EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

01/03/2012

అక్షర సూర్యోదయం.



చిన్నప్పటినుండి జీవితపు పలకపై
వాటిని చదువుతూనో.. వ్రాస్తూనో వున్నాం
అమ్మ అనే పదం  వ్రాసిన మొదటి సారి
బోయవాడు వాల్మీకి అయినట్టు తల్లితనం మురిసిపోయింది.
అర్థమయి అర్థంకానట్టు ఉండే జ్ఞాననేత్రాలు అక్షరాలు
ఆలోచనల ఆకాశం నుంచి
నేలకు రాలే చినుకులే అక్షరాలంటే
చినుకు చినుకు చేరి పారే జలపాతమైనట్టు
ఎంత దూరం అది పయనిస్తే అంతా కాంతిమయం ..
గుప్పెడంత అక్షరాలలో ఎంత నిగూఢ సాంద్రత
అక్షరం అమృతం చుక్కలా తాగిన వాడు మేధావుల సరసన
చేజేతులా నేలరాల్చుకున్న వాడిది నిత్యయాతన
సిరాచుక్కలోనుంటి జాలు వారిన క్షణం
అది ఎంతగా జీవం పోసుకుంటుందో కదా..
అక్షరాన్ని తొక్కిపెట్టే ఆయుధం ఏది ?
అక్షరానికి తుప్పుపట్టే సిలీంద్రియం ఏదీ ?
గేయమై గాయాల గొంతులోనుండి పల్లవిస్తున్నప్పుడు
ఆ అక్షరాలే స్వరాలతోమమేకమై భావతరంగిణిలు అవుతున్నాయి..
అక్షరాలలో కన్నీటిని నింపి పన్నీటిని తీయవచ్చు..
అక్షరాలలో నీరుగారిన వాడిని నింగికి నిలబెట్టవచ్చు..
నిద్రాణమైన చోట అక్షరం నినాదమై మేల్కొలుపుతోంది
రండి జీవితాలలో అక్షరాలను ధరిద్దాం..
అక్షరం మొలకెత్తి శిరస్సు ఎత్తి నిలబడితే సూర్యోదయం

విరహ సందేశం


నన్నునేనే మరచి
నీధ్యానంలో మునిగితే
పిచ్చివాడినంటున్నది లోకం..
నిన్నే తలచి నీకై వగచి
నీ వెంటపడుతుంటే
వెర్రివాడంటోంది మిత్రబృందం..
నాకు తెలుసు ప్రియతమా..
నీకై ఎంతగా అంగలార్చినా..
నీవు అందకపోవచ్చుగాని
నీకోసం తపించడంలో ఉన్న తృప్తి
నీ విరహంలో ఉండే సంతృప్తి గాఢత
నీవు లేకుండా
నాకు జీవించడంలో దొరుకుతుందా ..చెప్పు..
అందుకే నీకోసం తపిస్తున్నాను..
నీవు వస్తానంటే ఊపిరి తోరణం కట్టి ఆహ్వానిస్తాను..
నీవు ఛీత్కరిస్తే నీ ఊసులు ఊపిరి చేసుకుంటూ మరణిస్తాను..

భావమే బలం


కదిలే కాలినడకకు
గమ్యం దూరమెందుకు
ఎగిరే గువ్వరెక్కకు
ఆ నింగి దాసోహం

ముడుచుకుపోతున్నావని
సిగ్గుపడకు
పిడికిలి ముడుచుకునే ఉంటుంది..

నేలకు వంగి పోయానని
బానిసవయ్యావనుకోకు
శరం వంగే ఉంటుంది

జీవితం ప్రశ్నగా మారితే
ఉరికొయ్యకు వేలాడటం కాదు..
ప్రశ్నగా ఉదయించి చూడు
జవాబు కాళ్ల బేరానికి వస్తుంది

వెతుకులాట

చేజార్చుకున్నవి
పోగొట్టుకున్నవి
వెతుక్కుందాం...
ఆలస్యం చేయకండి
దారి తప్పిన కలలను
పూలమాలలుగా కట్టి
జీవితాని గుమ్మానికి
అలంకరించుకుందాం..
మురికి కాల్వల్లో జల్లడపట్టే
చేతులకు పసిడి దొరకుతున్నట్టు
బాల్యమయినా..
యవ్వనమయినా
తిరిగి దొరుకుతుందేమో చూద్దాం
వాడిన ముడతల ముఖాలపై
వాడని నవ్వుల మొలకలకు
ఆశల వసంతం
ఆసరా అవుతుందేమో
కనుక్కుందాం
సందేహం ఎందుకు మిత్రమా...
సాగరమైనా చుక్క చుక్క తోడేద్దాం...
ఆకసమైనా గువ్వ రెక్కలతో ఎగిరేద్దాం..

23/02/2012

అందంతే అలా జరిగిపోతుంటుంది..


వేకువ జాముననే లేచి నడిచినంత మాత్రాన
చీకటి పోయి సూర్యోదయం వచ్చినట్టుకాదు..
సాయం సంధ్య లో బతుకు మసకబారిందని జడిసి
నింగి చుక్కల చీర కట్టుకున్నట్టు కాదు..
ఎందుకని ప్రశ్నించకు
అందంతే అలా జరిగిపోతుంటుంది
కాలం కర్పూరమై కరిగిపోతుంటుంది

పేద, గొప్పతేడా ఎక్కడుంది
కనుల రెప్పలు మూసినప్పుడు
కలల రెక్కలు విచ్చుకుంటాయి
కనులు తెరిచి చూసినప్పుడు
అలజడి అలలు క్రమ్ముకుంటాయి
పుట్టుక, చావు మాత్రమే సమానమై
బతుకంతా తారతమ్యం ఉన్నప్పుడు
పగటి కలలు కూడా పగబట్టి
ఒక నిర్దిష్ట వలయంలోనే ఉండిపోతాయి

ఎంతగా నటించినా మోముపై పులుముకున్న
నవ్వుల ఇంద్రధనస్సు వట్టిదని తేలిపోతుంది.
ఎంతగా దట్టించినా మాటలలో నింపుకున్న
డాబుసరి గాలి తీసిన ట్యూబులా వాలిపోతుంది.

నిస్సహాయంగా చూసే కళ్ళను తప్పు పడితే ఏమోస్తుంది.
జలపాతమై నేల రాలే కన్నీటి చుక్కలు తప్ప
నిర్దయగా మారిన మనసు పొరలను తిడితే ఏమోస్తుంది
వికలమైన నోట రాలే సారీ అనే రెండు పదాలు తప్ప

15/02/2012

ఆశ

నల్లబడ్డ ఈ ఆకాశంలో
ఉరుమునై ఉరిమి
మెరుపునై మెరిసి
వాన చుక్కనై నేల రాలాలని ఉంది..
నేలరాల్చుకున్న కలలను
దోసిలిపట్టి పైకి లేపి
వాటికి స్వేచ్చారెక్కలు తొడిగి
ఎగురవేయాలని ఉంది..
నేలవాలిన కొమ్మల శిరస్సులను
నిటారుగా పైకి నిలిపి
చిగురుల మొలకలు వేయించాలని ఉంది..

15/12/2011

అక్షరం మరణించదు


ఒక్క పదం చాలదా
వేల ఆలోచనలు పుట్టడానికి .
ఒక్క చురక చాలదా
నిద్రిస్తున్న మెదళ్ళు మేల్కొనడానికి
అహంకారంతో కళ్ళను మూసుకొంటే
అక్షరాలు  తిరుగుబాటు ప్రకటిస్తాయి
ఇమిడివున్న భావాలకు ఏదో ఒక రంగు పూస్తే
అవి రగిలే గుండెల శ్వాసగా మారుతాయి ..
కలాన్ని ఇజాలనే చట్రంలో బంధించేస్తే
అరచేతుల్లో సముద్రాన్ని పట్టిపెట్టినట్టే !
శవాన్ని పాతిపెట్టినట్టు అక్షరాలను
నేలలో పాతాళానికి పాతలంటే
అవి నిర్జీవమైన శవాలు కావు శరాలు
మొలకలై మొలకెత్తి .. చిగురులై శిరస్సు ఎత్తి
కొమ్మలు రెమ్మల్లుగా అల్లుకుపోయే
జీవితాల పరిమళాల్ని  పెనవేస్తుకున్న బీజాక్షరాలు !
అక్షరం మరణించదు
ఆలోచనా మరణించదు
మరణిస్తే
అది అక్షరమెందుకు అవుతుంది ..
ఆలోచన ఇవ్వకపోతే
అది చైతన్యమెందుకు అవుతుంది ..!!