EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

17/07/2012

సెర్చింగ్ మై సెల్ప్

క్కడో నన్ను కోల్పోయిన ఫీలింగ్
గడ్డివామును దహిస్తున్న నిప్పులా
ఒత్తిడి వళ్ళంతా ఆక్రమించి బిపి భూతమై పోయింది
హాయిగా నవ్వడమే మరచి
పెదాల బిగువున పలకరింపును అదిమి
సూటుబూట్లలో కుక్కుకున్న సహజత్వం వాడిపోయింది.
మా పల్లెతో కరచాలనం చేసి ఎన్నాళ్లయిందో
అరటి ఆకులో బంతి భోజనం తిని ఎన్ని ఏళ్ళయిందో
ఎంత వెతుకున్నా దొరకని అస్థిత్వపు నీడలు
కదలిన పునాదులను కుదురుగా పెట్టుకోలేని
బతుకంటే విరబూసిన మల్లే కాదని
విచ్చుకత్తి నడినెత్తినవేలాడుతోంది..
గుండెలనిండా ఆత్మవిశ్వాసపు ఊపిరి తీసుకోలేని అశక్తత
మానవత, ఆత్మీయత రంగరించి మాట్లాడలేని యాంత్రికత
ఆవాహన చేసుకున్న కరెన్సీ నోట్ల బెడ్ పై
కట్లపాములా పోర్లాడుతూ
కనురెప్పలు వేయలేని నిస్సహాయత
ఇది కఠోర నిజం అయినా ఒప్పుకోలేని అహంకారం
ఇంకా ఎక్కడని వెతకను ఏమని చెప్పను
కోల్పోయిన నన్ను వెతికి పట్టాలంటే
వెనక్కు నడవాలసిందే
మా పల్లెటూరి బస్సు ఎక్కవలసిందే..

10/07/2012

పరుగో పరుగు



మౌనం పలికిన గానం
నాకు మాత్రమే 
వినబడుతూ..

గాయం చేసిన రూపం
నాకు మాత్రమే
కనబడుతూ

దగ్గరకు చేరేంతలో
అదృశ్యమయ్యే ఆశలు
దగ్దమయ్యే హృదయానికి
నిటూర్పుల సెగలు..

వెలితి తీరుతుందని
వెతికి వెతికి అలసిపోయా
వేడుక అవుతుందని 
వెంట పడి ఓడిపోయా

ఒక్క గెలుపు కోసం
అలుపెరుగని పోరు
బతుకో పరుగు పందెం
ఆపితే అదో రణ రంగం..

పెళ్ళి పుస్తకం



నాదో ప్రపంచం
నీదో ప్రపంచం
ఇద్దరిని కలిపిన
సన్నని బంధమే పెళ్లి..

నాదో వైకుంఠం
నీదో కైలాసం
ఇద్దరిని కలిపి నడిపినదే
ఏడుఅడుగుల అనుబంధం..

నిత్యం పోట్లాట
ఆధిపత్యపు కాట్లాట
రాత్రి అయితే చాలు
రాజీ పడుతుంది సయోధ్య..

09/07/2012

నాకు ఇంకేమి కావాలి

 
 
పిల్లగాలి తెమ్మరగా
ఇలా వచ్చి అలా వెళ్ళావు...

ప్రియతమా చూడు
నీవు తెచ్చిన స్నేహ సుగంధం
ఇంకా పరిమళిస్తూనే ఉంది
సంతోషం రెక్కలు మొలిచి
ఊహల్లో విహరిస్తూ ఉంటే
నాకు దూరమై
నింగిని తాకిన కలల చుక్కలను
నేలకు రాల్చి తగులబెట్టావు..

అయినా నీ ధ్యాస
నాలో పెరుగుతూనే ఉంది
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు

మరణభయం లేదు..



ఆకులన్నీ రాలిపోయి
మోడుగా నిలిచిన క్షణం
నిస్సారమైన జీవితాన్నీ
జ్ఞాపకాలతో నింపుకుంటుంటాను
పచ్చని ఆకులు పూసిన దృశ్యాలు
పువ్వులు పరిమళించిన సువాసనలు
నెమరువేసుకుంటాను..
నాకు రాలే ఆకులు ముఖ్యం కాదు
చిగుర్లు వేసే చిగుర్ల కబుర్లు ముఖ్యం
అంతా కన్నా నా మూలాల వేర్లు ముఖ్యం
నన్ను నేను పాతాళంలోకి దింపుకుని
నింగికి ఎదిగేందుకు పడ్డ శ్రమను
చెమటబిందువులతో సహా గుర్తుకు పెట్టుకుంటాను..
ఇప్పుడు భాధపడనవసరం లేదు
ఇప్పటి స్థితికి నేనే కదా భాధ్యున్ని
నేటి ఈ స్థాయికి నేనే కదా భాధితుడిని
వాలిన పక్షులు ఎగిరి వెళ్ళిపోయిన చప్పుడు
రాలిన కాయలు క్రింద పడ్డ చప్పుడు
ఏది ఏమైనా నేను స్పందించడం మరిచాను
ఎందుకంటే నాకు చిగురించడమే కాని
మరణించడం తెలియదు
మరణభయం లేనివాడికి
బతుకు ఎలా ఉన్నా ఒకటే
తోడు ఎవరు లేకపోయినా ఒకటే