ప్రతి ఉదయం లాగా ఈ రోజూ రోటీన్ గా మొదలయింది
కాస్తభిన్నంగా ఉండాలనుకుని పెందలాడే లేచాను
రాత్రంతా నిదుర కరువైన కళ్ళు ఎరుపెక్కి వాచినట్టు ఉన్నాయి
అద్దం ముందు నిలుచుని నాలో నేనే నవ్వాలని యత్నించాను.
ఒళ్ళంతా కప్పుకున్న నరాలు చిట్లుతున్న శబ్దం
తలంతా తిప్పేస్తూ ఆలోచనల పొగలు వస్తున్న వాసనేస్తున్నాయి..
చిందరవందరగా భవిష్యత్తు భయంకర భూతమై బెదిరిస్తోంది
గంభీరత తప్పిస్తే ఎంతకీ నవ్వు పెగలడం లేదు
పారే జలపాతంలా సవ్వడి చేయాల్సిన నవ్వు
ఎక్కడో పాతాల గంగలా ఉండిపోయిందేమో....
తూర్పు గుమ్మం ముందు గుమ్మడి కాయలా వేలాడుతున్న
ఉదయభానుడు ఎంత బాగున్నాడో
పలుకరిద్దామనుకుని సూర్యనమస్కారం చేయాలనుకున్నా..
ఎంత సేపయినా చేతకావడం లేదు..
ఒక్కటి మాత్రం అర్థం అయింది.
బతుకు పరుగు పందెలో మూలాలు మరచిపోతూ
మెతుకు వెతుకులాటలో బంధాలు తెంచుకుంటూ
మనిషితత్వాన్ని వదలి మనితత్వాన్ని కప్పుకుని
శరవేగంతో పోతున్నది పతనం వైపని
ఎక్కడో అంతరాత్మ అంటున్నది.. ఎవరికోసం ఈ బతుకని
ఎక్కడో మనసాక్షి అంటోంది.. ఈ పరుగు ఎన్నటికైనా ఆగక తప్పదని
No comments:
Post a Comment
Comment on Telgu poem