EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

20/03/2012

తెలిసిందిలే.......


మూసిఉన్న గుప్పిట విప్పాను...
మనసు తేలికపడింది
కలల రెక్కలు విప్పుకుని
రంగు రంగుల
సీతాకోక చిలుకగా
ఎగురుతున్న సంతోషం...

నాలోకి నేనే ప్రయాణించాను..
నేనేంటో తెలిసింది
నిర్వేదపు మేఘాలు తప్పుకుని
చల్లని వెన్నల జలపాతం
జీవితాన కురుస్తున్న చప్పుడు..

పుష్పించే పూలను అడిగాను
పరిమళాన్ని చూపమని
అప్పుడే నాలో వికసిస్తున్న
వ్యక్తిత్వాన్ని చూపుతూ
నా అరచేతిలోకి వాలిపోయింది
మానవత్వం పరిమళిస్తున్నవాసన....

నియంతా.... నేలరాలుతావురా...........


తడిగుడ్డతో గొంతుకోసే
కసాయతనం నీకు వంటబట్టినప్పడు
మా వేదన నీకు ఎలా అర్థం అవుతుంది
మెత్తని మాయ మాటలతోనే
గుండెలో కత్తులు దింపే కళలో నిష్ణాతుడవయ్యాక
మా రోదన కూడా నీకు వెస్ట్రన్ మ్యూజిక్ అవుతుంటే
మనిషితోలు కప్పుకున్న రాక్షసుడిగా మారాక
నీకు ఎన్ని నీతి వచనాలు చెప్పినా చాలవు
నీ అహంకారానికి మా సహనం సలాం అన్నంతవరకే
నీ అధికారానికి బానిసలమై మేము గులాం అన్నంతవరకే
ఒక్కసారి తిరగబడితే నీవు తట్టుకోలేవు
ఆ ఆలోచనే నీకు నిదురలేని రాత్రులను బహుమతిగా ఇస్తుంది.
ఇక మేము మేల్కోంటే నీవు ఏమవుతావురా
మట్టిలో మట్టిగా కలసిపోవడం తప్ప

అమ్మా నీ తలపు..


జోలపాటలో జానపదమా
లాలిపాటలో లాలిత్యమా
అమ్మా ...నీ పాటలోనే
పరవళ్లు త్రొక్కును
మమతల సంగీతమాలికలు

మధురిమలు నీ గోరు ముద్దలు
నేటికి ఇరిగిపోలేదు ఆ రుచులు
నీ తలపురాగానే చెమ్మగిల్లే కళ్ళకు
ఎవరు కట్టగలరు ఈ భువిలో ఆనకట్టలు

ఎవరైనా ఆర్చేది
తృణమో ప్రణమో ఇచ్చుకుంటేనే.
దేవుడయినా తీర్చేది
ఏదైనా మొక్కుకుంటేనే .
ఎవరెస్టు ఎత్తుకు ఎదిగినా సరే
ఏమి ఇచ్చినా తీరని నీ రుణం ముందు
మేము మరుగుజ్జులయి పోయేది..


అవినీతి


చిన్నగానే కనిపిస్తోంది
ఏముందిలే అని వదిలేస్తే
రాచపుండై పాకేస్తోంది
పిప్పిపల్లు నోటిలో ఉంటే
మంచి పల్లును పాడుచేస్తుంది
కలుపు మొక్కలో చేలులో ఉంటే
ఎదిగే మొక్కలను చంపేస్తుంది..
ఇది అలాగే...
ఏరి పారేది ఎవరు..
వారు చేస్తారని వీరు
వీరు చేస్తారని వారు
ఎవరూ అతీతులు కారు
ఎవరూ పూనుకునే వారు లేరు
ప్రభుత్వం అందామా
అజారే పిలుపుకు నడుం బిగించినా
గొంతుల నొక్కి ఊపిరాడక చేస్తున్నారు
కసబ్ లను మాత్రం రాచమర్యాదలు ఇస్తున్నారు..
సగటు భారతీయుడా
ప్రశ్నలమై మేలుకుందామా లేకుంటే
దేశాన్ని అంధకారంలోనే వదిలేద్దామా..

ఎంతకాలం ??


 
మాటల్లో వర్ణించలేని తృణీకరణ భావాల్ని
మాపై శరాలుగా ఎక్కుపెడుతుంటే
మౌనంగా భరించడం నేర్చుకున్నాం

జాతులు , వర్ణాల అంతరాల దూరాల్ని
మా బతుకుల్ని విపత్తులై ముంచేస్తుంటే
జడపదార్థమై ఉండండం నేర్చుకున్నాం

అయినా ఎద సంద్రంలో ఎగిసిపడే
అలల కెరటాలను అదిమి పట్టడం
ఎంత కాలమనీ వీలవుతుంది

కాలప్రవాహంలో
ప్రతిదీ పరిణామక్రమంలో మారుతున్నట్టే
మా బతుకులెందుకు మారవు
మాలో నేను కుంచిచుకుపోతున్నాము
యుగయుగాలుగా...
మాలో మేము దహించుకుపోతున్నాము
పగలు సెగలుగా..


సానుభూతి కోరుకుంటూ
ఇనుపపాదాల క్రింది నలిగిన
జీవితాల కథల్ని చెబితే ఎవరు వింటారు

ఇప్పుడు భరించడమూ కాదు
ప్రశ్నించడం నేర్చుకుంటున్నాం..
కలల మొగ్గలకు వాడకుండా
కత్తులు కాపాలాగా తగిలిస్తున్నాం
అణగారిన ఆశలవనంలో
ఎవరెస్టు శిఖరాలకు చేరే
మేధావులకు పురుడు పోస్తున్నాం

స్నేహామా .. నీ వెక్కడ


భుజాలు రాసుకుంటూనే నిప్పులు రాజేయడం
కరచాలనాలై కలుస్తూనే కాలనాగులై కాటువేయడం...
ఇప్పుడు అన్నింటినీ స్నేహాలే అంటున్నాం

నీ స్నేహితుడి ఎవరో చెబితే
నీవెలాంటివాడివో చెబుతాయనేది
పాతరోజుల మాటయి పోయింది
అవసరార్థమోఅసంకల్పితమో...
మనం స్నేహాలు చేస్తూనే పోతుంటాం

కొన్ని హయ్ అనే పలకరింపుకే పరిమితం
కొన్ని ఛాయ్ భేటింగులకే పరిమితం
ముక్కుమొహం తెలియకపోయినా
సోదికబుర్ల ఛాటింగ్ కే మరికొన్ని..
ఎదుటి వాడు ఎలాంటి వాడయినా
పనికావడం కోసమే చేసే చెలిమిలు ఇంకొన్ని

ప్రతి బంధమూ వ్యాపారమైన చోట
స్నేహానికి మురికి ఎందుకు అంటదు
కలిసే ప్రతి కలయుకూ కరెన్నీ లెక్కలు వేస్తుంది
లోకం కల్తీ అయినట్టే స్నేహాలూ కల్తీ అవుతున్నాయి..

స్వర్శతోనే నేనున్నాననే భరోసా
చూపుతోనే దిక్సూచీ దారి చూపే స్నేహం
ఎక్కడయినా దొరికితే స్వాగతం పలుకుదాం..
ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టే స్నేహాలు
కలిస్తే కబుర్లు చెప్పుకుంటుంటేనే
గుండెలో బరువును దింపేసే స్నేహాలు
కనిపిస్తే చేతులెక్కి మొక్కుదాం...

01/03/2012

భాధల బందీఖానాలో..


ప్రతి ఉదయం లాగా ఈ రోజూ రోటీన్ గా మొదలయింది
కాస్తభిన్నంగా ఉండాలనుకుని పెందలాడే లేచాను
రాత్రంతా నిదుర కరువైన కళ్ళు ఎరుపెక్కి వాచినట్టు ఉన్నాయి
అద్దం ముందు నిలుచుని నాలో నేనే నవ్వాలని యత్నించాను.
ఒళ్ళంతా కప్పుకున్న నరాలు చిట్లుతున్న శబ్దం
తలంతా తిప్పేస్తూ ఆలోచనల పొగలు వస్తున్న వాసనేస్తున్నాయి..
చిందరవందరగా భవిష్యత్తు భయంకర భూతమై బెదిరిస్తోంది
గంభీరత తప్పిస్తే ఎంతకీ నవ్వు పెగలడం లేదు
పారే జలపాతంలా సవ్వడి చేయాల్సిన నవ్వు
ఎక్కడో పాతాల గంగలా ఉండిపోయిందేమో....
తూర్పు గుమ్మం ముందు గుమ్మడి కాయలా వేలాడుతున్న
ఉదయభానుడు ఎంత బాగున్నాడో
పలుకరిద్దామనుకుని సూర్యనమస్కారం చేయాలనుకున్నా..
ఎంత సేపయినా చేతకావడం లేదు..
ఒక్కటి మాత్రం అర్థం అయింది.
బతుకు పరుగు పందెలో మూలాలు మరచిపోతూ
మెతుకు వెతుకులాటలో బంధాలు తెంచుకుంటూ
మనిషితత్వాన్ని వదలి మనితత్వాన్ని కప్పుకుని
శరవేగంతో పోతున్నది పతనం వైపని
ఎక్కడో అంతరాత్మ అంటున్నది.. ఎవరికోసం ఈ బతుకని
ఎక్కడో మనసాక్షి అంటోంది.. ఈ పరుగు ఎన్నటికైనా ఆగక తప్పదని