EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

22/03/2012

అమ్మకానికి పేదరికం ...!!!



దేశం ప్రగతి పథంలో నడుస్తోంది
పాలపొంగులా ఏ ఏటికాఏడు పైకి ఎగబాకే
మన ఆర్థికాభివృద్ధి రేటు అబ్బో ఎంత మెరుగో
వార్చి వడ్డించిన విస్తరిలో అంతా మాయ..
లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు......

నోటిలోకి నాలుగు వేళ్లు వెళ్ళకున్నా..
అకలి ప్రేగులు మెలిపెడుతున్నా..
అవి కావట ప్రభువులకు ప్రామాణికాలు...
పేదరికాన్ని కొలిచే కొలమాన రాళ్లు కూడా
దిగుమతి చేసుకునే నేతలకు ముందు చూపెందుకు ఉంటుంది
పనికట్టుకొని చూసే వాళ్ళకు అంతర్జాలం కనికట్టు
చూస్తుంటే అంతా పచ్చగానే ఉంటుంది మరి
కాస్త కళ్ళను నేలపైకి దింపి చూస్తేకదా..

బడ్డెట్ భూతం భూతద్దంలో బోల్డ్ లెటర్ లో సంక్షేమ పద్దులు
వార్త పత్రికల పతాక శీర్షికల కెక్కి కాగితాలలోనే ఇంకిపోతూ............
కారిచ్చులా వాడవాడలా వ్యాపించిన పన్నుల ప్రచారం
ఆకాశం ఎత్తుకు రోదసిలోకి నిత్యవసరాలు ఎగిరిపోతూ.........

ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టి
కిలో రూపాయికి బియ్యం ఇస్తేనేం..
ఆకలి తీరుతోందా .....
ప్లాష్ న్యూస్ స్క్రోలింగ్ర్ లో ఇప్పుడే అందిన వార్తంటూ
మద్యం సిండికేట్లకూ తెల్ల రేషన్ కార్డులు....

ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి
ఆరోగ్య శ్రీ ఉచితంగా అందిస్తేనేం
రోగాలు తగ్గితున్నాయా...
అందమైన భవంతులలో దొంగ ఆపరేషన్ల కోతలు..
ఖజానా కు చిల్లులు పెట్టే బిల్లుల తడిచి మోతలు
కట్ చేస్తే .. కాటికి పడకేసిన  ప్రభుత్వ దవాఖానాలు...

ఇదే కదా
ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడూ ఉండే తంతు
తెల్లబోవడం మాత్రం పేదవారి మనవంతు

పిండం ఫలధీకరణకోసం
అద్దెకు గర్భసంచిని ఓ తల్లి బేరానికి పెడుతోంది
పని వెతుక్కుంటూ చలి చీమల గుంపులై
రోడ్డుపై కూలీలు బారులు తీరుతున్నారు..
గొప్పలు చెప్పి గుప్పిట్లో బంధించిన
విష సంస్కృతికి విసిరిన పాచికకు
విలువలు ఉరేసుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి
ప్రపంచీకరణ అందించిన విజ్ఞానపు వీచికకు
శ్మశానంలో ప్రేగు బంధాలు కాలుతూ కమురు వాసన వేస్తున్నాయు

బతుకు బండిని నడిపే ధనం అనే ఇంధనం కోసం
వలసలతో  పట్టణాలవైపు పరుగులు తీస్తున్న జనం
పైటలు పరచే వృత్తికోసం విహంగాలై ఎగురుతన్నవనితల గుంపు
మనిషి తాను కూర్చోన్న కొమ్మనే తానే నరుకున్నట్టు
బంధాలన్నీనూలుపోగుల్లా తెగుతున్న చప్పుడు ..
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం..
ఏ కుప్పతొట్టి వెతికినా దొరికే ఆడశిశువులు
కుక్కలు నోట కరుచుకుపోతుంటాయి..
ఏ వీధి మలుపు తిరిగినా చిల్లర కోసం
దేబురిస్తున్న అనాథ జీవచ్ఛవాలు మురికి వాసన వేస్తుంటాయి
బస్టాండు, రైల్వే స్టేషన్ పేవ్ మెంట్ పై పేదరికం నిదురిస్తున్న దృశ్యాలు
విశ్వ విపణిలో అన్నింటికిధర పలుకుతోంది..
అమ్మడానికి సిద్ధమవుడమే తరువాయి
పేదవాడినో ఆటబొమ్మ చేసి  ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్టే
లేకుంటే వెన్నులపై వీపు విమానమోత మోగించే ఈ పన్నుల భారమేంటి
అయినా మన దారేదో మనది...
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం

మానవతకు చీడపట్టించిన సంస్కరణల పర్వంలో
పేద, ధనికుల మధ్య అంతరం పెరుగుతోంది
లేని వాడిని కొట్టి ఉన్న వాడికి రాయితీలు ఇస్తున్నఈ వక్రనీతిలో
పేదవాడిని బలిపశువు చేస్తున్న ఈ ఆర్థిక జాతరలో
ధరలు పెంచడం అంటే గాయంపై కారం పూసి బతుకును వేలం వేయడమే
అయినా పేదరికం అంటే
పూటగడవడక పోవడం కాదని నిర్వచించుకుందాం..
ఈ ఉగాది రోజయినా దేశం ప్రగతి పథంలో నడుస్తోంది భ్రమిద్దాం.

-కరణం లుగేంద్ర పిళ్ళై

3 comments:

  1. అద్భుతంగా వ్రాసారు,

    ఆశ,సహనం అనే రెండు చక్రాల బండిని
    భారంగా ఈడ్చే మధ్య తరగతి మానవుడికి
    భ్రమే ఊపిరి.
    భ్రమిద్దాం.

    ReplyDelete
  2. కంటి నుండి జారే కన్నీరు సరిపోదేమో ఈ మీ కవితలను వర్ణించడానికి

    ReplyDelete

Comment on Telgu poem