EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

30/03/2012

మూగ ప్రేమ













                                 
                         దివి నుండి దిగిన దేవతలా
                        ఎదురుగా ఆమె
చూసి చానాళ్ళే అయింది

కనీసం పలకరించాలని
ఎన్నివత్సరాలు వేచిఉన్నానో..
కాని గొంతు విప్పలేకున్నాను..

మనసులో మాట మూగబోయింది..
పలకరించబోయేంతలో
ఎవరు మీరు అన్న ప్రశ్నతో
గుండె వేల ముక్కలయింది

జ్ఞాపకాల కుట్లు వేసుకొని
జీవితాన్ని రీవెండ్ చేసుకుంటే
కళ్ల ముందుకు గతం ఆవిష్కృతమయింది

కాలేజీలు బంక్ కొట్టి కాపుకాసి
రోజా పువ్వై రోజూ ఆ సిగన చేరిన క్షణాలు
ఆమె నవ్వుల పలకరింపుకోసమే కదా
నీడలా తోడుగా వెంట నడిచిన వైనాలు
అబ్బో రోమియోను మించిపోయానేమో
నాడు
మనసులోనే ప్రేమించి చెప్పలేక పోయా
నేడు
నా మనిషి కాకుండా పోయిందని
మనసు విప్పలేకపోయా..

ఇంతలో ఎవరో పలకరించారు
మీరెక్కడికి పోవాలని
కాటికని చెప్పలేకపోయా.......
సూర్యుడిని అనుసరిస్తూ.....
 







దారితప్పిన ధైర్యాన్ని
వెతికిపట్టేందుకు
రాత్రంతా జాగారం చేస్తోంది
జ్ఞాపకాల వర్షంలో
... మస్తిష్కం తడుస్తూనే ఉంది
దారి తెలియని చీకటిలోనూ
వెన్నల పువ్వులు పూస్తున్నట్టు కలలే కలలు..
ఇంతలోనే తెల్లవారినట్టు
వాహనాల రొదలు
నిన్న పడమట ఆస్తమించి
తూర్పు వాకిలిలో పుట్టిన సూర్యుడు
అనుసరిస్తూ నేను..

27/03/2012

మూడోకాలు




బిడ్డలు రెక్కలు వచ్చి వెళ్ళినా..
వయస్సు గుర్తుచేయడానికనేమో..
వచ్చి చేరింది మూడోకాలు...
ఆత్మవిశ్వాసం రూపంలో

బతుకు చెట్టు నుండి
ఆశల ఆకుల్ని
శిశిరం రాల్చేస్తోంది
కాని కాస్త సహనంతో ఉంటే
వసంతం  పచ్చని చిగురును వేయిస్తుంది

ఒంటరిగా మిగిలిన ఏకాకికి
ఏదారైనా రహదారే
తలవంచని పనులు చేస్తున్నప్పుడు
తలెత్తుకు బతికే తోడవుతుంది...

గుండె ఆకాశాన్ని
దిగులు మేఘం  కమ్మేస్తుంది
అప్పుడప్పుడూ...
తోడుగా నడిచే నీడ చాలదా
కాటిదాకా కబుర్లు చెప్పడానికి
ఎల్లప్పుడూ...

24/03/2012

తొలకరి కోసం..


తొలకరి కోసం..


తడి అరని
ఉరికొయ్యలు
రక్తం స్రవిస్తూనే..

తడి నిండిన
కంటి కొలనులు
ఇంకా  ద్రవిస్తూనే..

వేకువను ఒడిలో
పెట్టుకుని కాపాడే
పల్లె తల్లులెందరో...


తుపాకి గుళ్లకు
నేల రాలుతున్న
వీరులు ఎందరో..

తొలగని
మబ్బుల మసకలు
కమ్మేస్తున్నా..
నిరాశను తరిమేస్తున్నా..


తొలకరి పడుతుందని
నేలతల్లిలా
నింగిపైవు చూస్తూ
ఆశ పడుతున్నా..

22/03/2012

అమ్మకానికి పేదరికం ...!!!



దేశం ప్రగతి పథంలో నడుస్తోంది
పాలపొంగులా ఏ ఏటికాఏడు పైకి ఎగబాకే
మన ఆర్థికాభివృద్ధి రేటు అబ్బో ఎంత మెరుగో
వార్చి వడ్డించిన విస్తరిలో అంతా మాయ..
లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు......

నోటిలోకి నాలుగు వేళ్లు వెళ్ళకున్నా..
అకలి ప్రేగులు మెలిపెడుతున్నా..
అవి కావట ప్రభువులకు ప్రామాణికాలు...
పేదరికాన్ని కొలిచే కొలమాన రాళ్లు కూడా
దిగుమతి చేసుకునే నేతలకు ముందు చూపెందుకు ఉంటుంది
పనికట్టుకొని చూసే వాళ్ళకు అంతర్జాలం కనికట్టు
చూస్తుంటే అంతా పచ్చగానే ఉంటుంది మరి
కాస్త కళ్ళను నేలపైకి దింపి చూస్తేకదా..

బడ్డెట్ భూతం భూతద్దంలో బోల్డ్ లెటర్ లో సంక్షేమ పద్దులు
వార్త పత్రికల పతాక శీర్షికల కెక్కి కాగితాలలోనే ఇంకిపోతూ............
కారిచ్చులా వాడవాడలా వ్యాపించిన పన్నుల ప్రచారం
ఆకాశం ఎత్తుకు రోదసిలోకి నిత్యవసరాలు ఎగిరిపోతూ.........

ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టి
కిలో రూపాయికి బియ్యం ఇస్తేనేం..
ఆకలి తీరుతోందా .....
ప్లాష్ న్యూస్ స్క్రోలింగ్ర్ లో ఇప్పుడే అందిన వార్తంటూ
మద్యం సిండికేట్లకూ తెల్ల రేషన్ కార్డులు....

ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి
ఆరోగ్య శ్రీ ఉచితంగా అందిస్తేనేం
రోగాలు తగ్గితున్నాయా...
అందమైన భవంతులలో దొంగ ఆపరేషన్ల కోతలు..
ఖజానా కు చిల్లులు పెట్టే బిల్లుల తడిచి మోతలు
కట్ చేస్తే .. కాటికి పడకేసిన  ప్రభుత్వ దవాఖానాలు...

ఇదే కదా
ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడూ ఉండే తంతు
తెల్లబోవడం మాత్రం పేదవారి మనవంతు

పిండం ఫలధీకరణకోసం
అద్దెకు గర్భసంచిని ఓ తల్లి బేరానికి పెడుతోంది
పని వెతుక్కుంటూ చలి చీమల గుంపులై
రోడ్డుపై కూలీలు బారులు తీరుతున్నారు..
గొప్పలు చెప్పి గుప్పిట్లో బంధించిన
విష సంస్కృతికి విసిరిన పాచికకు
విలువలు ఉరేసుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి
ప్రపంచీకరణ అందించిన విజ్ఞానపు వీచికకు
శ్మశానంలో ప్రేగు బంధాలు కాలుతూ కమురు వాసన వేస్తున్నాయు

బతుకు బండిని నడిపే ధనం అనే ఇంధనం కోసం
వలసలతో  పట్టణాలవైపు పరుగులు తీస్తున్న జనం
పైటలు పరచే వృత్తికోసం విహంగాలై ఎగురుతన్నవనితల గుంపు
మనిషి తాను కూర్చోన్న కొమ్మనే తానే నరుకున్నట్టు
బంధాలన్నీనూలుపోగుల్లా తెగుతున్న చప్పుడు ..
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం..
ఏ కుప్పతొట్టి వెతికినా దొరికే ఆడశిశువులు
కుక్కలు నోట కరుచుకుపోతుంటాయి..
ఏ వీధి మలుపు తిరిగినా చిల్లర కోసం
దేబురిస్తున్న అనాథ జీవచ్ఛవాలు మురికి వాసన వేస్తుంటాయి
బస్టాండు, రైల్వే స్టేషన్ పేవ్ మెంట్ పై పేదరికం నిదురిస్తున్న దృశ్యాలు
విశ్వ విపణిలో అన్నింటికిధర పలుకుతోంది..
అమ్మడానికి సిద్ధమవుడమే తరువాయి
పేదవాడినో ఆటబొమ్మ చేసి  ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్టే
లేకుంటే వెన్నులపై వీపు విమానమోత మోగించే ఈ పన్నుల భారమేంటి
అయినా మన దారేదో మనది...
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం

మానవతకు చీడపట్టించిన సంస్కరణల పర్వంలో
పేద, ధనికుల మధ్య అంతరం పెరుగుతోంది
లేని వాడిని కొట్టి ఉన్న వాడికి రాయితీలు ఇస్తున్నఈ వక్రనీతిలో
పేదవాడిని బలిపశువు చేస్తున్న ఈ ఆర్థిక జాతరలో
ధరలు పెంచడం అంటే గాయంపై కారం పూసి బతుకును వేలం వేయడమే
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం..
ఈ ఉగాది రోజయినా దేశం ప్రగతి పథంలో నడుస్తోంది భ్రమిద్దాం.

-కరణం లుగేంద్ర పిళ్ళై

20/03/2012

తెలిసిందిలే.......


మూసిఉన్న గుప్పిట విప్పాను...
మనసు తేలికపడింది
కలల రెక్కలు విప్పుకుని
రంగు రంగుల
సీతాకోక చిలుకగా
ఎగురుతున్న సంతోషం...

నాలోకి నేనే ప్రయాణించాను..
నేనేంటో తెలిసింది
నిర్వేదపు మేఘాలు తప్పుకుని
చల్లని వెన్నల జలపాతం
జీవితాన కురుస్తున్న చప్పుడు..

పుష్పించే పూలను అడిగాను
పరిమళాన్ని చూపమని
అప్పుడే నాలో వికసిస్తున్న
వ్యక్తిత్వాన్ని చూపుతూ
నా అరచేతిలోకి వాలిపోయింది
మానవత్వం పరిమళిస్తున్నవాసన....

నియంతా.... నేలరాలుతావురా...........


తడిగుడ్డతో గొంతుకోసే
కసాయతనం నీకు వంటబట్టినప్పడు
మా వేదన నీకు ఎలా అర్థం అవుతుంది
మెత్తని మాయ మాటలతోనే
గుండెలో కత్తులు దింపే కళలో నిష్ణాతుడవయ్యాక
మా రోదన కూడా నీకు వెస్ట్రన్ మ్యూజిక్ అవుతుంటే
మనిషితోలు కప్పుకున్న రాక్షసుడిగా మారాక
నీకు ఎన్ని నీతి వచనాలు చెప్పినా చాలవు
నీ అహంకారానికి మా సహనం సలాం అన్నంతవరకే
నీ అధికారానికి బానిసలమై మేము గులాం అన్నంతవరకే
ఒక్కసారి తిరగబడితే నీవు తట్టుకోలేవు
ఆ ఆలోచనే నీకు నిదురలేని రాత్రులను బహుమతిగా ఇస్తుంది.
ఇక మేము మేల్కోంటే నీవు ఏమవుతావురా
మట్టిలో మట్టిగా కలసిపోవడం తప్ప

అమ్మా నీ తలపు..


జోలపాటలో జానపదమా
లాలిపాటలో లాలిత్యమా
అమ్మా ...నీ పాటలోనే
పరవళ్లు త్రొక్కును
మమతల సంగీతమాలికలు

మధురిమలు నీ గోరు ముద్దలు
నేటికి ఇరిగిపోలేదు ఆ రుచులు
నీ తలపురాగానే చెమ్మగిల్లే కళ్ళకు
ఎవరు కట్టగలరు ఈ భువిలో ఆనకట్టలు

ఎవరైనా ఆర్చేది
తృణమో ప్రణమో ఇచ్చుకుంటేనే.
దేవుడయినా తీర్చేది
ఏదైనా మొక్కుకుంటేనే .
ఎవరెస్టు ఎత్తుకు ఎదిగినా సరే
ఏమి ఇచ్చినా తీరని నీ రుణం ముందు
మేము మరుగుజ్జులయి పోయేది..


అవినీతి


చిన్నగానే కనిపిస్తోంది
ఏముందిలే అని వదిలేస్తే
రాచపుండై పాకేస్తోంది
పిప్పిపల్లు నోటిలో ఉంటే
మంచి పల్లును పాడుచేస్తుంది
కలుపు మొక్కలో చేలులో ఉంటే
ఎదిగే మొక్కలను చంపేస్తుంది..
ఇది అలాగే...
ఏరి పారేది ఎవరు..
వారు చేస్తారని వీరు
వీరు చేస్తారని వారు
ఎవరూ అతీతులు కారు
ఎవరూ పూనుకునే వారు లేరు
ప్రభుత్వం అందామా
అజారే పిలుపుకు నడుం బిగించినా
గొంతుల నొక్కి ఊపిరాడక చేస్తున్నారు
కసబ్ లను మాత్రం రాచమర్యాదలు ఇస్తున్నారు..
సగటు భారతీయుడా
ప్రశ్నలమై మేలుకుందామా లేకుంటే
దేశాన్ని అంధకారంలోనే వదిలేద్దామా..

ఎంతకాలం ??


 
మాటల్లో వర్ణించలేని తృణీకరణ భావాల్ని
మాపై శరాలుగా ఎక్కుపెడుతుంటే
మౌనంగా భరించడం నేర్చుకున్నాం

జాతులు , వర్ణాల అంతరాల దూరాల్ని
మా బతుకుల్ని విపత్తులై ముంచేస్తుంటే
జడపదార్థమై ఉండండం నేర్చుకున్నాం

అయినా ఎద సంద్రంలో ఎగిసిపడే
అలల కెరటాలను అదిమి పట్టడం
ఎంత కాలమనీ వీలవుతుంది

కాలప్రవాహంలో
ప్రతిదీ పరిణామక్రమంలో మారుతున్నట్టే
మా బతుకులెందుకు మారవు
మాలో నేను కుంచిచుకుపోతున్నాము
యుగయుగాలుగా...
మాలో మేము దహించుకుపోతున్నాము
పగలు సెగలుగా..


సానుభూతి కోరుకుంటూ
ఇనుపపాదాల క్రింది నలిగిన
జీవితాల కథల్ని చెబితే ఎవరు వింటారు

ఇప్పుడు భరించడమూ కాదు
ప్రశ్నించడం నేర్చుకుంటున్నాం..
కలల మొగ్గలకు వాడకుండా
కత్తులు కాపాలాగా తగిలిస్తున్నాం
అణగారిన ఆశలవనంలో
ఎవరెస్టు శిఖరాలకు చేరే
మేధావులకు పురుడు పోస్తున్నాం

స్నేహామా .. నీ వెక్కడ


భుజాలు రాసుకుంటూనే నిప్పులు రాజేయడం
కరచాలనాలై కలుస్తూనే కాలనాగులై కాటువేయడం...
ఇప్పుడు అన్నింటినీ స్నేహాలే అంటున్నాం

నీ స్నేహితుడి ఎవరో చెబితే
నీవెలాంటివాడివో చెబుతాయనేది
పాతరోజుల మాటయి పోయింది
అవసరార్థమోఅసంకల్పితమో...
మనం స్నేహాలు చేస్తూనే పోతుంటాం

కొన్ని హయ్ అనే పలకరింపుకే పరిమితం
కొన్ని ఛాయ్ భేటింగులకే పరిమితం
ముక్కుమొహం తెలియకపోయినా
సోదికబుర్ల ఛాటింగ్ కే మరికొన్ని..
ఎదుటి వాడు ఎలాంటి వాడయినా
పనికావడం కోసమే చేసే చెలిమిలు ఇంకొన్ని

ప్రతి బంధమూ వ్యాపారమైన చోట
స్నేహానికి మురికి ఎందుకు అంటదు
కలిసే ప్రతి కలయుకూ కరెన్నీ లెక్కలు వేస్తుంది
లోకం కల్తీ అయినట్టే స్నేహాలూ కల్తీ అవుతున్నాయి..

స్వర్శతోనే నేనున్నాననే భరోసా
చూపుతోనే దిక్సూచీ దారి చూపే స్నేహం
ఎక్కడయినా దొరికితే స్వాగతం పలుకుదాం..
ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టే స్నేహాలు
కలిస్తే కబుర్లు చెప్పుకుంటుంటేనే
గుండెలో బరువును దింపేసే స్నేహాలు
కనిపిస్తే చేతులెక్కి మొక్కుదాం...

01/03/2012

భాధల బందీఖానాలో..


ప్రతి ఉదయం లాగా ఈ రోజూ రోటీన్ గా మొదలయింది
కాస్తభిన్నంగా ఉండాలనుకుని పెందలాడే లేచాను
రాత్రంతా నిదుర కరువైన కళ్ళు ఎరుపెక్కి వాచినట్టు ఉన్నాయి
అద్దం ముందు నిలుచుని నాలో నేనే నవ్వాలని యత్నించాను.
ఒళ్ళంతా కప్పుకున్న నరాలు చిట్లుతున్న శబ్దం
తలంతా తిప్పేస్తూ ఆలోచనల పొగలు వస్తున్న వాసనేస్తున్నాయి..
చిందరవందరగా భవిష్యత్తు భయంకర భూతమై బెదిరిస్తోంది
గంభీరత తప్పిస్తే ఎంతకీ నవ్వు పెగలడం లేదు
పారే జలపాతంలా సవ్వడి చేయాల్సిన నవ్వు
ఎక్కడో పాతాల గంగలా ఉండిపోయిందేమో....
తూర్పు గుమ్మం ముందు గుమ్మడి కాయలా వేలాడుతున్న
ఉదయభానుడు ఎంత బాగున్నాడో
పలుకరిద్దామనుకుని సూర్యనమస్కారం చేయాలనుకున్నా..
ఎంత సేపయినా చేతకావడం లేదు..
ఒక్కటి మాత్రం అర్థం అయింది.
బతుకు పరుగు పందెలో మూలాలు మరచిపోతూ
మెతుకు వెతుకులాటలో బంధాలు తెంచుకుంటూ
మనిషితత్వాన్ని వదలి మనితత్వాన్ని కప్పుకుని
శరవేగంతో పోతున్నది పతనం వైపని
ఎక్కడో అంతరాత్మ అంటున్నది.. ఎవరికోసం ఈ బతుకని
ఎక్కడో మనసాక్షి అంటోంది.. ఈ పరుగు ఎన్నటికైనా ఆగక తప్పదని

అక్షర సూర్యోదయం.



చిన్నప్పటినుండి జీవితపు పలకపై
వాటిని చదువుతూనో.. వ్రాస్తూనో వున్నాం
అమ్మ అనే పదం  వ్రాసిన మొదటి సారి
బోయవాడు వాల్మీకి అయినట్టు తల్లితనం మురిసిపోయింది.
అర్థమయి అర్థంకానట్టు ఉండే జ్ఞాననేత్రాలు అక్షరాలు
ఆలోచనల ఆకాశం నుంచి
నేలకు రాలే చినుకులే అక్షరాలంటే
చినుకు చినుకు చేరి పారే జలపాతమైనట్టు
ఎంత దూరం అది పయనిస్తే అంతా కాంతిమయం ..
గుప్పెడంత అక్షరాలలో ఎంత నిగూఢ సాంద్రత
అక్షరం అమృతం చుక్కలా తాగిన వాడు మేధావుల సరసన
చేజేతులా నేలరాల్చుకున్న వాడిది నిత్యయాతన
సిరాచుక్కలోనుంటి జాలు వారిన క్షణం
అది ఎంతగా జీవం పోసుకుంటుందో కదా..
అక్షరాన్ని తొక్కిపెట్టే ఆయుధం ఏది ?
అక్షరానికి తుప్పుపట్టే సిలీంద్రియం ఏదీ ?
గేయమై గాయాల గొంతులోనుండి పల్లవిస్తున్నప్పుడు
ఆ అక్షరాలే స్వరాలతోమమేకమై భావతరంగిణిలు అవుతున్నాయి..
అక్షరాలలో కన్నీటిని నింపి పన్నీటిని తీయవచ్చు..
అక్షరాలలో నీరుగారిన వాడిని నింగికి నిలబెట్టవచ్చు..
నిద్రాణమైన చోట అక్షరం నినాదమై మేల్కొలుపుతోంది
రండి జీవితాలలో అక్షరాలను ధరిద్దాం..
అక్షరం మొలకెత్తి శిరస్సు ఎత్తి నిలబడితే సూర్యోదయం

విరహ సందేశం


నన్నునేనే మరచి
నీధ్యానంలో మునిగితే
పిచ్చివాడినంటున్నది లోకం..
నిన్నే తలచి నీకై వగచి
నీ వెంటపడుతుంటే
వెర్రివాడంటోంది మిత్రబృందం..
నాకు తెలుసు ప్రియతమా..
నీకై ఎంతగా అంగలార్చినా..
నీవు అందకపోవచ్చుగాని
నీకోసం తపించడంలో ఉన్న తృప్తి
నీ విరహంలో ఉండే సంతృప్తి గాఢత
నీవు లేకుండా
నాకు జీవించడంలో దొరుకుతుందా ..చెప్పు..
అందుకే నీకోసం తపిస్తున్నాను..
నీవు వస్తానంటే ఊపిరి తోరణం కట్టి ఆహ్వానిస్తాను..
నీవు ఛీత్కరిస్తే నీ ఊసులు ఊపిరి చేసుకుంటూ మరణిస్తాను..

భావమే బలం


కదిలే కాలినడకకు
గమ్యం దూరమెందుకు
ఎగిరే గువ్వరెక్కకు
ఆ నింగి దాసోహం

ముడుచుకుపోతున్నావని
సిగ్గుపడకు
పిడికిలి ముడుచుకునే ఉంటుంది..

నేలకు వంగి పోయానని
బానిసవయ్యావనుకోకు
శరం వంగే ఉంటుంది

జీవితం ప్రశ్నగా మారితే
ఉరికొయ్యకు వేలాడటం కాదు..
ప్రశ్నగా ఉదయించి చూడు
జవాబు కాళ్ల బేరానికి వస్తుంది

వెతుకులాట

చేజార్చుకున్నవి
పోగొట్టుకున్నవి
వెతుక్కుందాం...
ఆలస్యం చేయకండి
దారి తప్పిన కలలను
పూలమాలలుగా కట్టి
జీవితాని గుమ్మానికి
అలంకరించుకుందాం..
మురికి కాల్వల్లో జల్లడపట్టే
చేతులకు పసిడి దొరకుతున్నట్టు
బాల్యమయినా..
యవ్వనమయినా
తిరిగి దొరుకుతుందేమో చూద్దాం
వాడిన ముడతల ముఖాలపై
వాడని నవ్వుల మొలకలకు
ఆశల వసంతం
ఆసరా అవుతుందేమో
కనుక్కుందాం
సందేహం ఎందుకు మిత్రమా...
సాగరమైనా చుక్క చుక్క తోడేద్దాం...
ఆకసమైనా గువ్వ రెక్కలతో ఎగిరేద్దాం..