ఆలయం అయింది.
కళ్ళు నీ కలల కాణాచిగా మరి
స్వప్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయి
తలపులు నీ మైమరపులో మునిగిపోయి
తన్మయత్వంతో తేలియాడుతున్నాయి ..
నా జీవన కోటకు రాణిగా మారిన నిన్ను చూసి
నాలోని ఆణువణువూ సైనికుడిగా మారి
నీకు  రక్షణ గా వుండాలని పోరుతున్నాయి
నిన్న నీవు నవ్విన్న నవ్వుకు
నా మనసు సెలయేరు పరవళ్ళు తొక్కుతోంది
నీవు చూసిన వాలు చూపుకు
నిండు ఎడారిలో  సైతం వసంతం విరబూస్తోంది!!

11/11/2011

రెక్కలు





సూటి పోటీ మాటలు
తూటాల్లా తగులుతుంటే
గుండెల్లో సూది గుచ్చుకున్నట్టు
తల్లడిల్లుతాము ...

ఎదుగుతున్న మనకెదురుగానే
అడ్డంకుల ఆనకట్టలు కడుతుంటే
ఏమిటీ లోకం తీరని వాపోతాము..

విసిరిన రాళ్ళకు విసుగుచెందితే
చెట్లు పండ్లను ఎలా అందిస్తాయి ...
అలల తాకిడికి అలిసిపొతే సంద్రం
సాగరం ఎందుకు అవుతుంది ..

వెక్కిరించిన చోట
వెక్కి వెక్కి ఏడువడం
చేతకాని పని
వెంటాడి వేటాడిన చోట
వెన్ను చూపి పారిపోవడం
పిరికి లక్షణం ..

చిక్కటి కష్టాల చీకట్లలోనూ
చిరునవ్వులు దీపాలుగా వెలిగించుకోవాలి
కలసిరాని కాలం కాటేస్తున్నప్పుడు
ఓర్పు మంత్రం పటిస్తూ ఓపిక పట్టాలి

చిక్కు ముడులు పడిన చోట
చికాకు పనిచేయదు ..
అడుగు ముందుకు పడని చోట
పరుగు పనిచేయదు !!

రెక్కలు తెగిన చోట
పైకి ఎగురడం తొందరపాటు అవుతుంది
దిక్కులను రెక్కలు చేసుకొనే నేర్పు
జీవితాన్ని అర్ధవంతం చేస్తుంది ..







03/11/2011

చావు కేక !!

 
నరాలన్నీ బిగించి
తమ హక్కుల కోసం వారు
గొంతెతక్కక పోయివుందోచ్చు
తమ కన్నీటిని తామే తాగి
మన నోటికి ముద్దలు అందించి ఉండొచ్చు ..
పంచ భూతాలను తమ నాగలి తో శాసించి
వితై భూమిలో దిగి
చిగురై నేలను చీల్చుకు పైకొచ్చి
ధాన్యరాసిగా మన వాకిట్లో వాలి ఉండొచ్చు ..
ఆ అన్నదాత తండ్రి కన్నా గొప్ప వాడు
మనల్ని శపించి వీధి పాలు చేయలేదు ..
ప్రభుత్వాల్ని ధిక్కరించి బంద్ లు చేయలేదు
రాస్తా రోకోలు ,, రైలు రోకోలు చేయలేదు
చేతులు కాలుతున్నా మౌనం వహించాడు
ప్రభుత్వం కళ్ళు తెరవడానికి
పంట విరామం ప్రకటించాడు ..
అయినా దొరల మనసు కరుగలేదు ..
రైతుల దుస్తితి పై కనికరం చూపలేదు ..
పండిన పంట రైతుకు రొక్కం రాక పొతే
రైతు నోట్లో మట్టి కొట్టినట్టే !
ఉరికొయ్యకు రైతు వేలాడితే
ఊరు స్మశానమయినట్టే !!
 

02/11/2011

అనుకోలేదు

నీ నవ్వును ముత్యాలతో పోల్చితే
మరింత నవ్వుతావని ఆశించాను
సిగ్గుతో ముడుచుకు పోతావనుకోలేదు..
నీవు అజంతా శిల్పంలా వున్నావని పొగిడితే
రోజు దర్శనం ఇస్తావని ఊహించాను ..
కనిపించడం మానేస్తావని అనుకోలేకపోయాను !
చివరకు నీవే నా ఊపిరివని కనిపిస్తే చాలన్నాను
నాతొ ఏడు అడుగులు నడిచి నాలో సగమైయావ్వు ..
నా జీవనానికే ఓ అర్ధాన్ని తెచ్చిన అర్ధాంగివయ్యావు!!
 

01/11/2011

అంతర్ముఖం

 
 
బయట కనిపించే నేను
నేను కాదు
చిరునవ్వుతో కప్పిన నా పెదవుల వెనుక
తొక్కిపట్టిన ఎంతో క్రోధం వుంది
స్వాగతంతో చేసిన కరచాలనంలో
ఊహ్యత్మకంగా వేసుకున్న ముసుగులున్నాయి.
నేను కనిపించే నేను కాదు
మాటలకు మర్యాద పులుముకొని
తోడుగుకొన్న ఇస్రీ బట్టల వెనుక
సల సలా కాగిపోతున్న కుల్లుబోతుతనం వుంది ..
ఈర్ష్య అసూయల నడుమ బందీగా మారిన నేను
ఎదుగుతున్న మొక్కల చిగ్గుర్లను తుంచివేసిన
కసాయి తనం వుంది..
మీకు తెలుసా వ్యాపారం అంటే ఏమిటో
నాకు తెలుసు
నవ్వులను మార్కెటింగ్ చేయడం తెలుసు
చెవిలో పువ్వులను పెట్టి నమ్మిన వాళ్ళను పూల్స్ గా చేయడం తెలుసు
అయితే మనసుకు సమాధానం చెప్పలేక పోతున్న
వేస్తున్న వేషాలకు .. చేస్తున్న చేతలకు పొంతన లేక
రాక్షసుడిగా వుంది మనిషిగా జీవించలేకున్నా..
నరకం అంటే నాకు తెలుసు
నా ముందు నవ్వి ...నా వెనుక నన్ను తిట్టినా వాళ్ళు ఎందరొ
నాతొ పని పూర్తి చేసుకొని ఆ తరువాత హాండ్ ఇచ్చిన వాళ్లెందరో ..
నమ్మకమైన వారిని సంపదించలేక పోతున్నా

27/10/2011

మౌనం గాయమై !

 
కనిపించి కనిపించగానే
మోము దాచేస్తావు ఎందుకు ..
నీ చిరునవ్వు పువ్వు కోసం
నేను ఎదురుచూస్తుంటే
నా చెవిలో పువ్వు పెట్టేస్తావెందుకు ?
కలలో కనిపించి , మురిపించి
ఇలలో అలా ఏమితెలియనట్లున్తావ్ ఎందుకు ?
నా ప్రశ్నలకు నీ మౌనం సమాధానమా
నా నిరీక్షణకు మోహం చాటేయడం న్యాయమా ?
గుండె వేయి ముక్కలైనా ప్రతి ముక్క నిన్నే చూపుతోంది
కన్నీరు కాల్వలై పారి బతుకును ముంచుతోంది
నా ఆరాధనంతా నీ కోసమేగా
నీవు దేవతవై కరుణిస్తే జీవితాంతం పూజారిని కొలుస్తా ..!
నీవు బండరాయివై ఉండిపోతే నేను శిలగా మారిపోతా  ..!!

నువ్వు బతికేది నీకోసమేనా ?


చిన్నపటినుండి చూస్తునా
మిత్రమా నువ్వు బతికేది నీకోసమేనా
కొత్త బట్టలు కొంటే అందరూ మెచ్చాలని చూస్తావ్
అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలని
...
అందరూ నిన్ను పొగడాలని తహ తహలాడుతావ్
ఇంతకీ నీకు కావలసినదేదో నీకు తెలుసా
అందరికన్నా మిన్నగా వుండాలనుకొని
వారి అభిప్రాయాలకోసం ప్రాకులాడటం ఎంత విచిత్రం
నీకో రుచి లేదా ..నీకో అభిరుచి లేదా
నీకంటూ గుర్తింపు వారిస్తేనే వస్తుందా?
నీ పెళ్ళిలో నీవు విందు వినోదాలకోసం
స్నేహితుల మెప్పు కోసం ఎంతగా తపన పడ్డావో గుర్తు ఉందా.
ఆఖరికి జీవిత భాగస్వామి కూడా తెల్లగా వుండాలని
ఆమెను అందరూ మెచ్చాలనుకున్నావేకాని
నీకు నచ్చిందో లేదో ఎప్పుడైనా ఆలోచించావా
ఎవరికోసమో బతుకుతూ ఆత్మ నూన్యతతో వుంటే
అది నీ బ్రతుకు ఎందుకవుతుంది ..
పారే జలపాతంలా ఎందుకు స్వచ్చంగా వుండలేకున్నావు
కోవెల ప్రశాంతత ఎదలో లేకుండా ఎందుకు మదన పడుతున్తావు
నీకోసం బ్రతుకు ..నీకు నచ్చిందే చేయి
అప్పుడు నీ ఆత్మ సంతృప్తి ముందు కోట్లు వృధా ..
నీదంటూ ఓ ముద్ర వేయి ..
అప్పుడు నీ వెంబడి నడిచే వారికే నువ్వు స్ఫూర్తి ..

24/10/2011

కాలం కరుణిస్తుంది !

 
 
 
ఎంత దూరాన వున్నా నేమి
నువ్వు నా దగ్గర ఉన్నట్టే వుంటుంది
మాయని నీ జ్ఞాపకాల ఊసుల్లో
జీవితం గడిపేస్తున్నా.
కలకాలం కలసి ఉండాల్సిన మనల్ని
కాలం  వేరు చేసి బొమ్మలాట ఆడుతోంది !
కలికాలం అనుకోని , కష్టమైనా
తలపుల కౌగిల్లో ఒదిగిపోవడం
మనకు తెలుసనీ తెలియదేమో
దగ్గర వున్నప్పుడు తెలియని
అనురాగాలు ఇప్పుడు తెలిసొచ్చింది
నువ్వు నాకు ఎంత అవసరమో
నేను నీకు ఎంత అవసరమో
నిశబ్దంలో వుంది ఆలోచిస్తుంటే తెలుస్తోంది
కటిన కాలం కరిగి మన కోసం
తివాచిగా మరి స్వాగతిస్తుంది
ఇద్దరినీ ఒక్కటి చేసి
కలసి ఉండమని ఆశీర్వదిస్తుంది !!

22/10/2011

ఉక్కు సంకల్పం



 
 
 
 
 ఒక్కొక్కసారి ఉక్కు సంకల్పం
దూది పింజలా సడలి పోతుంటే
దూరంగా వున్న లక్ష్యపు తీరం
రాను రాను మరింత దూరమవుతుంటే
అడుగు పెట్టిన నేలంతా పాతాళంలోకి కూరుకుపోతుంటే
... నేస్తమా !
రెక్కలు తెగిన పక్షినై నేలకు రాలి పోతాననుకున్నావా
దిక్కులు తెలియక ఒంటరినై కుమిలి పోతానని అనుకున్నావా
నీవు ఇచ్చిన గుండె ధైర్యం ఊతం చాలు
ఊపిరినే నింగికి నిచ్చనగా వేసుకు ఎదుగుతా
ఆశయాల స్ఫూర్తి చాలు
బీడు బారిన బతుకు ఎడారిలో
ఆశల గులాబీలు పూయిచుకుంటా ..
ఓటమి ఎదురైనా ప్రతిసారి నీవిచ్చే స్వాంతన చాలు
ఓరిమి బలిమితో విజయ శిఖరాలు అధిరోహిస్తా ..
ఈ జన్మను సమాజానికి ఓ తోరణంగా అలంకరిస్తా.

18/10/2011

అమ్మమ్మ

చెమట చుక్కలు చిందిస్తున్న
ఆమె విశాలమైన నుదురు
వర్షించే ఆకాశంలా వుంది
చెమర్చిన కళ్ళ లోగిళ్ళలో
సునామీలు దాగున్నాయోమో ?
వంట ఇల్లే ఆమె ప్రపంచమై
మూడు దశాబ్దాలు దాటిందనుకుంటా
వండి వార్చి వడ్డించడమే జీవితమై
తనకేమి  కావాలో మర్చి పోయింది
ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చి తలోదిక్కు వెళితే
వారి పిల్లలకు మళ్ళీ  తల్లిగా మారింది ..
లోకం తెలియని మనిషిగా ముద్రించబడి
శోకం మాత్రమె తెలిసిన సీరియల్ నటిగా మారిందేమో
ఒక నిర్వేదం , ఒక నిటూర్పు కూడా కనబడనీయక
పిల్లల ఫోన్ పిలుపుకోసం చకోరమవుతుంది .
పండుగలోస్తే అందర్ని రమ్మని పిలిచి
వారి వారి రుచులలో తాను కలగలసి పోతుంది
ఇవ్వడమే తెలిసిన తనకు ఆస్తులు లేవు కాని
తన జీవితాన్నే అంకితం చేసిన దేవతగా కనిపిస్తోంది.

నువ్వు - నేను


నీలాల గగనాల మేఘమై నీవు
పాతాల , జలపాతాల నీరును నీను
వేడి ఆవిరిగా మారి నిను చేరుకుంటాను ..
చల్లని  నీ స్పర్శలో తడిచి ముద్దయి
చినుకునై నేలరాలి పోతాను ..
పిడుగుల శబ్దాలు భయపెట్టినా
మెరుపుల మాయజాలాలు చుట్టూ ముట్టినా
ఈ మన బంధం వీడి పోదు ..
ఈ చక్ర భ్రమణం ఆగిపోదు ..

16/10/2011

నీవే నా ప్రాణమూ !





ఆశల ఆవనిలో
నిటూర్పుల తుపాను ..
ప్రేమల బృందావనంలో
 విరహానల  జ్వాలా ప్రభంజనాలు ..
ఎటు పాలు పోనీ నాకు
జీవితమే ఓ సుడిగుండమైనప్పుడు
ఎగిసి పడే అలగా మారిన నేను
కెరటమై తీరం కోసం వెతుకులాడుతున్నా ..
ఆలంబనగా మారిన నీ పిలుపులో
పోయిన ఆశల చిగుర్లను  తిరిగి చూస్తున్నా.
ఎందుకో తెలియదు నీ మాట కూడా
నన్ను నడిపే దిక్సూచి అవుతోంది ..
ఏమిటో తెలియదు నీ స్పర్శ కూడా
నాలో కొత్త ధైర్యాని నింపుతోంది ..
ఒట్టి పోయిన ఆకాశంలో
నువ్వు ఇంద్ర ధనుస్సు వై విరబూసి...
ఇంకిపోయిన నా లోలోని
జీవన మాధుర్యాన్ని నాలో తిరిగినింపు ..!

ఎడారి

 
మనసు ఎడారిగా
మారిపోయింది
లేకపోతె ఏంటి
ఇంతకు ముందు
దుఖం అయినా, సంతోషమైన
కళ్ళల్లో కన్నీరు ఉప్పొంగేది ..
ఇప్పుడు
కళ్ళ లోగిళ్ళలో
ఇసుక లాంటి నిర్లిప్తత
రాజ్యమేలుతోంది
ప్రాణమున్న కళ్ళు
గాజు కళ్ళయాయి..
ప్రాణమున్న మనిషి
జీవచ్చవమైనాడు !!

15/10/2011

అక్షర సత్యం !

అక్షరమై పుట్టిన నేను
ఆలోచన పదమై పెరిగి
వాస్తవ వాక్యమై విస్తరించి
కవితగా భావాలద్దుకొని 
పాటగా జనం గుండెల్లో
పల్లవించాలని వుంది ..
చీకటి రాజ్యంలో
చైతన్య జెండాగా
మనిషి ఎగురుతుంటే
అదే నా జీవితానికి సార్ధకత ..
మనిషి నిటారుగా నిలబడి
మానవత్వంతో వికసిస్తుంటే
అదే నా గమనానికి ఓ లక్ష్యత !!

14/10/2011

కాకి కథ

కాకి కోయిల పోటీ పడ్డాయి
కోయిల కమ్మని గానంతో
పాడుతుంటే ఆహ్లాదంగా
అందరూ మైమరచారు ..
కాకి గొంతువిప్పి పాడితే
గులక రాళ్ళ శబ్దమని
రాలు విసిరారు ...
కట్ చేస్తే..
పెద్దల పండుగ వచ్చింది
పిండ ప్రదానం చేసిన వారు
ఇంట్లో పూజ చేసిన వారు
చనిపోయిన పెద్దలకు ముందుగా నైవేద్యం పెట్టాలని
ఇంటి వాకిట్లో నిలబడి
కాకుల్నికావు కావు అని అరిచి  ఆహ్వానించారు ..
ఇది చూసి కోయిల అంది
నా విలువ నా గొంతుకే
నీ విలువ వారి జీవితానికే !!

బంగారు బాల్యం!



అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
నాన్న భుజాలపై ఊరేగిన బాల్యం
అక్షరాలూ దిద్ది  బడిలో ఆడుకున్న బాల్యం
రెక్కలు తొడిగి నింగిన గాలి పటమై ఎగిరిన బాల్యం
చందమామతో స్నేహం చేసి వెన్నల నవ్వులై విరిసిన బాల్యం
నేడు ఓ జ్ఞాపకమేనా ..
కుల మతాలు లేకుండా పంచుకున్న కాకి ఎంగిళ్ళు
ఆడా మగా తేడాలేకుండా గిచ్చుకున్న ఆటల ముంగిళ్ళు
పిల్ల కాల్వల వెంట లేగ దూడలై ఎగిరిన గంతులు
నేడు ఓ తీపి గురుతేనా !
అప్పటి బాల్యం ఓ బంగారు ప్రపంచం ..
నెమరేసుకుంటే చెమర్చిన కళ్ళను అడుగు
జ్ఞాపకమై మెరిసిన ఇరుగు పొరుగును అడుగు
అక్కడే ఆగిపోయింటే ఎంత బాగుండేదని అంటాయి
స్వచమైన మనసుల నడుమ
స్వేచ్చగా మసలిన ముక్కుపచ్చలారని బాల్యం
బతుకు బందీఖానాలో నేడు బిక్కు బిక్కు మంటోంది
మనం కోల్పోయిన బాల్యాన్ని మన పిల్లల కిద్దాం
పిల్లల్ని పుస్తకాల పురుగులు చేయకుండా
అచ్చమైన మనుషులుగా స్వచంగా పెంచుదాం
నేటి యాంత్రిక  యుగంలో యంత్రాలుగా పిల్లల్ని చూడకండి !
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై గుర్రపు పందాలు కాయకండి !


                                                    కరణం లుగేంద్ర పిళ్ళై












07/10/2011

చేతనాగీతం !



వేదనల ఉక్కు పిడికిళ్ళలో
విల విల లాడుతున్న మనిషిని
సంతోషాల వేదంగా మార్చాలని ప్రయత్నం!
తల్లడిల్లడం మాని  తూర్పు పురిటి గడ్డన
చీకటిని తరిమే సూర్యుడు గా అవతరించాలని యత్నం !
ఈ యజ్ఞం విఘ్నం కాకుండా ఉండాలంటే
ఘోర తప్పస్సు చేయనక్కరలేదు
సాటి మనిషిని ప్రేమిస్తే చాలు ...

కాసింత  మమతాస్పర్శ అందించినా చాలు ..
అయితే మనం ఏమిచేస్తున్నాం ?
నిరాశతో నిండిన వాడిని 
మాటల తూటాలతో నేలకూలుస్తున్నాము ..
రక్కసులమై , రాక్షసులమై వేధించి ,పీడించి
భాదల సుడి గుండాలలోకి తోసేస్తున్నాము ..
ప్లీజ్ మనం మారుదామా!
చేతనా గీతాలమై పల్లవిద్దామా
ఎండిన ఎడారి ఇసుక రేణువులలోనైనా 
నమ్మకం తోలిచిగురై మొలకెత్తి
నిలువునా కృంగిన మనిషిని 
నిలువెత్తు జీవితంగా ఆవీష్కరిస్తుంది

ఆనందం గమ్యమైన జీవితాన్ని
ప్రతి లోగిలో నింపుదామా !
ఆనాడే కదా  నిజమైన పండుగ!
ఇలాతలంపై ఇంద్ర ధనుస్సు గా
మానవత్వం విరుస్తుంది నిండుగ!!

                                      -   కరణం లుగేంద్ర పిళ్ళై





నివేదన

కోయియిలకు చెప్పాను
నా పాట  తన గొంతులో నీకు
పాడి వినిపించమని ..
కనిపించిన ప్రతి చెట్టుకూ చెప్పాను
తానూ ఇలా వస్తే నీడలా ఆదరించమని
చిరుగాలికి చెప్పాను
చల్లని పైరగాలిగా నిన్ను జోకోట్టమని 
ఇంద్ర ధనుస్సు తో అన్నాను
తన రంగులతో నీకు రంగోలిగా మారమని
నీతో చెప్పాలని వుంది
నీవు మాత్రం తోడై వుంటే చాలని ..
నీతోనే జీవితం వికసిస్తుందని !!



06/10/2011

చలి చీమలు !


ఆంబోతులు కొట్లాడుకుంటే చలిచీమలు ఏమవుతాయి ..
సమిధలై , పరమపద సోపానలై అమరవీరులై తరిస్తాయి
పదవులే పరమార్థమై మనసు రాతి బండగా మారిన వారికి
సాటి మనుషుల వ్యధ ఎలా అర్థమవుతుంది !
గుడిసెల గుండెల్లో బరిసెలు దింపుతున్న
బడా బాబులకు ఎప్పుడూ  ఏమికాదేమి ?
దేనినైనా వారు తమకు అనుకూలంగా మలుచుకుంటారు
ప్రతి సంఘటన నుండి తాము పొందాల్సిన లబ్ది తప్ప
వార్తల్లో విరుచుకుపడే నాయకత్వం బలిమి తప్ప
సమ్మె పోటుతో చలిమంటలేసుకున్న వెచ్చదనం తప్ప ..
ఇంకేమిపట్టని పక్కా వ్యాపారవేత్తలవుతున్నారు ..
మనుషుల మధ్య విభజన రేఖ గీసి , సమాఖ్య పరిధులు గీసి
మాట్లాడలేని మౌనాన్ని ఢిల్లీ వీదుల్లో వేలం వేస్తుంటే
మనం చేస్తునదేమిటి ?
కళ్ళు ఆప్పగించి చూడడం, సానుభూతి ఓట్లుగా మారడం
కష్టాల్ని కొనితెచ్చుకొని కొలిమిగా బగ బగ మండిపోవడం
లేకుంటే ఆత్మహత్యల మంటల్లో మసి కావడం ....
నాయకులు ఏమికారు , వారి పిల్లలు ఏమికారు
అనుచరులే ఆవేశానికి గురై అర్పనకు గురువుతున్నారు ..
మట్టిని కూడా మార్కెటింగ్ చేయడం ...
ప్రాంతాన్ని కూడా ఆత్మాహుతి దళంగా తయారు చేయడం
మనిషి నేర్చుకున్న ఆధునిక నేర్పరితనమేగా ..
ఏ వాదమైనా జన హితం కోరితే వేదమే అవుతుంది
ఏ భావనైనా శాంతిని కోరితే చిత్రమై వెళ్లి విరుస్తుంది
వాదాలు, వితందవాదాలు  తెలియని పేదవాడు
నేల తల్లి పై ప్రేమతో త్యాగధనుడుగా అవతరిస్తాడు ...
అవకాశవాది చేతిలో ఆయుధమై పోకుండా ..
తన విచక్షణ ఉపయోగించి ఆలోచించగలిగితే
తూర్పున ఉదయించే సూర్యుడు అవుతాడు ..
లేకుంటే నేలరాలిపోయే మరో తోక చుక్క అవుతాడు !!

05/10/2011

పేదోళ్ళ పస్తుల పండుగ ..!

కూలీకి వెళ్ళలేము.. కాసులు తేలేము
కడుపు నిండా తిని  ఎన్నాళ్ళు అయిందో ..!
దొర పిలుపుకు మా కొంప పస్తులుండే
మా బిడ్డలా చదువు అట్టకేక్కే..
తెలంగాణా అంటే మా నేల పై
మాదే  పెత్తనం అనుకున్నాం
మా మట్టిపై మాదే విజయం అనుకున్నాం
అది రాకముందే బలసిన నాయకులు
మా బతుకుల మట్టి కొడుతుంటే
సైలెంట్గా సెంటిమెంట్ అని సర్దుకు పోతున్నాం !
సమ్మె పిలుపు ఇచ్చిన అయ్య
ఢిల్లీ లో షాపింగ్ చేస్తుండు ..
వారి పిల్లలు విదేశాలలో చదువుతుండ్రు..
మా పేద పిల్లల బతుకులు నేలరాయకండి
మా బతుకుల్లో చీకటి నింపి
మీరు వెలుగుల ఇంద్ర భవనాలలో ఊయలూగకండి..!
తెలంగాణా అంటే మా అమ్మ అనుకుంటున్నాము .
మా విశ్వాసాని ఢిల్లీ నడివీడులో తాకట్టు పెట్టకండి !!
మా విశ్వాసం శాంతిగా విజయం పొందినప్పుడే మాకు పండుగ
మా నాయకులూ నిస్వార్ధంగా నడిచినప్పుడే మాకు పండుగ


04/10/2011

బంధువులు

బతకలేక చస్తుంటే
ఎగతాళి చేస్తారు !
సచ్చాక వచ్చి
ఎడువలేక
చస్తారు
చచ్చినోళ్ళు !1


నిజం!

మనం నవ్వుతుంటే
ఏడుస్తుంది!
మనం ఏడుస్తుంటే
నవ్వుతుంది
సమాజం !
దాన్ని లెక్క చేయక
ఎదిరించి చైతన్యంతో
నడిచామంటే
కుక్కలా తోక ఆడించి
వెన్నంటే
నడుస్తుంది
ఇది నిజం !!
 (1990)
               -కరణం లుగేంద్ర పిళ్ళై

 

30/09/2011

ప్రియ (స్వ )స్వాగతం



ఉదయం ఉషోదయం

నవ్వుతూ నువ్వు వస్తుంటే

చీకటిలా కుములుతున్న

జీవనాన ఆనందాల నర్తనం

ఓ హృదయ వన మయూరీ

గల గల గోదారివై నడయాడుతుంటే

ఎంకిలా అనిపిస్తావు ..

కల్మష మెరుగని చూపులతో

నిర్మల మానస చిత్తంతో

నీవు కనపడితే చాలు సుమా

నా గుండెలో నీకు కోవెల కట్టి

పూజించాలంత భక్తి పుడుతుంది

నీలాల నింగిలో తారకవా

జాబిలి పున్నమి వెన్నలవా

ఎంత చల్లని మైమరపు నీ తలపులలో

ఎంత కమ్మని హాయి నిటూర్పు
నీ కలలలో

పల్లె పైర గాలివై కమ్ముకుపోవా!

ప్రాణ సఖి ఈ జీవితాన ఎప్పటికి వుండిపోవా!!
                                               - కరణం లుగేంద్ర పిళ్ళై

29/09/2011

అమృత మూర్తులు



అఆలు దిద్దించి ...

విద్యాబుద్ధులు చెప్పించి
నడత, నాణ్యత జొప్పించి
ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు ...

నవమాసాలు మోసి ..
తానూ చచ్చి బతికి
మనకు జన్మ నిచ్చి
కంటికి రెప్పలా కాపాడిన అమ్మ..

తానూ మండుటెండలో స్వేదమై కరిగి..
తానూ అందుకోలేని ఎత్తులను
మనం అందుకుంటుంటే చూడాలని
మన ఎదుగుదలకు మెట్లుగా మారి
మనలో ఆశయాల ఊపిరులూదిన నాన్న !


తోడూ నీడలా వెంట వుండి
పాలు తేనెలా మన జీవితలో కలగలిసి పోయే
రోజూ తన ఆప్యాయతలను కురిపించే అర్ధాంగి !


వీరు అమృత మూర్తులు
వీరి ఋణం తీర్చగలమా ?

వారి త్యాగం ఎప్పటికి మరువలేనిది
వారికి చేయూతనివ్వడం మన విధి !!

                                                  -కరణం లుగేంద్ర పిళ్ళై

26/09/2011

పెద్ద మనసు కావాలి !

వర్షపు చినుకుకై
కోయిల ఏడుస్తుంటే
మనకు అది పాటలా శ్రావ్యంగా వుంటుంది ..
పేదల ఆకలి ఏడుపులు కూడా
ఉన్నోల్లకు కాలక్షేపంగా మారిందేమో

గోదాముల్లో బియ్యం కుళ్ళి పోతున్నా
పేదలకు పెట్టాలన్న ఆలోచన రాదు
ధరలు తగ్గించాలన్న యోచనే రాదు
ఇది ప్రజల ప్రభుత్వం అంటారు ..
కాని ప్రజల కోసం పని చేసే వారే లేదు

                 -   కరణం లుగేంద్ర పిళ్ళై

మన అడుగుజాడ గురుజాడ


మన అడుగుజాడ గురుజాడ
మన వెలుగుజాడ  గురుజాడ
కన్యాశుల్కం పాత్రల రచనల అక్షర శిల్పి 
తుప్పు పట్టిన చాంధస భావాల నడ్డి విరిచి
నాటకమైనా  , కవితైనా ,కథైనా
వాడుక భాషకు మరల్చి
ప్రజా భాహూల్యానికి అందించిన సంస్కర్త ..
దేశమంటే మట్టి కాదని
దేశమంటే మనుషలని ప్రభోదించిన మానవతావాది
ముత్యాల సరాలు ..రత్నాలై మెరుస్తుంటే
తెలుగు తల్లి పులకించి పోయింది
సాహిత్యానికి సమాజ స్పృహే గీటు రాయన్న వాడు
"గురు " జాడలు మరిచితే మన జాతిని మరిచినట్టే..
తెలుగు జాతి పితకు అక్షరాంజలి !!

గురుజాడ 150 జయంతి సందర్భంగా చంద్రునికో నూలు పోగు ..
                                     -కరణం లుగేంద్ర పిళ్ళై


23/09/2011

మూలాలను పెకలిద్దాం !

సంతలో చంటి బిడ్డను అమ్ముతూవుంటే
ఎందుకు అమ్ముతున్నారని నిలదీశాను !
పెరిగి పెద్దయ్యాక ఆ పిల్ల పెళ్ళికి
కట్నం ఇవ్వాలిసి వచ్చి ఇల్లు అమ్ముతుంటే
మౌనంగా చూస్తుంది పోయాను !
పారాణి ఆరక ముందే
అగ్నిధారాలలో మసిగా మారితే
రెండు కన్నీటి చుక్కలై కరిగిపోయాను !

మూలాలు పెకలించకుండా చిగుర్లు తుంచినా
తిరిగి మొలకేత్తదని అర్ధమై , హృదయం అర్ద్రమై పోయింది .
అయిన కర్తవ్యం గురుతుకు వస్తోంది ..

చీకటిలో కుమిలి పోవడంమెందుకు ?
ఇప్పుడు తగిలి వేయవలసింది
మలినమైన పాత భావాల్ని
వెన్నెల ఊరవతలే వుండిపోతోంది
రండి మనం స్వాగాతిద్దాం!

కలుపు లా విషమయమైన
మూలాలు పెకలించి వేసి
విత్తు నుండి చిటారు కొమ్మలపై దాక
సంతోష చిగుర్లు మోలిపిద్దాం !!

                                   -కరణం లుగేంద్ర పిళ్ళై


22/09/2011

ఆరాధన


తను నా ఊహల నాయిక
అయితేనేమి ఈ అల్పుడికి
నీడై తోడై వున్నట్టు వుంటుంది 
తను మాటల జలధార అనుకున్నా
మౌనంగా నిశబ్దమై ఆవరిస్తుంది ..
ధ్యానంగా ఆరాదిస్తుంటే 
ఉచ్స్వాస నిశ్వాస తానవుతుంది 
ఆమెను చేరుతానో లేదో కాని
ఆమె తలపులలో మునిగిపోతున్నా ...

                              కరణం లుగేంద్ర పిళ్ళై
 





19/09/2011

విజేత ..

ఒక్కో సారి కష్టపడి
ఎన్ని మెట్లు ఎక్కినా
దురదృష్టం అనే పాము కాటుకు
నేల జారి పోతాము
నిరాశా చీకట్లలో వుండి పోతుంటాము!

ఒక్కో సారి అప్రయత్నంగా
ఆయాచితంగా నిచ్చెనలు దొరికి
ఆకాశం అంచులకు ఎక్కిపోతాం
గాలిలో మబ్బులై తెలిపోతుంటాం
మనల్ని మించిన వారు లేరని బ్రమిస్తుంటాం !

రెండూ తప్పే నేస్తమా
గెలుపు ఓటములు కాదు
ప్రయత్నం చేయడం ముఖ్యం!
అందలం ఎక్కినా
పాతాళంకు జారిపొయినా
సడలని ఆత్మ విశ్వాసం వున్నా వాడే
నిజమైన విజేత ..


16/09/2011

మనమూ మంచి వారమే సుమా !

మనమూ మంచి వారమే సుమా !
ఓ సమాధి కూడా
ఏడు వింతలలో ఒకటిగా మారిందంటే

అది తాజ్ మహల్ కే చెల్లు ..
స్వచమైన ప్రేమకు మనం ఇస్తున్న గౌరవం !
                                   
  కాని తల్లి తండ్రుల సమాధిని పట్టించుకోమేంటి ?

ఓ వృద్ధ మహిళను
దేవతగా నిలిపి కొలుస్తున్నమంటే
అది మదర్ తెరిస్సాకే చెల్లు
నిస్వార్ధ సేవకు మనం ఇస్తున్న విలువ !
 
 మరి మనం మాత్రం సేవ చేసేందుకు ముందుకు పోమెందుకు ?

వేరే ఎవ్వరో చేస్తే అబినందిచడం మంచిదే
మనం కూడా అంతో ఇంతో పాటిస్తుంటే ఇంకా మంచిది కదా !

                                                                          కరణం లుగేంద్ర పిళ్ళై




నీవే సుమా!

ఆకాశమంత చీకటి ఈ జీవనాన్ని కప్పేస్తే
వెన్నెల జాబిలివై విరిసింది నీవు కదూ !
దుక్కః సాగరంలో మునకలేస్తున్న నాకు
సంతోష తీరాలకు చేర్చింది నీవు కదూ !
ఎడారిలో ఇసుక రేనువైన నన్ను
ఎవేస్తూ శిఖరంలా తీర్చింది నీవు కదూ
అనురాగమయి
రూపం నాదయినా జీవం నీవు
నడక నడయినా గమ్యం నీవు
భాష నాదయినా దాని భావం నీవు
నన్నలా అల్లుకున్న కాంతి తేజమా !
పువ్వుకు తావిలా పెనవేసిన బంధమా !
నీ ఒడిలోనే వాలిపోనివ్వు
నీ నీడలోనే రాలిపోనివ్వు

15/09/2011

మరుపు కోరల్లో మనిషి

నిన్న జరిగింది ఈ రోజుకి గుర్తుండడం లేదు ..
మనిషి మరబొమ్మ లా మారి పోయాడు
లేక పొతే రాజకీయ నాయకులు
ఇంతటి పాపాలకు ఒడిగట్టే వారుకారేమో!
కనీసం  తనకు ఎవరు చేసిన మేలూ గుర్తుండదు ,
మతిమరుపు రాచకురుపైమనిషిలోని
సున్నితత్వాన్ని చంపెంస్తున్నదేమో?

ఓటు ఎందుకు వేశాడో గుర్తుండదు
ఈ పార్టీ వాడో తానే మర్చి పోయి
అన్ని పార్టీ సభల్లో జెండాగా రెప రెపలాడుతుంటాడు ..
ఎటువంచితే అటువంగి పోయి
ఎటు ఎర వేస్తె చిక్కుకు పోయి
తానూ ఒక పౌరుడనని మర్చి పోయాడు ..
లేక పొతే ఇన్ని దారుణాలు జరుగుతుంటే
నిమ్మకు నీరెత్తినట్టు వుంది పోయేవాడా ?

నిప్పుకు చెదలు పట్టినట్టుంది ..
ఆలోచన మానివేసి నిర్లిప్తుడై యోగిలా మారిపోయాడు
అన్నింటికీ భాద్యత తనది కాదని నిమ్మిత్త మాత్రుడై పోయాడు ..
మాటలు వచ్చినా మౌనమే ఆశ్రహిస్తున్నాడు
ఎవరో ఆడిస్తే అదే తోలుబొమ్మలా మారిపోయాడు
నేతలు చనిపోతే కన్న బిడ్డలు కన్నీరు కార్చకపోయినా
తానూ మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నాడు ..
పరిహారం కోసం ఇంటిల్లిపాది భిక్షగాల్లవుతున్నారు !!

మట్టిని తవ్వి ఖనిజాల్ని మింగేస్తుంటే  పట్టడం లేదు
జల యజ్ఞం పేరుతొ లూటి అవుతుంటే చీమ కుట్టినట్టు లేదు
వారికి కాస్తంత ఊరటగా కిలో రెండు రూపాయల బియ్యం చాలు ...
లేకపోతె గుండె మేఘాల్ని పిండకుండానే కురిసే ఓదార్పు చుక్కలు చాలు

మనిషిని ఆట బొమ్మగా చేసుకొని నాయకులు కోట్లు గడిస్తుంటే
తానూ పంట పండించలేక విరామం కోరుకుంటున్నాడు
ఇది ప్రజాస్వామ్యం అంటే నమ్మి మోసపోయమేమో ?
మనిషి నాయకుల వారసుల కోసం జెండాలు మోస్తున్నాడు ..

మనిషిని మేలుకొంటే చీకటి రాజ్యంలో సూర్యుడవుతాడు
మనిషి తలచుకొంటే తన రాతను తిరిగి వ్రాసుకొనే బ్రహ్మఅవుతాడు ..
అయితే మనమూ ఆలోచనల అలలమై ఓ చేయి అందిస్తాము

                                                    -కరణం లుగేంద్ర పిళ్ళై



14/09/2011

ప్రేమ

బాల్యంలో
అమ్మా నాన్న ప్రేమ
కౌమారంలో స్నేహితుల ప్రేమ
యవ్వనంలో అమ్మాయితో ప్రేమ
ప్రౌడ వయస్సులో బంధువుల ప్రేమ
ముసలి వయస్సులో పిల్లల ప్రేమ
పొందలేని జీవితం ఓ నరకం
పొందిన జీవితమే సాపల్యం ..!

                                              కరణం లుగేంద్ర పిళ్ళై
   

13/09/2011

స్నేహం

ఆర్ట్ - యం గణేష్ కుమార్
దూరాలను దరిచేర్చి
భావాలను చేరవేసే
సాధనాలు వున్నప్పుడు
దేశాల సరిహద్దులను
స్నేహం చెరిపివేస్తుంది!
మిత్రమా ......
ఊసులు యంటినా కేబుల్లై
అడుగడుగునా పెనవేస్తున్నాయి
బాసల భావాలు సంక్షిప్త సందేశాలై
రింగ్ టోన్లై నిడురలేపుతున్నట్టే
ఎవరికివారం చెల్లా చెధురైనా
నడిపే చోదక శక్తి ఒకటే కదా
అంతా ఒకే వైపు అడుగులు వేస్తున్నట్టే జీవితాలు చిగురులై మొలకెత్తి
కొమ్మలు రేమ్మలుగా విస్తరిస్తూవుంటే
సంకుచిత భావాజాల కత్తితో తుంచ లేము  కదా
మోడుబారిన కొమ్మలలో కోయిలను వెతకడం
ఎడారి ఇసుక తిన్నెలలో సేద దీర్చు సరోవరాలు వెదకడం
మనం నిత్యం చేస్తున్నాము ..
జీవనం యాంత్రికమైన చోట
మనిషి తత్వాన్ని తట్టిలేపే పిలుపు ఓ మొబైల్ అవ్వొచ్చు
గమ్యం చేరలేని ఎన్నో ఓడలలు
తీరాలై రమ్యమైన ఆతిద్యం ఇచ్చేదే ఓ చాటింగ్ అవ్వొచ్చు
మనిషంటే ..మౌనం కాదు ..
మనిషంటే ..ముడుచుకు పోవడం కాదు ..
మనిషంటే ఎన్నో భావాలకు ప్రతిబింబం !
మనిషంటే స్నేహం ఊపిరిన నిండుదనం !!



                                            కరణం లుగేంద్ర పిళ్ళై

11/09/2011

దృశ్యం

పల్లె పొలాలలో  రైతు ఎద్దులతో
దుక్కి దున్నే  దృశ్యం ముందు
ట్రాక్టర్ తో దుక్కి దున్నే దృశ్యం వెల వెలా పోతుంది ..
బిడ్డకి అమ్మ పాలు ఇచ్చే దృశ్యం ముందు
ఆయా బుడ్డి పాలు పట్టే దృశ్యం వెలసి పోతుంది ..
నారుమడిలో నాట్లు వేస్తున్న
పల్లె పడుచుల దృశ్యం ముందు
ఒత్తిడితో కంప్యూటర్ లో హడావిడిగా పనిచేస్తున్న
లేటెస్ట్ అమ్మాయిల దృశ్యం చిన్నబోతుంది !!
జట్టుగా నింగికి ఎగిరే కొంగల గుంపు ముందు
విమానాల రొదలు వికారం కల్పిస్తాయి ..
ఏదైనా అంతే
జీవితం సహజంగా ఉంటేనే అందగిస్తుంది
కృతిమంగా ఉంటే మనిషికి మిషన్ కు తేడా ఏమివుంటుంది !
సహజంగా ఉండే ప్రకృతి అందానిస్తుంది! ఆహ్లాదాని ఇస్తుంది !
సహ జీవన సౌందర్యం  బతుకుకోక అర్థాన్ని కల్పిస్తుంది !                                              -కరణం లుగేంద్ర పిళ్ళై

10/09/2011

ప్రణయ నాయక !

 
ఆకాశంలో  నీలిమేఘాలు
నీ ప్రేమ సందేశాన్ని
తీసుకు వచ్చాయేమో 
నీ రూపు ధరించి  నీలాగే నవ్వుతూ 
నేను ఎటు వెళితే అటు వస్తున్నాయి ..
నీవు కాళిదాసు మేఘ సందేశానివే సుమా
మండుటెండ కూడా మంచులా కురుస్తూ ..
చెమటై తడిచిన శరీరాన్ని చల్లబరుస్తోంది ..
నీ తలపు ఒక్కటి వుంటే చాలు 
దారి చూపని చిక్కటి చీకటి చుట్టూ వున్నా 
నీ నవ్వులు శరత్చంద్రికలు కురిపిస్తాయి ..
నీ పిలుపు మళ్లీ మళ్లీ వినిపిస్తూవుంటే 
నా చెవులకు అది కర్ణాటక సంగీతమే కదా
నీ అందేలా సవ్వడి దగ్గర అవుతుంటే 
నీ గాజుల గల గలలు ,
నాలో ఆలోచనలను తట్టిలేపుతున్నాయి 
కన్నులు నావయినా దాని చూపు నీవే కదా
కలం నేనైనా పొంగివచ్చే కవిత నీవే కదా
జీవితం నాదైన దానికి అర్థం పరమార్థం నీ ప్రేమ కదా.
స్వాగాతమా నా స్వగతమా..
నీకే అంకితం ఈ నా జీవితం!
సహచరీ , నా శ్వాసమయీ 
నీవే నా ప్రణయ నాయకవు!!

                     కరణం లుగేంద్ర పిళ్ళై
 







08/09/2011

కూలిన మానవ రాజ సౌధాలు

పరిచయం అక్కరలేని
నిలువెత్తు రాజసౌధాలు అవి
ముష్కరుల దొంగ దెబ్బకు
పెను విషాదమై నేలకూలడం
మానవజాతి చరిత్రలో పెను విషాదం ..!
దుమ్ము దూళిగా వేలమంది ప్రాణాలు
గాలిలో కలిసిపోతుంటే
టి వి ల ముందల చేష్టలుడి పోయాము ..
ఉగ్రవాదమో ఉన్మాదమో  ..
ఊపిరి తీయడంకోసమే అవి పుట్టడం 
అనాగరికతకు నిదర్శనం ..
ట్విన్ టవర్లు నేడు లేవు
దాన్ని కూల్చిన  వారూ నేడు లేరు
ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన
అమెరికాకు చెడు అనుభవాలే ..
అది ఎవ్వరైనా....
ప్రాణం తీయడం రాక్షతత్వం ..
మతాల మౌడ్యాలు హింసను భోదిస్తుంటే
ప్రవచనాలు సంకుచితా కుడ్యాలు అయినప్పుడు .
మనిషి ప్రాణాలు తీసే యముదవుతున్నాడు ..
మనం శాంతిని కోరుకుంటే ..
మూల కారణాలను అన్వేషిద్దాం
వేర్లను వదిలేసి కొమ్మలను నరికితే
విష వృక్షాలు మరణించవు
అవి విష నాగుల్ని పుష్పిస్తాయి ...
                    కరణం లుగేంద్ర పిళ్ళై

అమెరికా అల్లుడు !


సూటూబూటు వేసుకొని 
సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ అంటే 
ఎగబడి అల్లుడి కాళ్ళు కడిగి 
లక్షల కట్నాలు ఇచ్చి 
కన్న కూతురిని కట్టబెట్టారు ..
మూడునెలలు తిరుగకుండానే  
శవమైన కూతురు ఇంటికొస్తే 
గుండెలు పగిలి కన్నీరై కరిగి పోయారు !
దుఃఖంలో మునిగిన వాళ్ళను ఓదార్చలేక 
అల్లుడిని దండించలేక బందువులు కుంగిపోయారు ..
ఆకాశానికి నిచ్చెన వేయడమెందుకు...
కర్మ అనే పాము మింగితే జారి పడదమెందుకు 
దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి!
మన తాహతును   మరవకండి !
దూరలోచానలేక ముందుకు నడవకండి !!


                                  కరణం లుగేంద్ర పిళ్ళై



07/09/2011

రాళ్ళబతుకు !


Art by M. Ganesh Kumar
 చినుకు రాలితేనే చిగురు
పంటకైనా ..బతుకైనా ...!
రాళ్ళ సీమ అనాలో
రాయలసీమ అనాలో .
కాని
నెత్తిన సమస్యల సూర్యుడు మాత్రం ఎప్పుడూ ఉగ్ర రూపుడే ...
ఎడారికన్నా దుర్భరమైన జీవనాల సీమ
డొక్కలు ఎండిన పశువుల కలేబాల గొడ్డు సీమ ..
కన్నీరు కూడా ఇంకిపోయి
నమ్ముకున్న భూమిలోనే నట్టేట మునిగిపోయి
మేఘాల కరుణకై అంగలార్చిన
బడుగు బతుకుల వ్యధ సీమ
ఒకనాడు రత్నాలు రాసులు పోసిన చోట
పాక్షన్ పగలతో కత్తులు నూరుకుంటున్నారు ...
తమకు తామే   బందీగా మారి
చిత్రవధలు అనుభవిస్తున్నారు ..
శాపమో , పాపమో తెలియదు కాని
పల్లె అంటే ఇక్కడ పచ్చదనం కాదు
పగల మేఘాలు అల్లుకున్న పౌరుష సీమ
మనిషి అంటే ఇక్కడ మానవత కాదు
కౌర్యం కమ్ముకున్న తర తరాల జాడ్యపు జాడ .
మరో ప్రక్క  కల్మషం ఎరుగని
నమ్మితే ప్రాణం ఫణంగా పేట్టే దాత !
పంతాలకు పట్టింపులకు పోతూ
తనను తానే సమాధి చేసుకుంటున్న వాడు ..
సీమలో మానవత చినుకులు కురిసి
ప్రతి మదిలో శాంతి శౌభాగ్యాలు చిగురించాలి ..

                          కరణం లుగేంద్ర పిళ్ళై

ఉగ్రవాదం ఉసురు తీయాలి !!

దమన కాండకు అద్దుహదుపు లేకుండా పోతోంది 
అమాయకుల పై బాంబులతో దాడి చేసి  
ప్రజలను బయబ్రాంతులను చేస్తే ఏమొస్తుంది ?
ముంబై మార్కెట్లో తెగబడినా రక్త దాహం తీరలేదేమో 
ఢిల్లీ హైకోర్ట్ ముందర రాక్షస కాండకు ఒడిగట్టారు ..
ప్రాణం తీయడమంటే వారికో ఆటగా మారిపోయింది 
మానవత్వం మంటగలసి 
మృగమై సాటి మనిషులనే చంపితే జిహాద్ వస్తుందా 
మనుషుల ప్రాణాలు తీయమని ఏ మతం చెప్పదు..
ఉగ్రవాదం , ఉన్మాదమై ఊరేగుతుంటే చూస్తూ వుండాలా ?
నేరం నిరూపణ అయిన సంవత్సరాల తరబడి 
కోట్లు ఖర్చు పెట్టి వారిని కాపాడే ప్రభుత్వమా మేలుకో 
కావలసింది సానుభూతులు , పరామర్శలు కాదు 
బతకడానికి ధైర్య మనే నమ్మకం ..
దౌత్య నీతికొసం దానవులను మన్నిచకండి
 ఉగ్రవాదపు ఉసురు తీసి శాంతికి పట్టాభిషేకం చేయండి !!
                                                                               కరణం లుగేంద్ర పిళ్ళై



ముసలవ్వ


తనువేమో ఎముకల గూడు
తపనేమో కడలి కెరటాల హోరు
తనేమో పిల్లల పలకరింపునకు మొహం వాచింది
తనయిలెమో ఆస్తుల కోసమే
ప్రాణం పోవాలని ఎదురుచూస్తున్నారు .!!

06/09/2011

ప్రసవ వేదన

తల్లి గర్భంలో
శిశువు
నవమాసాలు ఉంటేనే
ప్రాణమూ... నిండు రూపమూ ..
దేనికి తొందర ?
ఆలోచనల మదిలో
కవిత మగ్గితేనే
దానికొక అర్థమూ ...పరమార్థమూ
నొప్పిలేకుండా జననమే లేనప్పుడు
ఇక జీవితం ఉంటుందా ?
ఉలి దెబ్బలు తగిలితేనే
శిల శిల్పంగా మారేది ..
బండల నడుమ పరుగులేట్టితేనే
ప్రవాహపు వేగం పెరిగేది ..
వేదనలు చుట్టుముట్టిన్నప్పుడే
ఓర్పు విలువ తెలిసోచేది
మనిషి నైజం బయటపడేది ..!!

                              కరణం లుగేంద్ర పిళ్ళై



పవిత్ర యజ్ఞం ..

Art by M. Ganesh Kumar
అవినీతి అందలమెక్కి
పిశాచమై పట్టి పీడిస్తుంటే .
దేశ ప్రగతి నీరుగారి పోతోంది
ఇంతింత కాదు జగమంతా
అల్లుకుపోతున్న వైనంతో
సమాజం తల్లడిల్లిపోతోంది
ఎవరికీ ఏమీ పట్టని నేడు
అన్న హజారే గళం విప్పాడు
లోక్పాల్ బిల్లుకై ప్రభుత్వ మేడలు వంచాడు
అవినీతిని అంతమొందిచాలంటే
అది ప్రతి ఇంటా మొదలు కావలసిన పవిత్ర  యజ్ఞం ..
విలువల పాదులు  తీసి
ప్రతి బిడ్డకు గోరు ముద్దలతో
అందించవలసిన పవిత్ర కార్యం ..
యుద్ధం మొదలైంది ..సన్నధమౌదాం !
అంతం కాదిది ఆరంభమే ..
వ్యక్తి మారినప్పుడే వ్యవస్థ మారేది ..
రండి సోదరులార మారి చూపుదము
రాబోయే తరాలకు మార్గదర్శాకులవుదము !!

                             కరణం లుగేంద్ర పిళ్ళై