EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

31/08/2011

విఘ్నదేవో నమః


విఘ్నాలు కలిగినప్పుడు 
విషాదం కారుమబ్బులై కమ్ముకుంటాయి !
నీతోడుంటే స్వామి 
ఆ విఘ్నాలే విజయాలై జీవితాన 
మధుర ఘట్టాలై నిలుస్తాయి..
మాలో అహంకారాన్ని అణచి 
మమతల మమకారాన్ని నింపు 
మాలో దానవత్వాన్ని చంపి
మానవత్వ పరిమళాలు నింపు..
ఓ వినాయక ..శరణు శరణు
ప్రజలందరికి ప్రశాంతత నివ్వు
మా రాష్ట్రానికి శాంతి సౌభాగ్యాలు ఇవ్వు ..

వినాయక చవితి శుభాకాంక్షలతో ...

                        కరణం లుగేంద్ర పిళ్ళై
 
 
 

 
 

30/08/2011

పల్లెటూరు !


పచ్చని పైరుల మైదానాలు 
పరుగులెత్తే లేగ దూడల విన్యాసాలు 
పిల్ల కాల్వలలో  పిల్లల ఈదులాటలు
వీధి వెంట ఆప్యాయంగా పలకరింపులు 
పల్లెలో ఎప్పుడూ  ఉత్సాహమే 
రావి చెట్టు క్రింది రచ్చ బండ 
మర్యాద రామన్నలా తీర్పు చెబుతుంది 
ఎవ్వరికి ఏమైనా నేనున్నానని 
ఓదార్పునిస్తుంది ..
అక్క, అన్న అంటూ అందరితో 
బంధుత్వం కలుపుతోంది 
పురుడుకైనా, చావుకైనా 
ప్రతి గుండె కదులుతుంది
ప్రతి గడపా కదులుతుంది 
భజన మందిరంలో పాటగా
అందరిని కలుపుతుంది 
ఉట్టి కొట్టమని కుర్రకారుని ఉత్తేజపరుస్తుంది 
ముగ్గుల గొబ్బెమ్మలుగా ముస్తాబవుతుంది
పల్లెలో పంట పండితే రోజూ సంక్రాంతే ..
ఏ ఇంటిలో పెళ్లి అయినా తోరణాలు కడుతుంది 
పల్లె అమ్మలా ఎప్పటికి మరచిపోదు 
 పల్లె తిరునాళ్ళు ఈ జీవితం మరచిపోదు !!
                              కరణం లుగేంద్ర పిళ్ళై








29/08/2011

అమ్మ భాషే కదా అమృతం..!

అమ్మ ఒడిలో ఆటలాడినట్టు
ఆవు పాలు త్రాగినట్టు 
ఆవకాయను నంచుకుతిన్నట్టు
అమ్మ భాష ఎంత మదురమైనది
కోయిల కిల కిలారావాల సంగీతం
మమతానురాగాల మానవతా సమ్మిళితం
మాతృ భాషలో మాటలాడితే
మనసు ఎంత పరవశమవునో కదా
మరెందుకీ బానిస మనస్తత్వమూ ?
మనకెందుకీ పరభాషా వ్యామోహమూ ?
ఎన్ని భాషలైనా నేర్వవచ్చు ..
ఎన్ని పీటాలయినా ఎక్కి భువిని ఎలావచ్చు
అయినా మాతృ భాషనూ మరువుట తగునా
అమ్మ భాషే కదా అమృతం
క్షీణిస్తున్న భాషకు క్షీరాభిషేకం చేసి
పిల్లలకు ఉగ్గుపాలతో పట్టిద్దాం..
ప్రాచీనమౌ భాషా సంస్కృతి మనదని
దేశభాషలందు తెలుగులేస్సయని
ప్రతి ఎదలోన ప్రేమజెందాలను ఎగురవేద్దాం
మూలాలు మరచి.. నింగికి ఎగిరితే
నేల విడిచి సాము చేసినట్టే !
మన తల్లి భాషనూ మరచి.. కించపరచినట్టే
మన సంస్కృతి మరణించినట్టే ..
సోదరులారా రండి ..
మమ్మీ డాడీలు మరుద్దాం
అమ్మ, నాన్నా అని పిలుద్దాం ..
ప్రాంతీయమౌ మాండలిక సొగసులతో
తెలుగు భాషకు సొభగులు అదుద్దాం
తెలుగు భాష ప్రపంచమంతా విస్తరించేటట్టు
భాషకు ప్రతి ఇంటిలో పట్టాభిషేకం చేద్దాం !!

          కరణం లుగేంద్ర పిళ్ళై






ప్రియ నీతలపు

దిగులు గుబులు మబ్బులై
ఎద ఆకాశాన్ని కమ్మేస్తే
నవ్వుల హరివిల్లువై
నువ్వు కనిపిస్తావు
మోడుబారిన కొమ్మనై
దిక్కుతోచక అలమటిస్తుంటే
నీవు ఆశల దిక్శూచి వవుతావు ..
ఎవరు పలకరించని నన్ను
నీ పలుకుల పరవశంతో ముంచెత్తుతావు..
ఏమని నిన్ను పిలువాలో తెలియని నాకు
నా ఊపిరే నీవని అనిపిస్తున్తావు
కళ్ళ లోగిలో నీరూపం నిండిపోయింది
చూసిన ప్రతి అణువూలో నిన్నే చూపుతోంది ..
యోచల ఆలోచనల్లోనూ నీ తలపులే
కలల సవ్వడి చేస్తూ నువ్వు
నా హృదయ వేదికపై నాట్యమాడుతున్నావు !
నీవు క్షణం దూరమైనా .. ప్రాణం విలవిలాడుతోంది
నీవు  స్పరిస్తే నాలో క్రొత్త ఉత్స్తాహం పొంగిపోరలుతోంది ..

                                      కరణం లుగేంద్ర పిళ్ళై





మాగోడు వినండి

నేలను నమ్ముకున్నవాడు
నేలపాలవుతున్నాడు ..
అన్నమ్పెట్టేవాడే అక్రోశిస్తున్నాడు ..
విత్తనం వేస్తె కలల
పంట వస్తుందనే నమ్మకం లేదు..
జీవితం అస్తిరమైన చోట
ఆశల చిగుర్లు ఎలా వేస్తాయి..
క్రాప్ హాలిడే తీసుకొని
చేతులు ఎత్తివేయడమే
రంగం నుండి తప్పుకోవాలంటే
మనసు వోప్పుకోవడంలేదు
నేల తల్లి సాక్షిగా
విధానాలే మా ఊపిర్లు తీస్తున్నాయి
మాగోడు వినండి
మాకు చేయూతను ఇవ్వండి
మీకు అన్నం పెట్టె వాళ్ళం
మాకు సున్నం పూయకండి !!


27/08/2011

సఖియా స్వాగతం !

ఎక్కడ ఉన్నవో ...ఎలా ఉన్నవో
నీ ఆలోచనలతోనే ఉక్కిరిబిక్కిరిఅవుతున్నా .....
ఓ నా ప్రియ సఖీ ..
మరపురాని నీ తలపుల జడివానలో
తడిచి ముద్దవుతున్నా .....

ఏ అలికిడి విన్నా నీవేననే అలజడిలోనే
నిత్యం నీకోసం ఎదురుచూస్తున్నా  ....
తరులైనా.. గిరులైనా , పారేజలపాతాలైనా
నీ ప్రతిరూపాన్ని చూస్తూ తరిచిపోతున్నా ..

నీడలా వెంటాడే నీ జ్ఞాపకాలు
ఉచ్వాస నిచ్స్వాసలవుతున్నాయి ...
తోడులా వెంటుండే నీ గురుతులు
చీకటిలో వెన్నెల కాంతులవుతున్నాయి

సుదూరాల తీరాలు దాటి చెంత చేరవా...
ఊహల దివినుండి వాస్తవమవ్వవా


26/08/2011

బుద్ధుడి సాక్షిగా...!

రాజధాని నడిబొడ్డున బుద్ధుడి సాక్షిగా
తెలుగు జాతిపై విసిరిన చాదస్తపు  పంజా అది 
వైతాళికుల ప్రతిమల్ని నేలకు కొట్టి 
ఉద్యమం పేరుతొ ఉన్మాదం ఊరేగిన రోజది 
అది ఒట్టి విగ్రహాల ద్వంసం కాదు...నరమేధమే 
నాగరికతా సమాజంపై వితండ వాదుల విద్వంసమే ..
మన వేలితో మన కంటినే పొడుచుకొనే 
ప్రాంతీయ భావజాలాల సంకుచితత్వం !
జాతికే తలమానికులయిన  మన నేతల్ని
మనమే అవమానించుకొనే మూడత్వమే ..
వేరు వేరుగా వుండాలంటే .. సంస్కృతిపై దాడేందుకు  ..
సోదరుల భావాలను మనమూ గౌరవిద్దాం ..
అయితే తెలుగు నేలపై తాలిబన్లుగా మారిన కొద్ది మంది 
మొత్తం తెలుగుజాతిపై కత్తి కట్టడం అంటే  ఉన్మాదమే కదా..
బుద్ధుడి  విగ్రహాలు నేలకూల్చిన తాలిబాన్ల రాజ్యం 
నేడేక్కడ  మట్టిపాలుకాలేదా ?
విద్వంసంతో ఎక్కడా శాంతిని నెలకొల్పలేము
సూర్య చంద్రులకు ప్రాంతీయత అంటుతుందా ..
అలాగే సంఘ సంస్కర్తలకూ అంటదు.. 
వారిని అవమానిస్తే మనల్ని మనం మరుగుజ్జులం చేసుకోవలసిందే 
శ్రీ లంక లో తమిళ్ వాళ్ళకు అన్యాయం జరిగితే 
తమిళ నాడు లోని సోదరులు ఒప్పుకోరు ..
మరి మనం ఏమిచేస్తున్నాం
మహానుభావులను ఒక చట్రంలో బందించితే
మన  జాతిని ఎదగకుండా ఆపడమే !
 ప్రాంతాలు వేరు కావొచ్చు మానవత్వం ఒక్కటే
భావాల్ని ప్రవహింపచేసే భాష ఒక్కటైనప్పుడు 
అది మనల్ని కలిపి పేనవేసే ఊపిరిగా చేసుకొందాం 
రండి సోదరులారా !
తగిలిన గాయాలకు మమతల పూతలు పూద్దాం !
వాడిన తోటలో స్నేహ సుగంధాలు పూయిద్దాం !!

                                                                కరణం లుగేంద్ర పిళ్ళై



కార్గిల్ కన్నీటికి విలువేముంది..


నేను కన్న కలల రూపం
నా ముందే ఎదుగుతోన్నపుడు
ఎన్ సి సి లో వాడు చేరుతానంటే 
దేశం గర్వించే వాడు కావాలనుకున్నా
జైహింద్ అంటూ వాడు వేసే  అడుగుల సవ్వడిలో 
నా భారత మాతకు రక్షణ కల్పిస్తాడనుకున్నా..
కార్గిల్ యుద్దంలో పోరాడి నేలకోరిగితే
వాడి కాళ్ళకు మొక్కాలనిపిచింది...
జోహార్ అని అందరూ అంటుంటే  కన్నీరు మరచిపోయా
నేడు మన దేశంలోనే అవినీతి నాయకులు వుంటే
కార్గిల్ కన్నీటికి విలువేముంది..
యుద్ద వీరుల త్యాగాలకు పలితమేముంటుంది ..
స్వాతంత్రానికి అర్థమేముంది..
అందుకే మరో పోరుకు సిద్దమవుదాము..
రండి నా సహచారులారా ..
అవినీతి పై యుద్ధం ప్రకటిద్దాం ...
మరో స్వతంత్రం కోసం చేయి చేయీ కలుపుదాం !!
ఇప్పుడు నేను యుద్ద వీరుడనే అవుతాను !!

                                                  కరణం లుగేంద్ర పిళ్ళై





24/08/2011

నేటి రామాయణం !

చాకలి మాటలకే
రాముడు తల్లడిల్లాడు
సీత అగ్నిపునీతురాలైంది ..
అది ఆనాటి రామాయణం ..!

నేడు ఎవరు ఏమన్నా
ఎన్ని ఆరోపణలు చేసినా
ప్రత్యారోపణ చేయడం
ఇతరుల్లో తప్పులు వెతకడం
నేటి రామాయణం !

మాటల్లో అందరూ రామరాజ్యం అంటారు
విలువలు లేని రాజ్యం ఎందుకు
తముల్నే చంపి శోకం విలువ తెలిసి అశోకుడు
శాంతికి చిహ్నంగా  మారాడు
ధర్మ పాలన చేసాడు ..

చేతకు మాటకు పొంతన ఉండబట్టే
గాంధీ మహాత్ముడు అయ్యాడు ..
సిధార్డుడు బుద్ధుడుగా అవతరించాడు
అన్నా హాజారే జాతిని మేలుకోల్పగాలిగాడు

నేతల్లలారా సొల్లు కబుర్లు మాని
మీరు మారండి ..మీ పార్టీని ప్రక్షాళన చేయండి
మీరు వేషాలు మానిన నాడే
మాకు అంతో ఇంతో మేలు చేసినట్టు
మీరు డ్రామాలు ఆపిన రోజే
మాలో మాకు ఇక్యమత్యం పెంచినట్టు ..

-                          కరణం లుగేంద్ర పిళ్ళై



మనిషీగా మళ్ళీ జన్మించు !!


కమ్ముకున్న కటిక చీకట్లలో బందీగా
ముంచుకొస్తున్న  ముప్పుకు బానిసగా 
ఎన్నాళ్ళు ఎలా బ్రతకడం ?
నిరంతరం చస్తూ బతికే బతుకు ఒక బతుకేనా ?
మనిషి మనిషిలా బతకలేకుంటే చావడం న్యాయమా ?
చావాలసింది మనిషికాదు పిరికితత్వం ...
మొలకేత్తవలసినది ధీరత్వం !!
సూర్యున్ని చూడు తనలో వాడి వీడి తగ్గినప్పుడు 
సంధ్య పోత్తిల్లకేల్లి విశ్రమిస్తూ
తూరుపు సింధూరమై ఉదయించయటం లేదా ?
నీకేమైంది మిత్రమా ! ఏమిటి వెర్రితనం 
ఉరి తాడుకు వేలాడితే పిరికితనం కాక మరేమిటి ?
ఒక అల్లూరి , ఒక సుభాష్ చంద్ర బోష్ నీలోనూ  ఉన్నారే ..
ఒక బుద్ధుడు ఒక మహాత్మా నీవు కాలేవా?
ఊపిరితో ఉంటేనే బతుకు పండుగ అవుతుంది ..
ఒట్టి  మనిషివే అయినా మనీషీగా మారగలవు
పారిపోవడం కాదు పోరాడటం నేర్చుకుంటే 
అగ్ని పర్వతం చీల్చుకొని లావాలా కదలగలవు 
చీకటి రాజ్యాన కాంతి పున్జమై నడిచి చూడు
వెన్నెల వెలుగులు సాటివారి బతుకుల్లో పూయించగలవు ..
మనిషి మౌనం కాదు ప్రశ్నించే ఓ చైతన్యం 
మనిషి అంటే బానిసలా వంగి సలాం చేసే గులాం కాదు
విల్లులా వంగినా శరంలా దూసుకుపోయే గాండీవం !!!
-                                            కరణం లుగేంద్ర పిళ్ళై

మాకూ సెలవు కావాలి !


నింగికి వేసాము
బతుకు లంగరు 
వర్షపు చుక్క 
నేలరాలలని !

నేలతల్లి గుండెను 
చీల్చుకు తలపైకేత్తిన 
విత్తు శిశువుకు
మొగ్గలోనే నూరేళ్ళు !
పచ్చని పొలాలు లేవని
పండినా తగిన రేటు లేదని
గుమ్మలకే వేలాడుతున్నాము
శవాలమై
దహన ఖర్చులకా
ఎక్ష్స గ్రేసియాలు ?


క్రాప్ హాలిడే అంటే
కూడదంటారు
మరి అందించే చేయూత లేదే ?
మాకూ సెలవు కావాలి !




బొంకనేర్చిన వారొకరు
బొక్కేసేవారోకరు
కొంగజపం చేసే నేతలకు
నేతన్నల గోడు తెలుస్తోందా?


కడుపు నింపుతున్న వాడినే
కొల్లగొట్టే నీతి  ...
పాలకులారా
చేతులెత్తి వేడుకొంటున్నాము
మమ్మల్ల్ని రైతులుగా చూడండి
ఓటరుగా కాదు ...

- కరణం లుగేంద్ర పిళ్ళై











21/08/2011

ఆకాశమే హద్దు ..

మరుగుజ్జులాంటి నన్ను చూసి 
నీలాకాశం నాతొ అంది 
నన్ను అందుకోవా అని...
చీకటిలా కుమిలిపోతున్న  నన్ను 
జాబిల్లి  తనలా  వెలగమంది 
వెక్కిరింత అనుకోమని నా అహం అంటోది 
 అది కూడా వెన్ను తట్టడమని హృదయం అంటోంది
విత్తనమై రాలిపడి మట్టిని చీల్చుకుని
గడ్డిలా మొలిచిన నేను 
వృక్షంలా ఎదగాలని వుంది ..
చినుకుగా నేలకు చేరిన నేను 
పిల్లకాల్వలా పరుగులెత్తి 
ప్రవాహమై  సంద్రాన్నీ చేరాలని వుంది...
గాయమైన ప్రతిసారి గమ్యం గురుతుకు వస్తుంది 
పోతుంది అనుకున్న ప్రాణం సంకల్పమై నిలుస్తుంది ..
నాకు ఆకాశమే హద్దు ..
ఊపిరిని  నిచ్చెనగా చేసుకొని  
ఆహ్వానించిన ఆకాశం  అంత ఎత్తు ఎదిగి 
జాబ్బిల్లిగా విరబూస్తాను ...!
నేలకు రాలడమే కాదు 
ఆవిరిగా పైకి ఎగబ్రాకడం తెలుసనీ నిరూపిస్తాను.!!


























19/08/2011

ద్విముఖి


గొంతు నీది కాదు
మాట నీది కాదు
ఎవరో ఆడిస్తే ఆడే 
తోలుబోమ్మవా?

పాత్రా నీది కాదు
చేష్టా నీది కాదు
రంగులు పూసుకోని
రంగస్థల నటుడివా?
ఎందుకు అంతగా నటిస్తావ్
   

ముసుగు లేకుండా బతక లేవు
చిచ్చు పెట్టకుండా ఆగలేవు 
మాటల ఆయుధాలు చేసే
ఆధునిక ఉన్మాదివా ?

నువ్వు చావవు... నీవాళ్ళు చావరు 
ఉద్యమ జెండా మోస్తూ 
నిత్యం నేలకోరుగుతున్న  యువతరం
నీవు మాత్రం చలి కాచుకుంటూ 
అగ్గిపుల్ల గీసి పడేస్తూ ఉంటావు 








 


 




జీవిత సత్యాలు !

మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి
మహీధరుడను తానంటాడు విర్రవీగి
మట్టి ఒడిలోకి చెరక తప్పుతుందా ఎంతటివారికైన
తెలిసినడుచుకోనుమా తాపస గుణధీరా!

ఆత్మ బలం లేనివాడు అవిటివాడు
ఆత్మ వంచన చేయువాడు మూర్కుడు
ఆత్మనెరిగిన వాడు పరమాత్మ నేరుగును
తెలిసినడుచుకోనుమా తాపస గుణధీరా!

ఎంత ఎదిగినా తృప్తి లేదు
సంతోషమూ , సంతృప్తి కానరాదు
ప్రాప్తమునంత వరకే ఫలం
తెలిసినడుచుకోనుమా తాపస గుణధీరా!

17/08/2011

మువ్వల సవ్వడి !


నవ్వితే మువ్వల సవ్వడి
మాట్లాడితే ముత్యాల సందడి
ఓ నా ప్రాణ సఖి ,,
నీవు నడుస్తుంటే
హంసల గుండెల్లో అలజడి !
పాటలా , ఆటలా
నా జీవన తోటలో విహరించు !
నీకోసం  నా జీవితమే
తివాచీగా మారి స్వాగతించు !!


ఏమో !



ఎంతమంది
కార్చిన కన్నీరో
సముద్రంలో నీళ్ళు
ఉప్పగా వున్నాయి !

ఎన్ని అగాధాలను
పాతాళానికి తోక్కిందో
ఆకాశం
అందనత ఎదిగింది !!



విలువ !

కాలం విలువ
ఉడిగిపోయిన
వయస్సు చెబుతుంది

కాసుల విలువ
ఒట్టిపోయిన
జీవిత చరమాంకంలో
పేదరికం  చెబుతుంది!

మనిషి విలువ
పోయిన తరువాత
కీర్తి చెబుతుంది !!



14/08/2011

గొంతులు పుష్పించాయి !

 
విరిచేసిన రెమ్మల్ని తిరిగి తగిలించుకోవడం
తగిలిన గాయాలకు కర్మ సిద్ధాంతం పూసుకోవడం
షరా మామూలే

క్షణ క్షణానికి మరింతగా వంగిపోవడం
ఆశల్ని ఆవిరిగా పోగొట్టుకొని నిస్తేజమై
మబ్బులులేని ఆకాశాలలో ఇంద్రధనస్సులు వెతకడం
మాకు అలవాటే

వసంతం పూయని జీవిత వనంలో
బాల్యమైన వార్ధక్యంలా గడిపేయడం
ఎండిన డొక్కల్ని పగల ప్రతీకరాల దుప్పటితో కప్పేసి
ఎడారిలోనైన నయాగారాలు వున్నాయని భ్రమించడం
తర తరాలుగా చేస్తునదే

తామరాకుపై నీటి బొట్టులా జారిపోయే వారికోసం
కత్తులతో స్నేహించడం ...నేతురు బొట్టుగా నేలరాలడం
కలతల కరచాలనంతో మౌనంగానే భరిస్తునదే....

ఒంటరిగా ఒతిళ్ళల్లోకి కూరుకుపోవడం
గుంతలుపడ్డ కళ్ళ లోయలలోకి
పగటి కలల్ని ప్రసరించడం పాత మాటే

ఇప్పుడిప్పుడే తూర్పు, పడమరల తేడా తెలుస్తోంది ..
బతుకు వాకిళ్ళకు పండుగ తోరణాలు కట్టి
పురితిలోని సూర్యుడు కిరణమై లేస్తునాడు
వాడ వాడలా పూయడానికి వసంతం
కోయిల గానమై పరవళ్ళు త్రోకుతోంది !
ప్రశ్నగా మారే క్షణం కోసం సంకెళ్ళు బద్దలవుతున్నాయి!!

-                                              కరణం లుగేంద్ర పిళ్ళై

నాతిచరామి!

నాతిచరామి!

పెళ్లిచూపులు 
కట్నకానుకలు 
లగ్న పత్రికలు 
ఇవే కాదు పెళ్ళంటే !

ఏడు అడుగులు 
మూడుముళ్ళు 
మంగళ వాయిద్యాలు 
ఇవే కాదు పెళ్ళంటే !

నెత్తిన అక్షింతలు 
పోసుకునే తలంబ్రాలు 
పట్టు పీతాంబరాలు 
ఇదే కాదు పెళ్ళంటే !

విందులు వినోదాలు 
అతిధి మర్యాదలు 
ఆకాశమంత పందిర్లు 
ఇదే కాదు పెళ్ళంటే !

 పెళ్ళంటే స్నేహాని పెంచుకొని
తోడూ నీడలా 
ఒకే ఊపిరి దారంతో 
పెనవేసుకొనే రెండు హృదయాలు !

పెళ్ళంటే ఆహాలను చంపి
ఒకేదారిలో నడిచేందుకు 
రెండు జీవితాలు 
చేసుకున్న సర్దుబాట్లు !!

-          కరణం లుగేంద్ర పిళ్ళై


13/08/2011

మువ్వన్నెల జెండా !


మువ్వన్నెల  జెండా      
మూడు రంగుల జెండా 
మన జాతీయ జెండా 
ఎగురవేద్దాం నింగి నిండా 
మతాల మత్తు వీడాలి
కులాల కుంపట్లు ఆరాలి
మానవత్వం నిండిన మనిషి 
  స్వేచ్చా గీతమై రెప రెపలాడాలి  
సమానత్వం ఊపిరిగా
ఆనంద కెరటమై ఉరకలు వేయాలి
!రండి అడ్డుగోడలు తొలగిద్దాం
...!! లేవండి సరిహద్దులు చేరిపెద్దాం
 
                                                                               -    కరణం  లుగేంద్ర పిళ్ళై

  








 







11/08/2011

అగ్నిపునీతం

ఒకప్పుడు నా సీమ రతనాల సీమ 
రాయలు ఏలిన ఈనేల పౌరుష పరాక్రమాల ఖిల్లా ...
నాడు నాగలి భుజాన వేసుకొని
రైతు నడుస్తున్నా...రాజులా కనిపించేవాడు ...
అన్నపూర్ణగా ఉన్న ఈనేల నుండి రత్నాలు పండించేవాడు ...
ఏది ఆనాటి వైభవం ...
శిధిలమవుతున్న చంద్రగిరి కోటలా మారిందా?
ఏదీ ఆనాటి ధీరత్వం...
చిక్కి శల్యమవుతున్న ఫ్యాక్షన్ గ్రామంగా మారిందా?
నేడు రైతు రోడ్డున పడ్డాడు 
విత్తనం కొనాలన్నా యుద్ధం చేయాల్సిందే !
విత్తు విత్తలన్నా నీటి చుక్క కోసం నింగికేసి చూడాల్సిందే ...
అయ్యో ! రాజులా బతికినా రైతే పల్లె వదులుతున్నాడు 
బస్తిల్లో బస్తాలు మోసుకొని బతుకు బండి ఈడుస్తునాడు ....
పట్టెడన్నం పెట్టె వాడే పస్తులుంటున్నాడు .
ఇదేనా అలనాటి రాయలసీమ?
పగలు , ప్రతీకారాల మూఢ సీమ
లాభంలేదు నాసీమను అగ్ని పునీతం చేయాలి 
ఓ రైతన్నా ! కన్నీటి మడుగులోనే క్రుంగడం కాదు  
ఎండిన బీడు భూములలో తోలకరిగా కురవాలి !
 వేదనల విషవలయంలో విచారించడం కాదు 
వేదమై , చైతన్య నాదమై నీవు కదలాలి !
నీవు నడుస్తున్న నేల పచ్చదనం పులుముకోవాలి !
నిన్ను రాజుగా కొలిచేందుకు పల్లె పల్లె మేలుకోవాలి !!

                                                  కరణం లుగేంద్ర పిళ్ళై



















మాతృ భాష


 నేస్తమా తెలుసుకోనుమా
 మన మాతృబాష తెలుగుమా 
మాతృ బాషలో  వెలుగు వుంది
కమ్మనైన మధుర భావన వుంది 
అమ్మను మరువగలమా?
పలకరింపులో పులకరింతలు 
ఆప్యాయతల అనురాగాలు 
పరబాష మోజులో పడి 
మరచి పోవడం న్యాయమా !
మాతృ భాషనీ మరవకు
మాతృ భూమిని వదలకు 
ప్రాణం  వుండుదాకా
మాతృ బాషను విడువకు 

                       ఉత్తేజ్ కిరణ్ 


   
 

 
 


    


10/08/2011

చదువు !


చదువు
కొందరికి బరువు
మరికొందరికి కరువు
ఇంకొందరికి పరువు
టోటల్ గా ఈ దేశంలో
ఎంత చదివినా
దొరకనంటోంది
బ్రతుకు తెరువు !!

- కరణం లుగేంద్ర పిళ్ళై



నిజం!

మనం నవ్వుతుంటే
ఏడుస్తుంది
మనం ఏడుస్తుంటే
నవ్వుతుంది
సమాజం
దాన్ని లెక్క చేయక
ఎదిరించి చైతన్యంతో
నడిచావంటే
కుక్కలా తోకాడించి
వెన్నంటే నడుస్తుంది
ఇది నిజం !
        - కరణం లుగేంద్ర పిళ్ళై



ఎదురు చూపు !


రెప్పలు వాల్చని ఆ జంట కళ్ళు
గబ్బిలాల్లా వాకిళ్ళకు వేలాడుతూనే ఉంటాయి
చెమ్మగిల్లిన జ్ఞాపకాలను చెంగు వారిస్తున్నా ..
ముసలి జీవాలు నెమరువేస్తూనే ఉంటాయి
కృష్ణాష్టమి కృష్ణుడే   ఆ ఇంట నడిచినట్టు జ్ఞాపకం
బోసి నవ్వుల బాబు కిలకిల నవ్వినట్టు జ్ఞాపకం
లేక లేక పుట్టిన వారసుడు ఇంతింతై ఎదుగుతుంటే
రోజూ దిష్టి తీసి దోషం లేకుండా చేసినట్టు జ్ఞాపకం
పలకా బలపం చేతబట్టినప్పుడు పొంగిపోయినట్టు జ్ఞాపకం
కాలేజి చదువుకోసం పొలం అమ్మిన జ్ఞాపకం
వాడు విదేశాలకు వెళ్ళాలంటే వి. ఆర్. యస్  తీసుకున్న జ్ఞాపకం
మిణుకు మిణుకుమంటూ ఎక్కడో చావని ఆశ
సంద్రంలోని జీవన నౌకకు దిక్సూచి అవుతోంది ...
పెనవేసుకున్న పేగుబంధం పురిటి వాసన గొంతు
ఫోనులో వింటేనే పోయిన ప్రాణం తిరిగి వస్తోంది ..
బాబూ .. మేము బతికివుండగానే ఓసారి రావా! అన్న మాట
గొంతు గడప దాటాక మునుపే పూడుకుపోతోంది !
బతుకు రెక్కలు తొడిగిన బిడ్డ
దూరదేశాలు వెళ్ళినందుకు గుండె ముక్కలవుతోంది !!

- కరణం  లుగేంద్ర పిళ్ళై

09/08/2011

2011ఉగాది సందర్భంగా కరణం లుగేంద్ర పిళ్ళై ను సన్మానిస్తున్న
చిత్తూరు జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ మరియు ఎస్పి

ఎడబాటు


నీవు దగ్గర వున్నపుడు ఎప్పుడూ తెలియలేదు
ఎడబాటు లో ఇలా జ్ఞాపకాలు వెంటాడుతాయని..
నీవు దూరంగా వున్నా .. నా దగ్గరే వున్నట్టు
గాలి అలికిడి విన్న .. నీవు పిలిచినట్టు

నా నీడ నీవై కబుర్లు చెబుతూ వెంట నడిచినట్టు
పండు వెన్నెల కాస్తోంది అచ్చం నీవు వచ్చినట్టు
సెలయేరు పారుతోంది గల గలా నీవు నవ్వినట్టు
మెరుపు మెరుస్తోంది.. నీ వాలు చూపు గుచినట్టు
ఉరుము గర్జిస్తోంది  .నాపై నీకు కోపం వచ్చినట్టు..

అలా చూడు .. కోయిల నీలా పాడుతోంది..
ఇటు చూడు .. నెమలి నీలానే నాట్యమాడుతోంది
రాత్రి ..ధాత్రిని కప్పేస్తోంది నీ కురులు ఆరబోసినట్టు..
నీ మాటల ముత్యాలు ఏరుకుంటూ
నీ గురుతుల వీణలను మీటుకుంటూ
ఎడబాట ఎడారిలో ఒయాసిస్సా
నీకోసం చకోరమై ... ఎదురు చూస్తూనే ఉంటా
ప్లీజ్ త్వరగా వచ్చేయవా  ?


 -                                             కరణం లుగేంద్ర పిళ్ళై




05/08/2011

అమ్మతనం

 

04/08/2011

తెగుతున్న శృంఖలాలు !


పుట్టుక నుంచి చావు దాక లక్ష్మణ రేఖలే
రెప్పతీసి రెప్ప వేసేలోపు చూపులకు సవాలక్ష్ణ అంక్షలే
తనో మనిషిగా బతికి ఎన్ని తరాలయిందో
తనో బంధాల బానిస గా మరి ఎన్ని యుగాలు అయిందో ..
కాలిగోటి నుంచి తలదాక సంకెళ్ళే
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాక కన్నీటి మడుగులే
తరం మారుతోంది కాలం మారుతోంది
అక్షరాల ఆలోచనల శకం వెలుగులు చిమ్ముతోంది
ఇనుప పంజరాల నుండి స్వేచ్చా గీతం
ప్రతి అడుగులోనూ ఆత్మ విశ్వాసపు సంగీతం
అంతట లయబద్దంగా మోగుతున్నాయ్
సానుభూతి కోరుకునే బక్క మనసులు కారు వారు
విజయ తీరాలలో బతుకు జెండాలు పాతారు
నిటుర్పుల వదగాల్పులకే  సోమ్మసిల్లె వారు కారు
నిలువెత్తు ఆదర్శమై ఎవరెస్టుగా ఎదుగుతున్నారు
ఆకాశంలో సగమేనా .. అంతటా విస్తరించడానికి
ఎన్నిరూపాలో ఎత్తారు .. అందలేని ఎత్తులకు ఎదిగారు
పరాక్రమానికి అపర రుద్రమలు
దయా హృదయానికి మదర్ తెరిసాలు
నింగికేగిరే రాకెటైపై దూసుకేల్లుతూ
అంతిమ తీర్పు చెప్పే నేతగా ఏలుతూ
రంగం ఏదైనా నేడు వారిదై పైచేయి అవుతోంది
శృంఖలాలు తెగుతున్న చప్పుడు వినిపిస్తోంది

                                 -కరణం లుగేంద్ర పిళ్ళై




02/08/2011

అన్నీ ప్రశ్నలేనా ?


వేకువ వెక్కి వెక్కి ఏడుస్తోంది
ఎంతసేపు వేచి చూసినా
సూర్యోదయం కావడం లేదు
బహుళ జాతి కంపెనీకి తాక్కట్టు పెట్టారేమో ?

ఎడారిలా బతుకు మారింది
కన్నీరు ఎంత తాగినా దాహమే
నీటి చుక్క జాడ లేదు
మినరల్ దొరలు బోరులు వేసి తోడేసారేమో?

నానాటికి నేల తరిగి పోతోంది
ఆరు అడుగులు కూడా మిగలదాయే
అపార్ట్మెంట్లకు మాత్రం కొదవలేదు
వామనుడి అడుగులు బడా బాబులు నేర్చారేమో ?

దుమ్ము కంటిలో నిండి పోతోంది
ఊపిరి తితులు  ఒట్టి పోతున్నై
కాలుష్యం కాలనాగు  కాటుకు
జీవ కారుణ్యాన్ని కాటిన్యం  కమ్మిందేమో ?

కళ్ళు నిప్పులు కక్కు తున్నాయి
నిప్పుకు కూడా చెదలు అంటిస్తున్నారు
గుండె మంటలు చలిమంటలా
బడుగు బతుకులపై పిడుగులు పగ బట్టయేమో !!
                                      -కరణం లుగేంద్ర పిళ్ళై 


ఎవరు నీవు ?

తూర్పు నాకు చెప్పింది
ఉదయం నీవని !

పడమర అంది
నీవే సంధ్యా కిరణమని!

ఉత్తరం అంటోది
నీవు నా నీడవని !

దక్షిణం చెబుతోంది
నీవు నా తోడువని!

నా హృదయం అంది
నీవు నా ఊపిరని !

మౌనమే నీవై హింసించక
ప్రియతమా!
ఇంతకు నీవేమని అంటావు?




01/08/2011

Certificate preented by ANR on Cine geetha rachana at Hyderabad on 25th June 2011
Poem reading at Vekuma Award Function at Penugonda on 10th July 2011

మట్టితో మమేకం

మట్టి వాసన లేదు గుండెల్లో తడిలేదు
కాంక్రీట్ అరణ్యంలో అడుగడుగునా
నేల విడిచి సాము చేసినట్టుంది బతుకు
నగరం వచ్చి ఎంత తప్పు చేసాం!!!
పల్లంటే వొట్టి ఊరైనా మన మూలాలు అక్కడే కదా
వీధి అరుగు అమ్మలా జోకొడుతుంది
రచ్చబండ న్యాయస్థానమై తీర్పు చెబుతుంది !
అక్కడి బాల్యమంటే తీపి గురుతులే
చెరువులూ చేప పిల్లమై ఈదిన క్షణాలు
నింగికి గాలి పాటలై ఎగిరిన ఉత్శాహాలు
కబాడీలు , కుందాటలు,కోతి కొమ్మచలూ
ఊరంతా బొంగారలై గిర గిరా తిరిగిన
బాల్యాలు గురుతుకు వస్తునాయి
పల్లెల్లో ప్రతి రోజూ పండుగే
మట్టి వాసనలలో వాడని మమతలు వున్నాయి
బాబూ మళ్ళీ పల్లెకు తీసుకుపోరా!
పల్లెల్లో బంధాలు పేగు బంధాలే
పల్లెల్లో వుంటే పలకరిపులే సగం ప్రాణాలు
మోముకు ముసుగు వేసుకొని వ్యక్తిత్వాలు
కల్మషమెరుగని హృదయ సౌందర్యాలు వాళ్ళవి
కట్టేలా, కరెన్సీ నోటులా ఇక్కడ ఉండలేకున్నా
వృధ్యాప్యం కూడా బాల్యమే కదా చిన్నా
నన్ను మళ్ళీ పల్లెకు తెసుకుపో
వేర్లను వదలి ఎంత తప్పు చేసానో...
పోగొట్టుకున్న స్నేహాలను వెతుక్కుంటూ
జ్ఞాపకాల సెలయేట్లో ఈదులాడాలని  వుంది
పల్లె తిరునాళ్ళలో ఆటలు ఆడాలని  వుంది !
జనం గొంతులూ పాటని పల్లవించాలని వుంది
మట్టిలో మట్టినై పల్లె తల్లి ఒడిలోనే ఒరిగిపోవాలని వుంది!!


                                             -కరణం లుగేంద్ర పిళ్ళై