EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

27/11/2011

ఎడారిలో వసంతం

గుప్పెడు కూడా లేని గుండె
నీకు ఓ ఆలయం అయింది.
కళ్ళు నీ కలల కాణాచిగా మరి
స్వప్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయి
తలపులు నీ మైమరపులో మునిగిపోయి
తన్మయత్వంతో తేలియాడుతున్నాయి ..
నా జీవన కోటకు రాణిగా మారిన నిన్ను చూసి
నాలోని ఆణువణువూ సైనికుడిగా మారి
నీకు  రక్షణ గా వుండాలని పోరుతున్నాయి
నిన్న నీవు నవ్విన్న నవ్వుకు
నా మనసు సెలయేరు పరవళ్ళు తొక్కుతోంది
నీవు చూసిన వాలు చూపుకు
నిండు ఎడారిలో  సైతం వసంతం విరబూస్తోంది!!

11/11/2011

రెక్కలు





సూటి పోటీ మాటలు
తూటాల్లా తగులుతుంటే
గుండెల్లో సూది గుచ్చుకున్నట్టు
తల్లడిల్లుతాము ...

ఎదుగుతున్న మనకెదురుగానే
అడ్డంకుల ఆనకట్టలు కడుతుంటే
ఏమిటీ లోకం తీరని వాపోతాము..

విసిరిన రాళ్ళకు విసుగుచెందితే
చెట్లు పండ్లను ఎలా అందిస్తాయి ...
అలల తాకిడికి అలిసిపొతే సంద్రం
సాగరం ఎందుకు అవుతుంది ..

వెక్కిరించిన చోట
వెక్కి వెక్కి ఏడువడం
చేతకాని పని
వెంటాడి వేటాడిన చోట
వెన్ను చూపి పారిపోవడం
పిరికి లక్షణం ..

చిక్కటి కష్టాల చీకట్లలోనూ
చిరునవ్వులు దీపాలుగా వెలిగించుకోవాలి
కలసిరాని కాలం కాటేస్తున్నప్పుడు
ఓర్పు మంత్రం పటిస్తూ ఓపిక పట్టాలి

చిక్కు ముడులు పడిన చోట
చికాకు పనిచేయదు ..
అడుగు ముందుకు పడని చోట
పరుగు పనిచేయదు !!

రెక్కలు తెగిన చోట
పైకి ఎగురడం తొందరపాటు అవుతుంది
దిక్కులను రెక్కలు చేసుకొనే నేర్పు
జీవితాన్ని అర్ధవంతం చేస్తుంది ..







03/11/2011

చావు కేక !!

 
నరాలన్నీ బిగించి
తమ హక్కుల కోసం వారు
గొంతెతక్కక పోయివుందోచ్చు
తమ కన్నీటిని తామే తాగి
మన నోటికి ముద్దలు అందించి ఉండొచ్చు ..
పంచ భూతాలను తమ నాగలి తో శాసించి
వితై భూమిలో దిగి
చిగురై నేలను చీల్చుకు పైకొచ్చి
ధాన్యరాసిగా మన వాకిట్లో వాలి ఉండొచ్చు ..
ఆ అన్నదాత తండ్రి కన్నా గొప్ప వాడు
మనల్ని శపించి వీధి పాలు చేయలేదు ..
ప్రభుత్వాల్ని ధిక్కరించి బంద్ లు చేయలేదు
రాస్తా రోకోలు ,, రైలు రోకోలు చేయలేదు
చేతులు కాలుతున్నా మౌనం వహించాడు
ప్రభుత్వం కళ్ళు తెరవడానికి
పంట విరామం ప్రకటించాడు ..
అయినా దొరల మనసు కరుగలేదు ..
రైతుల దుస్తితి పై కనికరం చూపలేదు ..
పండిన పంట రైతుకు రొక్కం రాక పొతే
రైతు నోట్లో మట్టి కొట్టినట్టే !
ఉరికొయ్యకు రైతు వేలాడితే
ఊరు స్మశానమయినట్టే !!
 

02/11/2011

అనుకోలేదు

నీ నవ్వును ముత్యాలతో పోల్చితే
మరింత నవ్వుతావని ఆశించాను
సిగ్గుతో ముడుచుకు పోతావనుకోలేదు..
నీవు అజంతా శిల్పంలా వున్నావని పొగిడితే
రోజు దర్శనం ఇస్తావని ఊహించాను ..
కనిపించడం మానేస్తావని అనుకోలేకపోయాను !
చివరకు నీవే నా ఊపిరివని కనిపిస్తే చాలన్నాను
నాతొ ఏడు అడుగులు నడిచి నాలో సగమైయావ్వు ..
నా జీవనానికే ఓ అర్ధాన్ని తెచ్చిన అర్ధాంగివయ్యావు!!
 

01/11/2011

అంతర్ముఖం

 
 
బయట కనిపించే నేను
నేను కాదు
చిరునవ్వుతో కప్పిన నా పెదవుల వెనుక
తొక్కిపట్టిన ఎంతో క్రోధం వుంది
స్వాగతంతో చేసిన కరచాలనంలో
ఊహ్యత్మకంగా వేసుకున్న ముసుగులున్నాయి.
నేను కనిపించే నేను కాదు
మాటలకు మర్యాద పులుముకొని
తోడుగుకొన్న ఇస్రీ బట్టల వెనుక
సల సలా కాగిపోతున్న కుల్లుబోతుతనం వుంది ..
ఈర్ష్య అసూయల నడుమ బందీగా మారిన నేను
ఎదుగుతున్న మొక్కల చిగ్గుర్లను తుంచివేసిన
కసాయి తనం వుంది..
మీకు తెలుసా వ్యాపారం అంటే ఏమిటో
నాకు తెలుసు
నవ్వులను మార్కెటింగ్ చేయడం తెలుసు
చెవిలో పువ్వులను పెట్టి నమ్మిన వాళ్ళను పూల్స్ గా చేయడం తెలుసు
అయితే మనసుకు సమాధానం చెప్పలేక పోతున్న
వేస్తున్న వేషాలకు .. చేస్తున్న చేతలకు పొంతన లేక
రాక్షసుడిగా వుంది మనిషిగా జీవించలేకున్నా..
నరకం అంటే నాకు తెలుసు
నా ముందు నవ్వి ...నా వెనుక నన్ను తిట్టినా వాళ్ళు ఎందరొ
నాతొ పని పూర్తి చేసుకొని ఆ తరువాత హాండ్ ఇచ్చిన వాళ్లెందరో ..
నమ్మకమైన వారిని సంపదించలేక పోతున్నా