EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

30/10/2012

అమ్మా మరో జన్మ ఇవ్వవా..



ఎందుకో మరి.. ఈ రేతిరి నిదురపట్టడంలేదు
కలలు ప్రసవించే రేతిరి
కళ్ళ ముందు కఠిన వాస్తవాలు నిలుపుతుంటే
బాల్యం లో తొడుక్కున్న ఊహా రెక్కలు
ఒకొక్కటే రాలిపోతున్నాయి
కళ్ళ మేఘాలు కూడా ఒట్టిపోయాక
కన్నీళ్ళూ రాల్చలేని ఎడారితనం
ఇసుకతుపానులా చుట్టుముట్టేస్తుంటే నిదురెట్టపోను..
ఎందుకోమరి ..హాయిగా నవ్వలేకున్నాను
వెన్నెల జాబిల్లిలు పూచిన
ఆకాశం మసకబారింది
ఎగురేసుకున్న గాలిపటాలు
దారం తెగి ఎటో కొట్టుకుపోతుంటే
గమ్యం గురించి ఆలోచించే తీరికేది
ఎంత విర్రవీగిన ఇనుప చువ్వయినా
వేడిచేస్తే మెత్తగా వంగిపోయినట్టు
నెత్తినిండా ఒత్తిళ్ళ సాలిళ్ళ గూళ్లు
అల్లుకు పోతుంటే నేనూ లొంగిపోయాను..
నవ్వడం మరచి నటించడం నేర్చాను
చస్తూ బతకడం కంటే చావేనయం
చుట్టూ అందరూ నాలాగే ఉన్నట్టుంది
ప్లాస్టిక్ నవ్వులు పలకరింపులు తప్ప
పక్కోడి గురించి పట్టించుకునే తీరికేది
మనిషిలా ఎవడూ బతకడం లేదు
అమ్మా మరో జన్మ ఇవ్వవా...
స్వచ్చమైన మనిషిగా  మళ్ళీ పుట్టాలని ఉంది  (30.10.12)
                             - కరణం లుగేంద్ర పిళ్ళై

1 comment:

  1. ప్లాస్టిక్ నవ్వులు పలకరింపులు తప్ప
    పక్కోడి గురించి పట్టించుకునే తీరికేది
    మనిషిలా ఎవడూ బతకడం లేదు
    ---
    పట్టించుకోవాలని అనుకున్న ఎంతమంది పంచుకుంటారు వాళ్ల భావాలని మనతో.. అన్నిటికి ఒక మాట "It is my personal"..చక్కని కవిత.

    ReplyDelete

Comment on Telgu poem