EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

27/10/2011

మౌనం గాయమై !

 
కనిపించి కనిపించగానే
మోము దాచేస్తావు ఎందుకు ..
నీ చిరునవ్వు పువ్వు కోసం
నేను ఎదురుచూస్తుంటే
నా చెవిలో పువ్వు పెట్టేస్తావెందుకు ?
కలలో కనిపించి , మురిపించి
ఇలలో అలా ఏమితెలియనట్లున్తావ్ ఎందుకు ?
నా ప్రశ్నలకు నీ మౌనం సమాధానమా
నా నిరీక్షణకు మోహం చాటేయడం న్యాయమా ?
గుండె వేయి ముక్కలైనా ప్రతి ముక్క నిన్నే చూపుతోంది
కన్నీరు కాల్వలై పారి బతుకును ముంచుతోంది
నా ఆరాధనంతా నీ కోసమేగా
నీవు దేవతవై కరుణిస్తే జీవితాంతం పూజారిని కొలుస్తా ..!
నీవు బండరాయివై ఉండిపోతే నేను శిలగా మారిపోతా  ..!!

నువ్వు బతికేది నీకోసమేనా ?


చిన్నపటినుండి చూస్తునా
మిత్రమా నువ్వు బతికేది నీకోసమేనా
కొత్త బట్టలు కొంటే అందరూ మెచ్చాలని చూస్తావ్
అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలని
...
అందరూ నిన్ను పొగడాలని తహ తహలాడుతావ్
ఇంతకీ నీకు కావలసినదేదో నీకు తెలుసా
అందరికన్నా మిన్నగా వుండాలనుకొని
వారి అభిప్రాయాలకోసం ప్రాకులాడటం ఎంత విచిత్రం
నీకో రుచి లేదా ..నీకో అభిరుచి లేదా
నీకంటూ గుర్తింపు వారిస్తేనే వస్తుందా?
నీ పెళ్ళిలో నీవు విందు వినోదాలకోసం
స్నేహితుల మెప్పు కోసం ఎంతగా తపన పడ్డావో గుర్తు ఉందా.
ఆఖరికి జీవిత భాగస్వామి కూడా తెల్లగా వుండాలని
ఆమెను అందరూ మెచ్చాలనుకున్నావేకాని
నీకు నచ్చిందో లేదో ఎప్పుడైనా ఆలోచించావా
ఎవరికోసమో బతుకుతూ ఆత్మ నూన్యతతో వుంటే
అది నీ బ్రతుకు ఎందుకవుతుంది ..
పారే జలపాతంలా ఎందుకు స్వచ్చంగా వుండలేకున్నావు
కోవెల ప్రశాంతత ఎదలో లేకుండా ఎందుకు మదన పడుతున్తావు
నీకోసం బ్రతుకు ..నీకు నచ్చిందే చేయి
అప్పుడు నీ ఆత్మ సంతృప్తి ముందు కోట్లు వృధా ..
నీదంటూ ఓ ముద్ర వేయి ..
అప్పుడు నీ వెంబడి నడిచే వారికే నువ్వు స్ఫూర్తి ..

24/10/2011

కాలం కరుణిస్తుంది !

 
 
 
ఎంత దూరాన వున్నా నేమి
నువ్వు నా దగ్గర ఉన్నట్టే వుంటుంది
మాయని నీ జ్ఞాపకాల ఊసుల్లో
జీవితం గడిపేస్తున్నా.
కలకాలం కలసి ఉండాల్సిన మనల్ని
కాలం  వేరు చేసి బొమ్మలాట ఆడుతోంది !
కలికాలం అనుకోని , కష్టమైనా
తలపుల కౌగిల్లో ఒదిగిపోవడం
మనకు తెలుసనీ తెలియదేమో
దగ్గర వున్నప్పుడు తెలియని
అనురాగాలు ఇప్పుడు తెలిసొచ్చింది
నువ్వు నాకు ఎంత అవసరమో
నేను నీకు ఎంత అవసరమో
నిశబ్దంలో వుంది ఆలోచిస్తుంటే తెలుస్తోంది
కటిన కాలం కరిగి మన కోసం
తివాచిగా మరి స్వాగతిస్తుంది
ఇద్దరినీ ఒక్కటి చేసి
కలసి ఉండమని ఆశీర్వదిస్తుంది !!

22/10/2011

ఉక్కు సంకల్పం



 
 
 
 
 ఒక్కొక్కసారి ఉక్కు సంకల్పం
దూది పింజలా సడలి పోతుంటే
దూరంగా వున్న లక్ష్యపు తీరం
రాను రాను మరింత దూరమవుతుంటే
అడుగు పెట్టిన నేలంతా పాతాళంలోకి కూరుకుపోతుంటే
... నేస్తమా !
రెక్కలు తెగిన పక్షినై నేలకు రాలి పోతాననుకున్నావా
దిక్కులు తెలియక ఒంటరినై కుమిలి పోతానని అనుకున్నావా
నీవు ఇచ్చిన గుండె ధైర్యం ఊతం చాలు
ఊపిరినే నింగికి నిచ్చనగా వేసుకు ఎదుగుతా
ఆశయాల స్ఫూర్తి చాలు
బీడు బారిన బతుకు ఎడారిలో
ఆశల గులాబీలు పూయిచుకుంటా ..
ఓటమి ఎదురైనా ప్రతిసారి నీవిచ్చే స్వాంతన చాలు
ఓరిమి బలిమితో విజయ శిఖరాలు అధిరోహిస్తా ..
ఈ జన్మను సమాజానికి ఓ తోరణంగా అలంకరిస్తా.

18/10/2011

అమ్మమ్మ

చెమట చుక్కలు చిందిస్తున్న
ఆమె విశాలమైన నుదురు
వర్షించే ఆకాశంలా వుంది
చెమర్చిన కళ్ళ లోగిళ్ళలో
సునామీలు దాగున్నాయోమో ?
వంట ఇల్లే ఆమె ప్రపంచమై
మూడు దశాబ్దాలు దాటిందనుకుంటా
వండి వార్చి వడ్డించడమే జీవితమై
తనకేమి  కావాలో మర్చి పోయింది
ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చి తలోదిక్కు వెళితే
వారి పిల్లలకు మళ్ళీ  తల్లిగా మారింది ..
లోకం తెలియని మనిషిగా ముద్రించబడి
శోకం మాత్రమె తెలిసిన సీరియల్ నటిగా మారిందేమో
ఒక నిర్వేదం , ఒక నిటూర్పు కూడా కనబడనీయక
పిల్లల ఫోన్ పిలుపుకోసం చకోరమవుతుంది .
పండుగలోస్తే అందర్ని రమ్మని పిలిచి
వారి వారి రుచులలో తాను కలగలసి పోతుంది
ఇవ్వడమే తెలిసిన తనకు ఆస్తులు లేవు కాని
తన జీవితాన్నే అంకితం చేసిన దేవతగా కనిపిస్తోంది.

నువ్వు - నేను


నీలాల గగనాల మేఘమై నీవు
పాతాల , జలపాతాల నీరును నీను
వేడి ఆవిరిగా మారి నిను చేరుకుంటాను ..
చల్లని  నీ స్పర్శలో తడిచి ముద్దయి
చినుకునై నేలరాలి పోతాను ..
పిడుగుల శబ్దాలు భయపెట్టినా
మెరుపుల మాయజాలాలు చుట్టూ ముట్టినా
ఈ మన బంధం వీడి పోదు ..
ఈ చక్ర భ్రమణం ఆగిపోదు ..

16/10/2011

నీవే నా ప్రాణమూ !





ఆశల ఆవనిలో
నిటూర్పుల తుపాను ..
ప్రేమల బృందావనంలో
 విరహానల  జ్వాలా ప్రభంజనాలు ..
ఎటు పాలు పోనీ నాకు
జీవితమే ఓ సుడిగుండమైనప్పుడు
ఎగిసి పడే అలగా మారిన నేను
కెరటమై తీరం కోసం వెతుకులాడుతున్నా ..
ఆలంబనగా మారిన నీ పిలుపులో
పోయిన ఆశల చిగుర్లను  తిరిగి చూస్తున్నా.
ఎందుకో తెలియదు నీ మాట కూడా
నన్ను నడిపే దిక్సూచి అవుతోంది ..
ఏమిటో తెలియదు నీ స్పర్శ కూడా
నాలో కొత్త ధైర్యాని నింపుతోంది ..
ఒట్టి పోయిన ఆకాశంలో
నువ్వు ఇంద్ర ధనుస్సు వై విరబూసి...
ఇంకిపోయిన నా లోలోని
జీవన మాధుర్యాన్ని నాలో తిరిగినింపు ..!

ఎడారి

 
మనసు ఎడారిగా
మారిపోయింది
లేకపోతె ఏంటి
ఇంతకు ముందు
దుఖం అయినా, సంతోషమైన
కళ్ళల్లో కన్నీరు ఉప్పొంగేది ..
ఇప్పుడు
కళ్ళ లోగిళ్ళలో
ఇసుక లాంటి నిర్లిప్తత
రాజ్యమేలుతోంది
ప్రాణమున్న కళ్ళు
గాజు కళ్ళయాయి..
ప్రాణమున్న మనిషి
జీవచ్చవమైనాడు !!

15/10/2011

అక్షర సత్యం !

అక్షరమై పుట్టిన నేను
ఆలోచన పదమై పెరిగి
వాస్తవ వాక్యమై విస్తరించి
కవితగా భావాలద్దుకొని 
పాటగా జనం గుండెల్లో
పల్లవించాలని వుంది ..
చీకటి రాజ్యంలో
చైతన్య జెండాగా
మనిషి ఎగురుతుంటే
అదే నా జీవితానికి సార్ధకత ..
మనిషి నిటారుగా నిలబడి
మానవత్వంతో వికసిస్తుంటే
అదే నా గమనానికి ఓ లక్ష్యత !!

14/10/2011

కాకి కథ

కాకి కోయిల పోటీ పడ్డాయి
కోయిల కమ్మని గానంతో
పాడుతుంటే ఆహ్లాదంగా
అందరూ మైమరచారు ..
కాకి గొంతువిప్పి పాడితే
గులక రాళ్ళ శబ్దమని
రాలు విసిరారు ...
కట్ చేస్తే..
పెద్దల పండుగ వచ్చింది
పిండ ప్రదానం చేసిన వారు
ఇంట్లో పూజ చేసిన వారు
చనిపోయిన పెద్దలకు ముందుగా నైవేద్యం పెట్టాలని
ఇంటి వాకిట్లో నిలబడి
కాకుల్నికావు కావు అని అరిచి  ఆహ్వానించారు ..
ఇది చూసి కోయిల అంది
నా విలువ నా గొంతుకే
నీ విలువ వారి జీవితానికే !!

బంగారు బాల్యం!



అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
నాన్న భుజాలపై ఊరేగిన బాల్యం
అక్షరాలూ దిద్ది  బడిలో ఆడుకున్న బాల్యం
రెక్కలు తొడిగి నింగిన గాలి పటమై ఎగిరిన బాల్యం
చందమామతో స్నేహం చేసి వెన్నల నవ్వులై విరిసిన బాల్యం
నేడు ఓ జ్ఞాపకమేనా ..
కుల మతాలు లేకుండా పంచుకున్న కాకి ఎంగిళ్ళు
ఆడా మగా తేడాలేకుండా గిచ్చుకున్న ఆటల ముంగిళ్ళు
పిల్ల కాల్వల వెంట లేగ దూడలై ఎగిరిన గంతులు
నేడు ఓ తీపి గురుతేనా !
అప్పటి బాల్యం ఓ బంగారు ప్రపంచం ..
నెమరేసుకుంటే చెమర్చిన కళ్ళను అడుగు
జ్ఞాపకమై మెరిసిన ఇరుగు పొరుగును అడుగు
అక్కడే ఆగిపోయింటే ఎంత బాగుండేదని అంటాయి
స్వచమైన మనసుల నడుమ
స్వేచ్చగా మసలిన ముక్కుపచ్చలారని బాల్యం
బతుకు బందీఖానాలో నేడు బిక్కు బిక్కు మంటోంది
మనం కోల్పోయిన బాల్యాన్ని మన పిల్లల కిద్దాం
పిల్లల్ని పుస్తకాల పురుగులు చేయకుండా
అచ్చమైన మనుషులుగా స్వచంగా పెంచుదాం
నేటి యాంత్రిక  యుగంలో యంత్రాలుగా పిల్లల్ని చూడకండి !
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై గుర్రపు పందాలు కాయకండి !


                                                    కరణం లుగేంద్ర పిళ్ళై












07/10/2011

చేతనాగీతం !



వేదనల ఉక్కు పిడికిళ్ళలో
విల విల లాడుతున్న మనిషిని
సంతోషాల వేదంగా మార్చాలని ప్రయత్నం!
తల్లడిల్లడం మాని  తూర్పు పురిటి గడ్డన
చీకటిని తరిమే సూర్యుడు గా అవతరించాలని యత్నం !
ఈ యజ్ఞం విఘ్నం కాకుండా ఉండాలంటే
ఘోర తప్పస్సు చేయనక్కరలేదు
సాటి మనిషిని ప్రేమిస్తే చాలు ...

కాసింత  మమతాస్పర్శ అందించినా చాలు ..
అయితే మనం ఏమిచేస్తున్నాం ?
నిరాశతో నిండిన వాడిని 
మాటల తూటాలతో నేలకూలుస్తున్నాము ..
రక్కసులమై , రాక్షసులమై వేధించి ,పీడించి
భాదల సుడి గుండాలలోకి తోసేస్తున్నాము ..
ప్లీజ్ మనం మారుదామా!
చేతనా గీతాలమై పల్లవిద్దామా
ఎండిన ఎడారి ఇసుక రేణువులలోనైనా 
నమ్మకం తోలిచిగురై మొలకెత్తి
నిలువునా కృంగిన మనిషిని 
నిలువెత్తు జీవితంగా ఆవీష్కరిస్తుంది

ఆనందం గమ్యమైన జీవితాన్ని
ప్రతి లోగిలో నింపుదామా !
ఆనాడే కదా  నిజమైన పండుగ!
ఇలాతలంపై ఇంద్ర ధనుస్సు గా
మానవత్వం విరుస్తుంది నిండుగ!!

                                      -   కరణం లుగేంద్ర పిళ్ళై





నివేదన

కోయియిలకు చెప్పాను
నా పాట  తన గొంతులో నీకు
పాడి వినిపించమని ..
కనిపించిన ప్రతి చెట్టుకూ చెప్పాను
తానూ ఇలా వస్తే నీడలా ఆదరించమని
చిరుగాలికి చెప్పాను
చల్లని పైరగాలిగా నిన్ను జోకోట్టమని 
ఇంద్ర ధనుస్సు తో అన్నాను
తన రంగులతో నీకు రంగోలిగా మారమని
నీతో చెప్పాలని వుంది
నీవు మాత్రం తోడై వుంటే చాలని ..
నీతోనే జీవితం వికసిస్తుందని !!



06/10/2011

చలి చీమలు !


ఆంబోతులు కొట్లాడుకుంటే చలిచీమలు ఏమవుతాయి ..
సమిధలై , పరమపద సోపానలై అమరవీరులై తరిస్తాయి
పదవులే పరమార్థమై మనసు రాతి బండగా మారిన వారికి
సాటి మనుషుల వ్యధ ఎలా అర్థమవుతుంది !
గుడిసెల గుండెల్లో బరిసెలు దింపుతున్న
బడా బాబులకు ఎప్పుడూ  ఏమికాదేమి ?
దేనినైనా వారు తమకు అనుకూలంగా మలుచుకుంటారు
ప్రతి సంఘటన నుండి తాము పొందాల్సిన లబ్ది తప్ప
వార్తల్లో విరుచుకుపడే నాయకత్వం బలిమి తప్ప
సమ్మె పోటుతో చలిమంటలేసుకున్న వెచ్చదనం తప్ప ..
ఇంకేమిపట్టని పక్కా వ్యాపారవేత్తలవుతున్నారు ..
మనుషుల మధ్య విభజన రేఖ గీసి , సమాఖ్య పరిధులు గీసి
మాట్లాడలేని మౌనాన్ని ఢిల్లీ వీదుల్లో వేలం వేస్తుంటే
మనం చేస్తునదేమిటి ?
కళ్ళు ఆప్పగించి చూడడం, సానుభూతి ఓట్లుగా మారడం
కష్టాల్ని కొనితెచ్చుకొని కొలిమిగా బగ బగ మండిపోవడం
లేకుంటే ఆత్మహత్యల మంటల్లో మసి కావడం ....
నాయకులు ఏమికారు , వారి పిల్లలు ఏమికారు
అనుచరులే ఆవేశానికి గురై అర్పనకు గురువుతున్నారు ..
మట్టిని కూడా మార్కెటింగ్ చేయడం ...
ప్రాంతాన్ని కూడా ఆత్మాహుతి దళంగా తయారు చేయడం
మనిషి నేర్చుకున్న ఆధునిక నేర్పరితనమేగా ..
ఏ వాదమైనా జన హితం కోరితే వేదమే అవుతుంది
ఏ భావనైనా శాంతిని కోరితే చిత్రమై వెళ్లి విరుస్తుంది
వాదాలు, వితందవాదాలు  తెలియని పేదవాడు
నేల తల్లి పై ప్రేమతో త్యాగధనుడుగా అవతరిస్తాడు ...
అవకాశవాది చేతిలో ఆయుధమై పోకుండా ..
తన విచక్షణ ఉపయోగించి ఆలోచించగలిగితే
తూర్పున ఉదయించే సూర్యుడు అవుతాడు ..
లేకుంటే నేలరాలిపోయే మరో తోక చుక్క అవుతాడు !!

05/10/2011

పేదోళ్ళ పస్తుల పండుగ ..!

కూలీకి వెళ్ళలేము.. కాసులు తేలేము
కడుపు నిండా తిని  ఎన్నాళ్ళు అయిందో ..!
దొర పిలుపుకు మా కొంప పస్తులుండే
మా బిడ్డలా చదువు అట్టకేక్కే..
తెలంగాణా అంటే మా నేల పై
మాదే  పెత్తనం అనుకున్నాం
మా మట్టిపై మాదే విజయం అనుకున్నాం
అది రాకముందే బలసిన నాయకులు
మా బతుకుల మట్టి కొడుతుంటే
సైలెంట్గా సెంటిమెంట్ అని సర్దుకు పోతున్నాం !
సమ్మె పిలుపు ఇచ్చిన అయ్య
ఢిల్లీ లో షాపింగ్ చేస్తుండు ..
వారి పిల్లలు విదేశాలలో చదువుతుండ్రు..
మా పేద పిల్లల బతుకులు నేలరాయకండి
మా బతుకుల్లో చీకటి నింపి
మీరు వెలుగుల ఇంద్ర భవనాలలో ఊయలూగకండి..!
తెలంగాణా అంటే మా అమ్మ అనుకుంటున్నాము .
మా విశ్వాసాని ఢిల్లీ నడివీడులో తాకట్టు పెట్టకండి !!
మా విశ్వాసం శాంతిగా విజయం పొందినప్పుడే మాకు పండుగ
మా నాయకులూ నిస్వార్ధంగా నడిచినప్పుడే మాకు పండుగ


04/10/2011

బంధువులు

బతకలేక చస్తుంటే
ఎగతాళి చేస్తారు !
సచ్చాక వచ్చి
ఎడువలేక
చస్తారు
చచ్చినోళ్ళు !1


నిజం!

మనం నవ్వుతుంటే
ఏడుస్తుంది!
మనం ఏడుస్తుంటే
నవ్వుతుంది
సమాజం !
దాన్ని లెక్క చేయక
ఎదిరించి చైతన్యంతో
నడిచామంటే
కుక్కలా తోక ఆడించి
వెన్నంటే
నడుస్తుంది
ఇది నిజం !!
 (1990)
               -కరణం లుగేంద్ర పిళ్ళై