EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

11/11/2011

రెక్కలు





సూటి పోటీ మాటలు
తూటాల్లా తగులుతుంటే
గుండెల్లో సూది గుచ్చుకున్నట్టు
తల్లడిల్లుతాము ...

ఎదుగుతున్న మనకెదురుగానే
అడ్డంకుల ఆనకట్టలు కడుతుంటే
ఏమిటీ లోకం తీరని వాపోతాము..

విసిరిన రాళ్ళకు విసుగుచెందితే
చెట్లు పండ్లను ఎలా అందిస్తాయి ...
అలల తాకిడికి అలిసిపొతే సంద్రం
సాగరం ఎందుకు అవుతుంది ..

వెక్కిరించిన చోట
వెక్కి వెక్కి ఏడువడం
చేతకాని పని
వెంటాడి వేటాడిన చోట
వెన్ను చూపి పారిపోవడం
పిరికి లక్షణం ..

చిక్కటి కష్టాల చీకట్లలోనూ
చిరునవ్వులు దీపాలుగా వెలిగించుకోవాలి
కలసిరాని కాలం కాటేస్తున్నప్పుడు
ఓర్పు మంత్రం పటిస్తూ ఓపిక పట్టాలి

చిక్కు ముడులు పడిన చోట
చికాకు పనిచేయదు ..
అడుగు ముందుకు పడని చోట
పరుగు పనిచేయదు !!

రెక్కలు తెగిన చోట
పైకి ఎగురడం తొందరపాటు అవుతుంది
దిక్కులను రెక్కలు చేసుకొనే నేర్పు
జీవితాన్ని అర్ధవంతం చేస్తుంది ..







1 comment:

Comment on Telgu poem