EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

31/10/2012

ఎటుపోతున్నాం


పరమాణువులు కలిస్తేనే అణువని
అణువులు కలిస్తేనే ఏదైనా రూపమని
నేర్చుకున్నాం ..మరి ఇదేమిటి
మనలో మనమే విడిపోతున్నాం
గమ్యం చేరేంతలోనే ఏమైంది
ఎవరి దారి వారు చూసుకుంటున్నాం
మనం వెలుతున్నది ముందుకా వెనక్కా
ఓ సారి చూసుకుందాం
మానవతా రెమ్మలు విరుచుకుని
మమతల కొమ్మలు నరుక్కొని ఎటు పోతున్నాం
కీలెరిగి వాత పెట్టమన్నట్టు
రోగం ఏదో తెలుసుకొని మందెయ్యాలిగా
మరి ఇదేమిటి  రోగమొకటయితే మందొకటి వేస్తున్నాం
కులాల వాటాలు లెక్క కట్టి మ్యూజిక్ ఛైర్ ఆట ఆడుకుంటున్నాం
పాలన గాలికొదిలేసి ప్రగల్బాలు అవసరమా
చివరికి మిగేలేది శూన్యమని తెలియదా
ఇంకా ఎందుకొరకు యాతనపడుతున్నాం
స్వేచ్చ అంటే ప్రక్కవాడి ముక్కుకు
తగలకుండా ఇష్టప్రకారం నడవమనీ
వాక్ స్వాతంత్రం అంటే భావాలను
ఏ సంకోచం లేకుండా వ్యక్తీకరించమని
నేర్చుకున్నాం మరి ఇదేమిటి
నోటి మాటను తూటలా ఎక్కుపెడుతూ
సాటివారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాం
ఎవరు ఏమి చేయాలో కూడదో మనమే నిర్దేషిస్తున్నాం
గమ్యం మరచి , లక్ష్యం విడచి
మనలోనే మనం వేరుపడి
మనం ఎటుపోతున్నాం.. ముందుకా వెనక్కా.. 31.10.12

                                
                                  -కరణం లుగేంద్ర పిళ్ళై

30/10/2012

ఎవరైనా చెప్పగలమా


ఏ తీరాలకు ఈ పయనం
అంతే తెలియని గమనం
అలసిపోతున్నా ఆగని వైనం
పురోగమిస్తున్నమో.. తిరోగమిస్తున్నమో
ఎవరైనా చెప్పగలమా..


ఆరడుగలు చాలవనా
వేల ఎకరాల భూకబ్జాలు చేయాలా..
నాలుగు వేళ్ళు నోటిలోకి చాలవా
కోట్లకు కోట్లు మింగేసే తీరాలా
పురోగమిస్తున్నమో.. తిరోగమిస్తున్నమో
ఎవరైనా చెప్పగలమా..

నమ్మిన వారిని ముంచేసే
నయవంచకు తెలివనుకునే తీరును
నాయకత్వమనుకునే భ్రమను చూసి
పురోగమిస్తున్నమో.. తిరోగమిస్తున్నమో
ఎవరైనా చెప్పగలమా..

ఆశ నిరాశల వలయంలో
నిత్యం సంఘర్షణ..
మనసులోని ఆలోచనలకూ
తప్పని పరస్పరం వైరుధ్యాల ఘర్షణ
మనసు ప్రశాంతత లేని మానవ సమాజంలో
పురోగమిస్తున్నమో.. తిరోగమిస్తున్నమో
ఎవరైనా చెప్పగలమా..  13.10.12
                     -కరణం లుగేంద్ర పిళ్ళై 

అక్షరకేతనం


రండి సోదరాలా
అక్షరాలమై జనిద్దాం
ఆలోచనలమై చరిద్దాం
తిమిరాలను కరిగించే
అరుణాకిరణాలమై ఉదయిద్దాం..
ఎవరు చెప్పారు
కవిత్వం వెలుగులు పూయదని
ఎవరన్నారు
పదాలు పోరుబాటకు ఊపిరవ్వదని
కవిత పాటై పల్లవించిందా
ప్రతి గుండె మేలుకొంటుంది
కవిత్వం పాతపడిందనుకంటే తప్పు
అది మన జీవితాన అక్షరకేతనం
 కవిత్వం రాయలంటే
రక్తమే సిరాగా మారాలి
సలసలా కరిగే స్పందనవ్వాలి
ఆలోచనల్లోని అక్షరాలు
అస్త్రాలుగా  పుట్టుకు రావాలి
ఏమి పట్టనట్టు ఉండే లోకాన్ని
చైతన్య గీతాలై తట్టి లేపాలి..

              -కరణం లుగేంద్ర పిళ్ళై  

అమ్మా మరో జన్మ ఇవ్వవా..



ఎందుకో మరి.. ఈ రేతిరి నిదురపట్టడంలేదు
కలలు ప్రసవించే రేతిరి
కళ్ళ ముందు కఠిన వాస్తవాలు నిలుపుతుంటే
బాల్యం లో తొడుక్కున్న ఊహా రెక్కలు
ఒకొక్కటే రాలిపోతున్నాయి
కళ్ళ మేఘాలు కూడా ఒట్టిపోయాక
కన్నీళ్ళూ రాల్చలేని ఎడారితనం
ఇసుకతుపానులా చుట్టుముట్టేస్తుంటే నిదురెట్టపోను..
ఎందుకోమరి ..హాయిగా నవ్వలేకున్నాను
వెన్నెల జాబిల్లిలు పూచిన
ఆకాశం మసకబారింది
ఎగురేసుకున్న గాలిపటాలు
దారం తెగి ఎటో కొట్టుకుపోతుంటే
గమ్యం గురించి ఆలోచించే తీరికేది
ఎంత విర్రవీగిన ఇనుప చువ్వయినా
వేడిచేస్తే మెత్తగా వంగిపోయినట్టు
నెత్తినిండా ఒత్తిళ్ళ సాలిళ్ళ గూళ్లు
అల్లుకు పోతుంటే నేనూ లొంగిపోయాను..
నవ్వడం మరచి నటించడం నేర్చాను
చస్తూ బతకడం కంటే చావేనయం
చుట్టూ అందరూ నాలాగే ఉన్నట్టుంది
ప్లాస్టిక్ నవ్వులు పలకరింపులు తప్ప
పక్కోడి గురించి పట్టించుకునే తీరికేది
మనిషిలా ఎవడూ బతకడం లేదు
అమ్మా మరో జన్మ ఇవ్వవా...
స్వచ్చమైన మనిషిగా  మళ్ళీ పుట్టాలని ఉంది  (30.10.12)
                             - కరణం లుగేంద్ర పిళ్ళై

26/10/2012

ఆకు రాలిన చప్పుడు




ఆకు రాలిన చప్పుడు
వసరాలో నులకమంచంపై భీష్ముడిలా
చావుకోసం ఎదురుచూస్తూ
అలసిపోతున్న గాజు కళ్ళ దృశ్యం
ఉచ్వాస నిఛ్వాసల ఊగిసలాట
తులసి తీర్థం కూడా పోసే ఓపికలేక
ఇంకా ఊపిరిపోదేమని ప్రశ్నించుకుంటూ
కాసులు ఖర్చవుతున్నాయని  కీచులాటల దృశ్యం
ఆస్తి పంపకాలకోసం
కొన ఊపిరి ఆగకమునుపే పేచీలు
రెక్కలు ముక్కలు చేసుకున్న జీవితం
అంతిమదశలో గుండె ముక్కలు చేసుకుంటున్న దృశ్యం
ఎలాగోలా దహన సంస్కారం అయింది
ఆభిమానమున్నవారి భుజాలపై సాగిన శవయాత్ర
ఎంత గొప్పగా చేశారు కన్నవారి అంత్యక్రియలు
పదోరోజు కర్మ క్రియలకు పుల్ పేజీ యాడ్ దృశ్యం
                                         11.10.12
                    //కరణం లుగేంద్ర పిళ్ళై //

ప్రేమ సందేశం



పరవశమంటావో.. పరాధీనమంటావో
ఏదైతేనేం నీ ఆలోచనలే ఊపిరవుతున్నాయి
నిటూర్పులంటావో .. నిరాశలంటావో
ఏమైతేనేం నీ జ్ఞాపకాలే పరిమళిస్తున్నాయి

జీవన వనంలో తోడుగా నీ ఉంటావని
నీ తలపులతో పరిభ్రమిస్తూంటే
కలలమేడలు కూలుతున్న చప్పుడు విని
కాలం వెక్కిరిస్తూ వెళ్ళిపోతోంది

ఇంకా ఎంత కాలం చెప్పు
మేఘ సందేశం పంపుదామంటే
నీలాకాశంలో మేఘాలేవి కనబడటం లేదు
ప్రేమలేఖ పావురాయితో పంపుదామనుకుంటే
పావురాల రెక్కలు ఎవరో కత్తిరించేసినట్టున్నారు

ఈ దూరాలు దగ్గరవ్వాలంటే
నీ మౌనం చిరునవ్వై ఘనీభవించాలి..
నీ పలకరింపు తొలకరిగా కురసి
నా ఎదలోగిలి పులకరింపుతో పొంగిపోవాలి
                      //కరణం లుగేంద్ర పిళ్ళై  //
                                  10-10-12

25/10/2012

అడుగేసి చూడు

నిదురపట్టని కళ్ళకు కలలు కూడానా...
కడలిలా కల్లోలాలు తప్ప...
సుడులు తిరుగుతన్న
ఆలోచనా తరంగాలు తప్ప
నిరాశావాదికి ఆశలు కూడానా
నిటూర్పుల వడగాల్పులు తప్ప
నిర్వేదపు వేదనా భరిత
కన్నీటి చారికలు తప్ప..
ఎందుకు నేస్తమా అంతగా
కుదేలై కుములుతావు
ఎందుకు మిత్రమా అంతలా
వగచి వగచి జీవచ్ఛవమౌవుతావు
ఒక్కో అడుగు వేయి ముందుకు
నిండు ఎడారైనా నీ ముందు వసంతమై చిగురిస్తుంది
చేయి చాపి అందుకోవాలని చూడు
వేలమైల దూరమైనా కూతవేటుకు
నీ పాదాల ముందు వాలి ప్రణమిల్లుతుంది
                         -కరణం లుగేంద్ర పిళ్ళై
                                 11-10-2012  

చురక



భలే మంచి
బేరమంటూ
వాలనున్నాయి
వాల్ మార్ట్  గద్దలు..
తట్టబుట్టా
సర్దుకోవాలా
చిన్ని వ్యాపారులు

సేవానిరతి


చేసిన సేవకు 
ప్రచారం అవసరమా
ఎప్పుడు చెప్పుకోవాలో
ఎప్పుడు కూడదో తెలుసా

ఎన్నడయినా
రెప్పల చప్పుడు విన్నావా
నిశ్శబ్దంతోనే
విధిని నిర్వరిస్తుంది

గుండె లయలు విన్నావా
ఎప్పుడయినా
అవి శబ్ధం చేస్తూనే
విధిని నిర్వరిస్తుంది 
                26.9.12

24/10/2012

వ్యాకులత





బలవంతంగా నవ్వుదామనుకుని
నిలువుటద్దం ముందు నిలబడితే
తాను నా కన్నా ముందు నిలబడుతుంది..
ఎంత వదిలించుకుపోదామన్నా పోదే
నవ్వుల తేనేలు తాగి ఎన్నాళ్ళయిందోనని
మిత్రుల కబుర్లకోసం గ్రామానికెళితే
అక్కడ కూడా అది కరువులా తిష్టవేసుకుని ఉంటోంది.
హాం వర్క్ పూర్తి కాలేదనే సాకుతో మా చంటాడిని
పండక్కి పట్టు చీర తీసివ్వలేదని నా అర్ధాంగికి
ఎవ్వరినీ ఓ పట్టాన వదలిపెట్టదు మరి
బిగుసుకుపోయిన మోముపై చిటపటలా
కరాళ కంకాళ నాట్యంచేస్తూనే ఉంటుంది
ఒకటో తారీఖున జీతం డబ్బులు రాకుంటే
పాలవాడు వచ్చినా తాను నన్నావ ఆవహిస్తుంది..
జేబులో కాసులు లేనప్పుడు చూడాలి దాని పొగరు
తల ఎత్తుకొని నడవనయినా నడవనీయదు మరి
నెత్తిన తానో భూతమై తైతక్కలాడుతుంది.
ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది
ఎల్లప్పుడూ ఏదో ఒక ఉపద్రవంతో వెటాడుతుంది.
సంతోషాల తీరాల వెంబండి
రెక్కలు వచ్చిన పక్షి లా ఎగురాలని ఉంది
పల్లె పైరగాలుల వెంట లేగదూడలా
గంతులేస్తూ పరుగులు తీయాలని ఉంది
                                   20-9-12

కాలం దగ్గరపడింది దొరా ...













మా కలలు రెక్కలు కత్తిరించి
మా డొక్కల్ని ఎండగట్టి
ఊరి గుమ్మానికి  దిష్టి గుమ్మడిగా
వేలాడదీస్తున్న నీ పెద్దరికం ముందు
ఒంగి ఒంగి సలాం చేయాలంటావు..
దీపమై వెలగాలని బడి ఒడిలో చేరితే
చెమట చిందించే చీకటి తప్ప
నాకు వేరే లోకంతో పని లేదంటావు
ఎంత బానిసయినా నేను మనిషే కదా
మనసు పారేసుకుని మనువాడదామనుకుంటే
మంగళ వాయిద్యాలను మూగనోము పట్టిస్తావు
నీ మోచేతి నీళ్ళు తాగుతూ ఒదగి ఉండాలంటావు
లేకుంటే చర్మం ఊడదీసి చెప్పులు కుట్టుకుంటానంటావు
ఏంది దొరా..మరసిపోనావు
సస్తే తీసేది ఆరు అడుగుల గొయ్యే కదా..
పాడికి సకలం సిద్దం చేసేది మేమే కదా.
ఇక నీ శవయాత్రకు లగ్గం ఎట్టుకో..
చితి మంటకు కర్రలమవుదామని
ఇప్పుడే చిగురులు వేస్తున్నాము.. (28.9.12)