EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

10/05/2013

మరణంలోనూ జీవం



పండి రాలిపోతున్న ఆకును చూసి
ఓ వెకిలిగా నవ్వు గేలిచేస్తుంది
మట్టితో మమేకమై మరో చిగురుకు
ఆయువు పోస్తూ అది మరణిస్తుంది
మరణంలో కూడా జీవం వుందని తెలుసుకోమంటాను

సంద్రం అగాథాల మయమని
సునామీలు సృష్టిస్తుందని ఓ అనుభవం భయపెడుతుంది
జీవన సంద్రం ఈదిన వాళ్ళకు ఇదో లెక్కా
అంటూ తెడ్డువేసుకుని కడలిలోకి దూకేస్తాడొకడు
అగాథం లేనిది సంద్రం ఎందుకవుతుందని నేనంటాను

పురుగులై ఎంత చదివినా పుస్తకాలను
పుర్రెలోకి సారాన్ని కాస్తయినా తీసుకోగలిగితేనే కదా
పరుగుపందాలై పోతున్న ర్యాంకుల పోటీలో
గెలిచిన వాడు జీవితం లో గెలవాలని లేదుగా
చదవగలిగితేనే ప్రతి జీవితాన్నీ చదవమంటాను 8/5/2013

08/05/2013

వేసవి విసుర్లు



భగ భగ మండే  సూర్యుడిని వేడుకుందామా
కరుణించి కాస్తయినా చల్లబడుతాడేమో

మోహం చాటేసిన వరుణుడికి విన్నవించుకుందామా
కాస్తయినా చినుకుల పన్నీరు చిలకరిస్తాడేమో

కరెంట్ కోతలకు ఊపిరాడక ఉక్కపోస్తోంది
సమస్యలు పట్టని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా..

నమ్మి ఓటేసినందుకు నట్టేటిలో ముంచేస్తున్నారు
తిట్టుకుంటూ విసుర్ల విసన కర్రలు విసురుకుందామా

నడి నెత్తిన కాలినా అరికాలిలో మండినా
ప్రశ్నించాలన్నా తలంపే పుట్టుదు సర్దుకుపోవడమేనా

నిర్వహణలేక నియంత్రణ లేక వ్యవస్థలకు గ్రహణం
వనరులున్నా సమర్థత లేదని ఊరుకుందామా..

ఏమిటీ దుస్థితని అడిగబోయే గొంతులకు
సంక్షేమ పథకాల ప్రచారాలు వినిపిస్తున్నారు

ఏనాటికైనా మత్తులోంచి జనం మేలుకోకపోరు
ఆనాటికి గాని మారదు ఈ నాయకుల తీరు 4.5.13


తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి , పలమనేరు వారిచే ఉగాది ఉత్తమ కవితా అవార్డు మరియు సన్మానం అందుకుంటున్న కరణం లుగేంద్ర పిళ్ళై

చెణుకులు



రగలిన హృదయమేమిటి
రాజీగీతం పాడుతోంది
ప్యాక్షనిజం నివురు గప్పుకుంది...
***
మానభంగానికి
ఆడదయితే చాలనే ఘటనలు
విలువలకు విలువ లేకుండా పోయింది
***
టి.వి రిమోట్ కోసం
ఆత్మహత్యచేసుకుంటున్నయువత
బతకడమంటే తెలియకుండా పోయింది
***
అవినీతికి పచ్చజెండా
ఓటరే ఊపేస్తుంటే మిగిలేదేమిటి
ఎన్నికలంటే సంతలా మారిపోయింది.
***
సారం లేని కూర ఎంతైతే నేమి
బ్లాక్ బస్టర్లు తెగ దీసేస్తున్నారట
డామిట్ సినిమాల కథ అడ్డం తిరుగుతోంది..  30.4.2013

మరీచకలు



కటిక చీకటిలోనూ
వెన్నెల  వాన కురుస్తోంది
ఆమె నవ్వింది కాబోలు..
***
కొండ పెరిగిపోతూ వుంది
ఎంత ఎత్తని ఎక్కగలం
కోరికలు ఎవరెస్టులయితే..
***
నీకు నాకు మధ్య
పచ్చని నోటు నిలుచోంది
స్నేహం అంటే వ్యాపారమే
***
ఎదురు చూసి చూసి
కళ్ళకు కాయలు కాశాయి
అప్పుకోసం కోటి తిప్పలు
***
గుడ్డి కన్ను
మూస్తే ఎంత  తీస్తే ఎంత
కరెంటు లేని రాత్రిలో
***
మండు టెండలో
మరీచకలు
స్వేదం అమ్ముడుబోతోంది  29.4.13

ఒకే గదిలో వేళ్ళ మైళ్ళ దూరం



మన ఇద్దరి మధ్య
మౌనం పెను అగాధం పెరుగుతూ
మాటల వంతెన కడుదామనుకొని
పలకరించబోతే నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తూన్నావు

మన ఇద్దరి మధ్య
అహం పొరలు కమ్మి ఎత్తిపొడుపుల యుధ్దం
ఎందుకులే తగ్గిపోదామనుకుని సారీ అంటే
రాజీకొచ్చావా సిగ్గులేదా అంటూ ఎగతాలి చేస్తున్నావు..

మన ఇద్దరి మధ్య
ఒకే గదిలోనే వేల మైళ్ళ దూరం
గత జ్ఞాపకాలనైనా నెమరేసుకుందామంటే
చీత్కారాలతో గుండెలో చితిమంటలు రగిలిస్తున్నావు

మన ఇద్దరి మధ్య
పచ్చని దాంపత్యం చిద్రమవుతుంటే
మన కలలకు మనమే కాలరాయడమెందుకనంటే
ఏం నేను లేకుండా బతకలేవా అని ఎద్దేవా చేస్తున్నావు

మనం ఇద్దరి మధ్య
చిగురించిన చిన్నారుల భవిష్యతేంటి
నీకు నచ్చేలా నేను మారుతాను
పొరలు తొలగించి నీకళ్ళతో చూడవా ప్రియా
నీకోసమే బతికే నేను కనిపిస్తాను




చెప్పుడు మాటలు వదలిపెట్టి రావా..
అపార్థాల అడ్డుగోడలు కూలదోసి
అనురాగాల జీవితాన్ని పండించుకుందాం
అనుబంధాల బంధాల్ని బతికించుకుందాం 25.4.13

నేటి నేతల భారతం



లేలేత మొగ్గలపై ఆఘాయిత్యాలు
నిత్యం పతాక శీర్షికల్లో  తిష్టవేస్తాయి
ప్రెస్ మీట్ లకే పరిమితమవుతూ
ఖండిస్తున్నపేపర్ పులులు

ఆకలి ప్రేగుల ఆర్తనాదాలు వినబడదు
బడుగు జీవుల భాధలు కనబడదు
సభలలో మైకు ముందు మాత్రం
నీతులు వల్లే వేస్తారు.. ప్రశ్నలై పోరాటాలు చేస్తారు..

జనం ఐక్యంగా వుంటే చూడలేరు
కులం పేరుతోనో ,మతం పేరుతో నో
వారి మధ్య సరిహద్దు రేఖలు గీస్తారు
వర్గాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి
నిప్పుల కంచెలు వేస్తారు.
అన్నీ ఉత్తిత్తివే
ఆర్బాటాల, ప్రగల్బాల వీరంగం చేసి
చీకటి ఒప్పందాలకు లాలూచీ పడి
మౌనంగా నో కామెంట్ అంటూ వుండిపోతారు

నిఖార్సయిన వాడెవడూ లేడు
దోచుకోవడం ,దాచుకోవడం నేటి విదూరనీతి కదా

నేతిబీరకాయలోని నేతి చందమై
ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్యం
ఓటుకు ఇంత సీటుకు ఇంత అని
మార్కెట్లో అమ్ముడవుతున్న దృశ్యం
అయినా ఎవడూ ప్రశ్నించడు
గాంధీ చెప్పిన మూడు కోతుల
సూక్తులు నేర్చుకున్నారేమో
ఇకనైనా మేలుకోవాలి నవ యువ భారతం
లేకుంటే బలవుతోంది భావి భారతం   19.4.13

సఖీ



మనసు కిటికీ రెక్కలు
మూసే లోపు
జమ్మంటూ
నీ ఆలోచనల సుడిగాలి ...
కలల బతికీడుస్తూ
ఇలా ఎన్నాళ్ళు ప్రియా..
ఒంటరితనం నింపిన
నిటూర్పుల ఖాళీని
నవ్వుల నయాగారాలతో
నింపవా సఖీ..  19.4.13

ద్విముఖి



తెల్లని కాగితంపై
అద్దిన మరకల్లా
నీవు ఇచ్చిన హామీలు
ఇంకా ఇంకిపోలేదు..
అన్నీ ఉచితమేనా
అనుచితం కాకపోతే
అన్నీంటికీ రాయితీలేనా
అది మనది కాకపోతే

ఒకరి స్వేదం ఇంకోకరికి
పన్నీరవుతున్న వేళ
శ్రమ సంస్కృతికి
చరమగీతం పాడుతున్నావా

పాడు పథకాలు వెలుగిపోతుంటే
పాడికడుతున్నావని తెలుసుకోలేకపోయాం
ఎముకలేని చేయని అంటుంటే
ఏమార్చుతున్నావని గ్రహించలేకపోయాం


ఓట్లకోసం ఎరవేసే నక్క జిత్తులు నీవి
తెరవెనుకు తంతంగాలు నడిపే కుటిల నీతి నీది
ధవళ వస్త్రాల మాటున దోపిడి కప్పేశావు
నవ్వులు మోముతోనే నట్టింట ముంచేశావు  18.4.13

01/03/2013

చూడాలని ఉంది..


ఏలోహమైనా
వేడి చేస్తే లొంగిపోవచ్చు
కాని దేనికి లొంగని
వజ్రం లాంటి మనిషిని
చూడాలని ఉంది

ఏ వస్తువుకైనా
తుప్పో,,చెదలో పట్టవచ్చు
కాని ఏ చెదలు పట్టని
ఏ మురికీ అంటని
స్వచ్చమైన మనిషిని
చూడాలని ఉంది

మర్మం లేని మనిషి
మచ్చలేని మనిషిని
నిప్పులలో కాల్చినా
నీరు కారని వాడిని
చూడాలని ఉంది

హిమాలయాలంత
ఏతైన వ్యక్తిత్వం
ఆకాశమంత
అరుదైన నిర్మలత్వం
చిరునామాగా ఉండే
చీకటి సమాజాన
ఉదయించే సూర్యుడిని
చూడాలని ఉంది

మతానికో కులానికో
కొమ్ముకాసే కుచ్చీలుడెందుకు
ప్రాంతానికో, వర్గానికో
విడిపోయి
ఏదో వాదానికి తలొగ్గేవాడెందుకు
విశ్వజనీయుడైన మనిషిని
చూడాలని ఉంది

విధ్వంసాలను అంతం చేసి
విశ్వశాంతి గీతం పాడే వాడు
విధిని ఎదురు నిలిచి
జాతిని మేల్కొలిపే వాడిని
చూడాలని ఉంది.. 28.2.13

బ్లేమింగ్ గేమ్ నౌ స్టార్టెడ్


ఎదుటివారిని చూపి
తాము తప్పించుకోవాలని
ఎంత తపన......
నేలవిడిచి సాము చేసే మొనగాళ్ళ
బ్లేమింగ్ గేమ్ నౌ స్టార్టెడ్

మైకు కనిపిస్తే చాలు మైకం కమ్మేస్తాది
మాటను తూటాగా వదిలితేనే కదా గొప్పోల్లు
దగాకోరు పరామర్శలెందుకు...
దిద్దుకోని తప్పులు సరిదిద్దుకోరెందుకు
తిలాపాపం తలా పిడికెడు
చూపుడు వేలు చూపెట్టినా
నాలుగువేళ్ళు నీకేసే ఉన్నాయన్నది నిజం
     అయినా ఆత్మ పరిశీలన జరగదేం....
      శవాలపై చిల్లలేరుకోవాలనే బాపతు

   గులాబీలు పూయవలసిన చోట
  గంజాయి మొక్కల్ని పెంచేస్తున్నారు
  మానవత విరబూయవలసిన చోట
  ముష్కరుల రాచబాట వేస్తున్నారు
  నిర్లక్ష్యం రాజ్యం ఏలుతుంటే అంతేమరి
  నిఘాకన్నులు గుడ్డివయితే
  నీడకూడా కాటేస్తుంది..
  నిండామునిగాం కదా నిదురపోవడం కాదు
  అడుగడుగూ వల్లకాడుగా  
  మారకమునుపే 
   మేల్కోని భవిష్యత్తును చూడండి   

చావు కబురు



కంటి రెప్పల చూరు క్రింద
వేలాడుతున్న జ్ఞాపకాలను
ఎలా తుడిచేయగలం
గోకుల్ చాటో, లుంబినినో
మక్కా మసీదో
రక్తం పారిన యేరుల జాడ
ఇంకా తడారలేదు
నగరం నెత్తురోడ్డుతోంది
భాగ్యనగరం కాదిది
భాధల నగరం
ఏ అపరాత్రో అర్థరాత్రో
చావు కబురు చల్లగా వస్తుంది
స్క్రోలింగులనిండా అదే
రక్తపు మరకలతో
మాంసపు ముద్దలుగా
మానవత్వం

ఏ పగ ఉందో ఏమో
ముష్కరుల పంజాకు
అభం శుభం ఎరుగని
వారు బలవుతుంటే
మనం సాధించింది
శూన్యమనిపిస్తోంది
రండి శాంతి కాముకుల్లారా
నిరసిద్దాం
నినదిద్దాం
గొంతులు సవరించుకొని
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుదాం
భారతావనిపై శాంతిని పరిరిక్షించుదాం..    22.2.13


అక్షరాలు మొక్కుతుంటే...


నిదురపట్టని రాతిరి
ఆలోచనల సుడిగాలి చుట్టేసి
వ్రాస్తావా.. చస్తావా అంటే ఏంచెప్పను
ఏదో ఒకటి వ్రాసేస్తాను..
నీవేం వ్రాస్తున్నావంటే
ఏం చెప్పను మిత్రమా..

గుండెలో ఉప్పోంగే భావాల లావాలను
అక్షరబద్దం చేస్తున్నానని చెప్పాలనుకుంటే
ప్రతి అక్షరం సమాజ హితం కోరే
బీజమై మొలకెత్తుతోంది
వాడిన జనారణ్యంలో
ఆకుపచ్చని వసంతాలు విరబూస్తోంది

నాకే తెలియని నిబిడాశ్చర్యంతో
అక్షరాలను కళ్ళకు అద్దుకున్నా
భావాలు వ్యక్తపరచలేని
ఎన్నో ఆత్మల ఘోష వినిపిస్తోంది.
పీడిత తాడిత జన సమూహపు
ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి..

అక్షరాల కాళ్ళకు మొక్కుతుంటే
మరింత సంబ్రమాశ్చర్యం
చీకటి మనోకుటీరాలలోకి
ఆశయ సూర్యుడి ఉదయం కనిపిస్తోంది
వడలిపోయిన శరీరం
కాంతిపుంజమై లేచి నిలబడుతోంది.

 నన్ను నేను మదించుకొని
నాలో నేను సిరాగా మారి పోయి
కలం  వెంట అక్షరాలుగా రాలుతుంటే
ఆవిష్కృతమైమయ్యే తృప్తి ముందు
కన్న తల్లి కూడా తక్కువేనని చెప్పనా..
ఈ జనకు ఇంతకంటే సార్థకత లేదని చాటనా... 4.2.13