EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

01/03/2013

చూడాలని ఉంది..


ఏలోహమైనా
వేడి చేస్తే లొంగిపోవచ్చు
కాని దేనికి లొంగని
వజ్రం లాంటి మనిషిని
చూడాలని ఉంది

ఏ వస్తువుకైనా
తుప్పో,,చెదలో పట్టవచ్చు
కాని ఏ చెదలు పట్టని
ఏ మురికీ అంటని
స్వచ్చమైన మనిషిని
చూడాలని ఉంది

మర్మం లేని మనిషి
మచ్చలేని మనిషిని
నిప్పులలో కాల్చినా
నీరు కారని వాడిని
చూడాలని ఉంది

హిమాలయాలంత
ఏతైన వ్యక్తిత్వం
ఆకాశమంత
అరుదైన నిర్మలత్వం
చిరునామాగా ఉండే
చీకటి సమాజాన
ఉదయించే సూర్యుడిని
చూడాలని ఉంది

మతానికో కులానికో
కొమ్ముకాసే కుచ్చీలుడెందుకు
ప్రాంతానికో, వర్గానికో
విడిపోయి
ఏదో వాదానికి తలొగ్గేవాడెందుకు
విశ్వజనీయుడైన మనిషిని
చూడాలని ఉంది

విధ్వంసాలను అంతం చేసి
విశ్వశాంతి గీతం పాడే వాడు
విధిని ఎదురు నిలిచి
జాతిని మేల్కొలిపే వాడిని
చూడాలని ఉంది.. 28.2.13

బ్లేమింగ్ గేమ్ నౌ స్టార్టెడ్


ఎదుటివారిని చూపి
తాము తప్పించుకోవాలని
ఎంత తపన......
నేలవిడిచి సాము చేసే మొనగాళ్ళ
బ్లేమింగ్ గేమ్ నౌ స్టార్టెడ్

మైకు కనిపిస్తే చాలు మైకం కమ్మేస్తాది
మాటను తూటాగా వదిలితేనే కదా గొప్పోల్లు
దగాకోరు పరామర్శలెందుకు...
దిద్దుకోని తప్పులు సరిదిద్దుకోరెందుకు
తిలాపాపం తలా పిడికెడు
చూపుడు వేలు చూపెట్టినా
నాలుగువేళ్ళు నీకేసే ఉన్నాయన్నది నిజం
     అయినా ఆత్మ పరిశీలన జరగదేం....
      శవాలపై చిల్లలేరుకోవాలనే బాపతు

   గులాబీలు పూయవలసిన చోట
  గంజాయి మొక్కల్ని పెంచేస్తున్నారు
  మానవత విరబూయవలసిన చోట
  ముష్కరుల రాచబాట వేస్తున్నారు
  నిర్లక్ష్యం రాజ్యం ఏలుతుంటే అంతేమరి
  నిఘాకన్నులు గుడ్డివయితే
  నీడకూడా కాటేస్తుంది..
  నిండామునిగాం కదా నిదురపోవడం కాదు
  అడుగడుగూ వల్లకాడుగా  
  మారకమునుపే 
   మేల్కోని భవిష్యత్తును చూడండి   

చావు కబురు



కంటి రెప్పల చూరు క్రింద
వేలాడుతున్న జ్ఞాపకాలను
ఎలా తుడిచేయగలం
గోకుల్ చాటో, లుంబినినో
మక్కా మసీదో
రక్తం పారిన యేరుల జాడ
ఇంకా తడారలేదు
నగరం నెత్తురోడ్డుతోంది
భాగ్యనగరం కాదిది
భాధల నగరం
ఏ అపరాత్రో అర్థరాత్రో
చావు కబురు చల్లగా వస్తుంది
స్క్రోలింగులనిండా అదే
రక్తపు మరకలతో
మాంసపు ముద్దలుగా
మానవత్వం

ఏ పగ ఉందో ఏమో
ముష్కరుల పంజాకు
అభం శుభం ఎరుగని
వారు బలవుతుంటే
మనం సాధించింది
శూన్యమనిపిస్తోంది
రండి శాంతి కాముకుల్లారా
నిరసిద్దాం
నినదిద్దాం
గొంతులు సవరించుకొని
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుదాం
భారతావనిపై శాంతిని పరిరిక్షించుదాం..    22.2.13


అక్షరాలు మొక్కుతుంటే...


నిదురపట్టని రాతిరి
ఆలోచనల సుడిగాలి చుట్టేసి
వ్రాస్తావా.. చస్తావా అంటే ఏంచెప్పను
ఏదో ఒకటి వ్రాసేస్తాను..
నీవేం వ్రాస్తున్నావంటే
ఏం చెప్పను మిత్రమా..

గుండెలో ఉప్పోంగే భావాల లావాలను
అక్షరబద్దం చేస్తున్నానని చెప్పాలనుకుంటే
ప్రతి అక్షరం సమాజ హితం కోరే
బీజమై మొలకెత్తుతోంది
వాడిన జనారణ్యంలో
ఆకుపచ్చని వసంతాలు విరబూస్తోంది

నాకే తెలియని నిబిడాశ్చర్యంతో
అక్షరాలను కళ్ళకు అద్దుకున్నా
భావాలు వ్యక్తపరచలేని
ఎన్నో ఆత్మల ఘోష వినిపిస్తోంది.
పీడిత తాడిత జన సమూహపు
ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి..

అక్షరాల కాళ్ళకు మొక్కుతుంటే
మరింత సంబ్రమాశ్చర్యం
చీకటి మనోకుటీరాలలోకి
ఆశయ సూర్యుడి ఉదయం కనిపిస్తోంది
వడలిపోయిన శరీరం
కాంతిపుంజమై లేచి నిలబడుతోంది.

 నన్ను నేను మదించుకొని
నాలో నేను సిరాగా మారి పోయి
కలం  వెంట అక్షరాలుగా రాలుతుంటే
ఆవిష్కృతమైమయ్యే తృప్తి ముందు
కన్న తల్లి కూడా తక్కువేనని చెప్పనా..
ఈ జనకు ఇంతకంటే సార్థకత లేదని చాటనా... 4.2.13