ఆంబోతులు కొట్లాడుకుంటే చలిచీమలు ఏమవుతాయి ..
సమిధలై , పరమపద సోపానలై అమరవీరులై తరిస్తాయి
పదవులే పరమార్థమై మనసు రాతి బండగా మారిన వారికి
సాటి మనుషుల వ్యధ ఎలా అర్థమవుతుంది !
గుడిసెల గుండెల్లో బరిసెలు దింపుతున్న
బడా బాబులకు ఎప్పుడూ ఏమికాదేమి ?
దేనినైనా వారు తమకు అనుకూలంగా మలుచుకుంటారు
ప్రతి సంఘటన నుండి తాము పొందాల్సిన లబ్ది తప్ప
వార్తల్లో విరుచుకుపడే నాయకత్వం బలిమి తప్ప
సమ్మె పోటుతో చలిమంటలేసుకున్న వెచ్చదనం తప్ప ..
ఇంకేమిపట్టని పక్కా వ్యాపారవేత్తలవుతున్నారు ..
మనుషుల మధ్య విభజన రేఖ గీసి , సమాఖ్య పరిధులు గీసి
మాట్లాడలేని మౌనాన్ని ఢిల్లీ వీదుల్లో వేలం వేస్తుంటే
మనం చేస్తునదేమిటి ?
కళ్ళు ఆప్పగించి చూడడం, సానుభూతి ఓట్లుగా మారడం
కష్టాల్ని కొనితెచ్చుకొని కొలిమిగా బగ బగ మండిపోవడం
లేకుంటే ఆత్మహత్యల మంటల్లో మసి కావడం ....
నాయకులు ఏమికారు , వారి పిల్లలు ఏమికారు
అనుచరులే ఆవేశానికి గురై అర్పనకు గురువుతున్నారు ..
మట్టిని కూడా మార్కెటింగ్ చేయడం ...
ప్రాంతాన్ని కూడా ఆత్మాహుతి దళంగా తయారు చేయడం
మనిషి నేర్చుకున్న ఆధునిక నేర్పరితనమేగా ..
ఏ వాదమైనా జన హితం కోరితే వేదమే అవుతుంది
ఏ భావనైనా శాంతిని కోరితే చిత్రమై వెళ్లి విరుస్తుంది
వాదాలు, వితందవాదాలు తెలియని పేదవాడు
నేల తల్లి పై ప్రేమతో త్యాగధనుడుగా అవతరిస్తాడు ...
అవకాశవాది చేతిలో ఆయుధమై పోకుండా ..
తన విచక్షణ ఉపయోగించి ఆలోచించగలిగితే
తూర్పున ఉదయించే సూర్యుడు అవుతాడు ..
లేకుంటే నేలరాలిపోయే మరో తోక చుక్క అవుతాడు !!
No comments:
Post a Comment
Comment on Telgu poem