EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

10/08/2011

ఎదురు చూపు !


రెప్పలు వాల్చని ఆ జంట కళ్ళు
గబ్బిలాల్లా వాకిళ్ళకు వేలాడుతూనే ఉంటాయి
చెమ్మగిల్లిన జ్ఞాపకాలను చెంగు వారిస్తున్నా ..
ముసలి జీవాలు నెమరువేస్తూనే ఉంటాయి
కృష్ణాష్టమి కృష్ణుడే   ఆ ఇంట నడిచినట్టు జ్ఞాపకం
బోసి నవ్వుల బాబు కిలకిల నవ్వినట్టు జ్ఞాపకం
లేక లేక పుట్టిన వారసుడు ఇంతింతై ఎదుగుతుంటే
రోజూ దిష్టి తీసి దోషం లేకుండా చేసినట్టు జ్ఞాపకం
పలకా బలపం చేతబట్టినప్పుడు పొంగిపోయినట్టు జ్ఞాపకం
కాలేజి చదువుకోసం పొలం అమ్మిన జ్ఞాపకం
వాడు విదేశాలకు వెళ్ళాలంటే వి. ఆర్. యస్  తీసుకున్న జ్ఞాపకం
మిణుకు మిణుకుమంటూ ఎక్కడో చావని ఆశ
సంద్రంలోని జీవన నౌకకు దిక్సూచి అవుతోంది ...
పెనవేసుకున్న పేగుబంధం పురిటి వాసన గొంతు
ఫోనులో వింటేనే పోయిన ప్రాణం తిరిగి వస్తోంది ..
బాబూ .. మేము బతికివుండగానే ఓసారి రావా! అన్న మాట
గొంతు గడప దాటాక మునుపే పూడుకుపోతోంది !
బతుకు రెక్కలు తొడిగిన బిడ్డ
దూరదేశాలు వెళ్ళినందుకు గుండె ముక్కలవుతోంది !!

- కరణం  లుగేంద్ర పిళ్ళై

No comments:

Post a Comment

Comment on Telgu poem