మా కలలు రెక్కలు కత్తిరించి
మా డొక్కల్ని ఎండగట్టి
ఊరి గుమ్మానికి దిష్టి గుమ్మడిగా
వేలాడదీస్తున్న నీ పెద్దరికం
ముందు
ఒంగి ఒంగి సలాం చేయాలంటావు..
దీపమై వెలగాలని బడి ఒడిలో
చేరితే
చెమట చిందించే చీకటి తప్ప
నాకు వేరే లోకంతో పని లేదంటావు
ఎంత బానిసయినా నేను మనిషే కదా
మనసు పారేసుకుని
మనువాడదామనుకుంటే
మంగళ వాయిద్యాలను మూగనోము
పట్టిస్తావు
నీ మోచేతి నీళ్ళు తాగుతూ ఒదగి
ఉండాలంటావు
లేకుంటే చర్మం ఊడదీసి చెప్పులు
కుట్టుకుంటానంటావు
ఏంది దొరా..మరసిపోనావు
సస్తే తీసేది ఆరు అడుగుల
గొయ్యే కదా..
పాడికి సకలం సిద్దం చేసేది
మేమే కదా.
ఇక నీ శవయాత్రకు లగ్గం
ఎట్టుకో..
చితి మంటకు కర్రలమవుదామని
ఇప్పుడే చిగురులు
వేస్తున్నాము.. (28.9.12)
No comments:
Post a Comment
Comment on Telgu poem