EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

30/09/2011

ప్రియ (స్వ )స్వాగతం



ఉదయం ఉషోదయం

నవ్వుతూ నువ్వు వస్తుంటే

చీకటిలా కుములుతున్న

జీవనాన ఆనందాల నర్తనం

ఓ హృదయ వన మయూరీ

గల గల గోదారివై నడయాడుతుంటే

ఎంకిలా అనిపిస్తావు ..

కల్మష మెరుగని చూపులతో

నిర్మల మానస చిత్తంతో

నీవు కనపడితే చాలు సుమా

నా గుండెలో నీకు కోవెల కట్టి

పూజించాలంత భక్తి పుడుతుంది

నీలాల నింగిలో తారకవా

జాబిలి పున్నమి వెన్నలవా

ఎంత చల్లని మైమరపు నీ తలపులలో

ఎంత కమ్మని హాయి నిటూర్పు
నీ కలలలో

పల్లె పైర గాలివై కమ్ముకుపోవా!

ప్రాణ సఖి ఈ జీవితాన ఎప్పటికి వుండిపోవా!!
                                               - కరణం లుగేంద్ర పిళ్ళై

29/09/2011

అమృత మూర్తులు



అఆలు దిద్దించి ...

విద్యాబుద్ధులు చెప్పించి
నడత, నాణ్యత జొప్పించి
ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు ...

నవమాసాలు మోసి ..
తానూ చచ్చి బతికి
మనకు జన్మ నిచ్చి
కంటికి రెప్పలా కాపాడిన అమ్మ..

తానూ మండుటెండలో స్వేదమై కరిగి..
తానూ అందుకోలేని ఎత్తులను
మనం అందుకుంటుంటే చూడాలని
మన ఎదుగుదలకు మెట్లుగా మారి
మనలో ఆశయాల ఊపిరులూదిన నాన్న !


తోడూ నీడలా వెంట వుండి
పాలు తేనెలా మన జీవితలో కలగలిసి పోయే
రోజూ తన ఆప్యాయతలను కురిపించే అర్ధాంగి !


వీరు అమృత మూర్తులు
వీరి ఋణం తీర్చగలమా ?

వారి త్యాగం ఎప్పటికి మరువలేనిది
వారికి చేయూతనివ్వడం మన విధి !!

                                                  -కరణం లుగేంద్ర పిళ్ళై

26/09/2011

పెద్ద మనసు కావాలి !

వర్షపు చినుకుకై
కోయిల ఏడుస్తుంటే
మనకు అది పాటలా శ్రావ్యంగా వుంటుంది ..
పేదల ఆకలి ఏడుపులు కూడా
ఉన్నోల్లకు కాలక్షేపంగా మారిందేమో

గోదాముల్లో బియ్యం కుళ్ళి పోతున్నా
పేదలకు పెట్టాలన్న ఆలోచన రాదు
ధరలు తగ్గించాలన్న యోచనే రాదు
ఇది ప్రజల ప్రభుత్వం అంటారు ..
కాని ప్రజల కోసం పని చేసే వారే లేదు

                 -   కరణం లుగేంద్ర పిళ్ళై

మన అడుగుజాడ గురుజాడ


మన అడుగుజాడ గురుజాడ
మన వెలుగుజాడ  గురుజాడ
కన్యాశుల్కం పాత్రల రచనల అక్షర శిల్పి 
తుప్పు పట్టిన చాంధస భావాల నడ్డి విరిచి
నాటకమైనా  , కవితైనా ,కథైనా
వాడుక భాషకు మరల్చి
ప్రజా భాహూల్యానికి అందించిన సంస్కర్త ..
దేశమంటే మట్టి కాదని
దేశమంటే మనుషలని ప్రభోదించిన మానవతావాది
ముత్యాల సరాలు ..రత్నాలై మెరుస్తుంటే
తెలుగు తల్లి పులకించి పోయింది
సాహిత్యానికి సమాజ స్పృహే గీటు రాయన్న వాడు
"గురు " జాడలు మరిచితే మన జాతిని మరిచినట్టే..
తెలుగు జాతి పితకు అక్షరాంజలి !!

గురుజాడ 150 జయంతి సందర్భంగా చంద్రునికో నూలు పోగు ..
                                     -కరణం లుగేంద్ర పిళ్ళై


23/09/2011

మూలాలను పెకలిద్దాం !

సంతలో చంటి బిడ్డను అమ్ముతూవుంటే
ఎందుకు అమ్ముతున్నారని నిలదీశాను !
పెరిగి పెద్దయ్యాక ఆ పిల్ల పెళ్ళికి
కట్నం ఇవ్వాలిసి వచ్చి ఇల్లు అమ్ముతుంటే
మౌనంగా చూస్తుంది పోయాను !
పారాణి ఆరక ముందే
అగ్నిధారాలలో మసిగా మారితే
రెండు కన్నీటి చుక్కలై కరిగిపోయాను !

మూలాలు పెకలించకుండా చిగుర్లు తుంచినా
తిరిగి మొలకేత్తదని అర్ధమై , హృదయం అర్ద్రమై పోయింది .
అయిన కర్తవ్యం గురుతుకు వస్తోంది ..

చీకటిలో కుమిలి పోవడంమెందుకు ?
ఇప్పుడు తగిలి వేయవలసింది
మలినమైన పాత భావాల్ని
వెన్నెల ఊరవతలే వుండిపోతోంది
రండి మనం స్వాగాతిద్దాం!

కలుపు లా విషమయమైన
మూలాలు పెకలించి వేసి
విత్తు నుండి చిటారు కొమ్మలపై దాక
సంతోష చిగుర్లు మోలిపిద్దాం !!

                                   -కరణం లుగేంద్ర పిళ్ళై


22/09/2011

ఆరాధన


తను నా ఊహల నాయిక
అయితేనేమి ఈ అల్పుడికి
నీడై తోడై వున్నట్టు వుంటుంది 
తను మాటల జలధార అనుకున్నా
మౌనంగా నిశబ్దమై ఆవరిస్తుంది ..
ధ్యానంగా ఆరాదిస్తుంటే 
ఉచ్స్వాస నిశ్వాస తానవుతుంది 
ఆమెను చేరుతానో లేదో కాని
ఆమె తలపులలో మునిగిపోతున్నా ...

                              కరణం లుగేంద్ర పిళ్ళై
 





19/09/2011

విజేత ..

ఒక్కో సారి కష్టపడి
ఎన్ని మెట్లు ఎక్కినా
దురదృష్టం అనే పాము కాటుకు
నేల జారి పోతాము
నిరాశా చీకట్లలో వుండి పోతుంటాము!

ఒక్కో సారి అప్రయత్నంగా
ఆయాచితంగా నిచ్చెనలు దొరికి
ఆకాశం అంచులకు ఎక్కిపోతాం
గాలిలో మబ్బులై తెలిపోతుంటాం
మనల్ని మించిన వారు లేరని బ్రమిస్తుంటాం !

రెండూ తప్పే నేస్తమా
గెలుపు ఓటములు కాదు
ప్రయత్నం చేయడం ముఖ్యం!
అందలం ఎక్కినా
పాతాళంకు జారిపొయినా
సడలని ఆత్మ విశ్వాసం వున్నా వాడే
నిజమైన విజేత ..